శుక్రవారం 30 అక్టోబర్ 2020
Devotional - Oct 17, 2020 , 09:36:22

శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రులు

శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రులు

శ్రీశైలం :  ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో శనివారం శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయంలో గణపూజ, స్వస్తి పుణ్యాహవాచనం, దీక్షా సంకల్పం, కంకణ పూజ, బుత్విగ్వరణం, యాగశాల ప్రవేశం, అఖండదీప స్థాపన, వాస్తుపూజ, మండపారాధన, చండీ కలశస్థాపన, వాస్తుపూజ, మండపారాధనచ, కలశస్థాపన పూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయ యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు శ్రీభ్రమరాంబిక అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనుంది. ఈ అలంకారంలో అమ్మవారు ద్విభూజాలు కలిగి కుడిచేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో పద్మం ధరించి ఉంటుంది. నవదుర్గలలో ప్రథమ రూపమైన ఈ దేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు, విజయాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

ముఖ్యంగా ఈ దేవి ఆరాధన వల్ల ముత్తయిదువులకు ఐదోతనం వృద్ధి చెందుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు వాహనసేవ, చండీ, రుద్ర హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్లకు భృంగి వాహన సేవ నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి భృంగి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ఆవరణలోనే పూజలు చేయనున్నారు. కొవిడ్‌ నేథప్యంలో గ్రామోత్సవాన్ని రద్దు చేశారు. ఆలయ ఈఓ కేఎస్‌ రామారావు ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణకు అధికారులు అన్నిఏర్పాట్లు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.