e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home చింతన ధర్మసార మిదం జగత్‌

ధర్మసార మిదం జగత్‌

‘ఋతంవచ్మి, సత్యం వచ్మి’ అని ప్రబోధిస్తున్నది ‘గణపత్యధర్వ శీర్షం’. ‘సత్యమే పలకాలి. ధర్మాన్నే ఆచరించాలి’ అని భారతీయ సనాతన వైదిక సంస్కృతి హెచ్చరిస్తున్నది. ధర్మాత్ములు, సత్యసంధులు జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా చివరికి విజయాన్నే సాధిస్తారని ధర్మరాజు, హరిశ్చంద్రాదుల గాథలు నిరూపిస్తున్నాయి.
కారే రాజులు? రాజ్యముల్‌ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరిమూటఁ గట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే? శిబి ప్రముఖులుం బ్రీతిన్‌ యశః కాములై
యీరే కోర్కెలు? వారలన్‌ మఱచిరే యిక్కాలమున్‌? భార్గవా!

పోతనామాత్యుడు (ఆంధ్ర భాగవతం)

- Advertisement -

‘పూర్వం ఎంతమంది రాజులు ఎన్నెన్నో రాజ్యాలను అధికార దర్పంతో పాలించారు కదా! వారెవరైనా శాశ్వతంగా ఉన్నారా? పోనీ, వాళ్లు పోయేటప్పుడు సిరిసంపదలేమైనా మూటగట్టుకొని పోయారా? కనీసం, ప్రపంచంలో వారి పేరైనా మిగిలిందా? ఏ కొద్దిమందో శిబి చక్రవర్తి వంటివారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారికి లేదనకుండా అన్ని కోరికలు తీర్చారు కదా! అలాంటి మహితాత్ములను ఈ లోకం ఏనాడైనా మరిచిపోయిందా?’
మన పూర్వుల దృష్టిలో ‘సంపాదన’ అంటే ‘శ్రేయస్సంపాదనమే’. కానీ, అర్థ సంపాదన కానేకాదు. శ్రేయస్సంటే ధర్మం, అభ్యుదయం. కేవలం ధర్మం ద్వారానే ప్రతిదీ సాధించారు. కీర్తినీ మూట గట్టుకొన్నారు.
ధర్మాదర్థః ప్రభవతి, ధర్మాత్ప్రభవతే సుఖం
ధర్మేణలభతే సర్వం, ధర్మసారమిదం జగత్‌

శ్రీ మద్రామాయణం (అరణ్యకాండ: 9-3)

‘లోకంలో ధర్మాచరణ వల్లనే అన్ని ప్రయోజనాలూ కలుగుతాయి. ధర్మం సుఖాన్నిస్తుంది. ధర్మం వల్లనే సంపదలు లభిస్తాయి. ధర్మమే సారవంతమైంది’.
కాబట్టే, పెద్దలు అవశ్యం ధర్మాన్నే ఆచరించమన్నారు. అందుకే, ధర్మానికి గ్లాని కలిగినప్పుడల్లా శ్రీకృష్ణ పరమాత్మ ఏదో ఒక అవతారాన్ని స్వీకరించి వస్తానని ‘భగవద్గీతా’ ముఖంగా ప్రవచించాడు. ఇంతకూ, ‘ధర్మమంటే ఏమిటి?’ అంటే, ‘ఇతరులు ఏ పనిచేయడం వల్ల మన మనస్సుకు బాధ కలుగుతుందో.. అలాంటి పనిని మనం చేయడం ద్వారా ఇతరుల మనస్సుకు బాధ కలిగించకపోవడమే అన్ని ధర్మాలలోకీ ఉత్తమమైంది’ అంటున్నది ‘మహాభారతం’.
మనుషులకే కాదు, సమస్త ప్రకృతిలో ఏ ప్రాణికీ కీడు తలపెట్టకూడదన్నది ఆర్షధర్మం. ప్రకృతి సహజధర్మాలకు విరుద్ధంగా ఎంతమాత్రం నడుచుకోవద్దన్నది మన పూర్వుల అభిమతం. ప్రకృతి సహజ సల్లక్షణాలకు విరుద్ధంగా నడుచుకోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో, ఎలాంటి అంతుపట్టని వింతవ్యాధులకు గురవుతున్నామో చూస్తూనే ఉన్నాం. అలాగే, అధర్మాన్ని ఆచరించడం ఎంత తప్పో అందుకు తోడ్పడటమూ అంతే తప్పు.
రావణాసురుడు సీతాదేవిని అపహరించాలని నిశ్చయించుకున్నాడు. తనకు తోడ్పడమని మారీచుని కోరడానికి వెళ్లాడు. ‘బంగారుజింకగా మారి సీతాపహరణానికి తనకు మార్గం సుగమం చేయమని’ అతడిని కోరాడు. మారీచునికి శ్రీరాముని దెబ్బల రుచి తెలుసు. ‘రావణుని కోరిక అసమంజసమని, పాటించకపోతే తనకు ప్రాణాంతకమవుతుందనీ’ తెలుసు. తనకు ఎటూ చావు తప్పదు. ఆ సమయంలో, ‘రావణునిలో కొంచెమైనా మార్పు వస్తుందేమో’ అన్న ఆశతో మారీచుడు చెప్పిన ఈ మాటలు సార్వకాలిక సత్యాలు.
సులభాః పురుషారాజన్‌ సతతం ప్రియవాదినః
అప్రియస్య చ పథ్యస్య వక్తాశ్రోతాచ దుర్లభః

‘రాజైన వానికి ఇచ్చకాలు మాట్లాడేవారు చాలామంది దొరుకుతారు. ముఖస్తుతి మాటలతో ఆనందింపజేసే వారెందరో ఉంటారు. కానీ, చేదైనా బాధ అయినా మందులాగా మేలు చేసే మంచిమాటలు చెప్పేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటివారు చెప్పింది విని ఆచరించే రాజులూ అరుదుగానే ఉంటారు. కనుక రావణా! అధర్మమైన నీ ఆలోచనను వదిలేయి’ అంటాడు. మారీచుడే కాదు మండోదరి, విభీషణ, కుంభకర్ణాదులూ ఎంతచెప్పినా రావణుడు చెవికెక్కించుకోలేదు. ఫలితం అనుభవించాడు.

మరుమాముల దత్తాత్రేయశర్మ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana