e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home చింతన అన్నమాచార్య జయంతి సందర్భంగా.. భక్త కవితా పితామహుడు

అన్నమాచార్య జయంతి సందర్భంగా.. భక్త కవితా పితామహుడు

సర్వభూతేషు యః పశ్యేద్‌ భగవద్భావ మాత్మనః
భూతాని భగవత్యాత్మన్యేష భాగవతోత్తమః
శ్రీ మద్భాగవతం (11.2.45)

అన్నమాచార్య జయంతి సందర్భంగా.. భక్త కవితా పితామహుడు

‘సర్వజీవులలో సర్వాత్మలకు ఆత్మ అయిన శ్రీహరిని చూస్తూ, తత్ఫలితంగా సమస్తాన్నీ ఆ భగవంతుని సంబంధంలోనే చూసేవాడు, సమస్తం ఆ దేవదేవునిలోనే నిత్యవిలసితమై ఉన్నదని ఎరిగి ఉండేవాడే భాగవతోత్తముడు’. ఈ నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనం మన భక్త కవితా పితామహుడు అన్నమయ్య. వారి తల్లిదండ్రులు శ్రీమాన్‌ నారాయణసూరి, లక్కమాంబ. వైశాఖ పూర్ణిమనాడు జన్మించిన అన్నమయ్య 95 సంవత్సరాలు శ్రీవేంకటేశ్వరుని సంగీతమయ ఆరాధనలో తన్మయులై జీవించారు. భగవత్ప్రేరణచే వైష్ణవ సంప్రదాయాన్ని స్వీకరించి ‘పద కవితా పితామహుని’గా ప్రసిద్ధి చెందారు. సుమారు 32,000 కీర్తనలు శ్రీవేంకటేశ్వరుని ప్రీత్యర్థం పాడిన మహోన్నత ధన్యజీవి మన అన్నమయ్య.

శ్రీమహావిష్ణువు ‘నందక’మనే ఖడ్గం అంశతో జన్మించిన అన్నమాచార్యులు భగవదాజ్ఞపైనే రోజుకొక కీర్తన రాసే సంకల్పంతో ముందుకు సాగి, స్వామి దివ్యానుగ్రహానికి పాత్రులయ్యారు. ‘భగవత్కీర్తనతో పరవశించే తన నాలుక ఇతరులను కీర్తించదని’ నిక్కచ్చిగా పలికిన కారణంగా ఆయన ఆనాటి రాజు క్రోధానికి గురై, కారాగారానికి కూడ వెళ్ళారు. కానీ, శ్రీవేంకటేశ్వరుని కీర్తనా మహిమతో ఆయన చేతులకు వేసిన గొలుసులు వాటంతటవే తొలగి కింద పడ్డాయి. ‘అదివో అల్లదివో శ్రీహరి వాసము..’ అంటూ ప్రారంభమైన శ్రీఅన్నమయ్య అద్భుత కీర్తనాఝరి నిరంతరం స్వామివారి సమస్త కల్యాణ గుణాలను, పండుగలను, విలాసాలను, లీలలను, భక్తరక్షణ కార్యాలను ఆద్యంతం అభివర్ణిస్తుంటే, అందరం అలా మైమరిచి, పులకితులం కావాల్సిందే. వారి కీర్తనలలో సుమారు 12,000 మాత్రమే ఇప్పుడు లభ్యమవుతున్నాయి.

శ్రీఅన్నమాచార్యులు జన్మించిన ఊరు కడప జిల్లా రాజంపేట తాలూకాలోని తాళ్ళపాక. ఆ ఊరే ఆయనకు ఇంటిపేరు అయింది. తిమ్మక్క, అక్కలమ్మ ఆయన సతీమణులు. అన్నమయ్య వంశీకులుకూడ మంచి కవులు. ‘చందమామ రావో జాబిల్లి రావో’ అని ఆయన రాసిన పాటను ప్రతీ ఇంట శాశ్వతంగా ప్రేమతో తల్లులు పాడుకుంటారు. ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే’, ‘పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా’, ‘బ్రహ్మ కడిగిన పాదము’, ‘కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు’, ‘ముద్దుగారే యశోద’, ‘ఏమొకో చిగురుటధరమున’.. వంటి ఎన్నెన్నో భక్తి కీర్తనలు తిరుమల కొండలలో, భక్తుల గుండెల్లో నిరంతరం మారుమోగుతూనే ఉంటాయి. సంకీర్తనలద్వారా శ్రీవేంకటేశ్వరుని నిత్యం ఆరాధించే సంప్రదాయాన్ని అన్నమయ్య తన తర్వాత తన పుత్రుడైన పెదతిరుమలయ్యకు అందించారు. వారే తన తండ్రి కీర్తనలను రాగి ఫలకాలపై రాయించి ఉంచడంతో నేటికి అవి మనకు భాగ్యవశాత్తుగా లభిస్తున్నాయి.

డా॥ వైష్ణవాంఘ్రి
సేవక దాస్‌
98219 14642

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అన్నమాచార్య జయంతి సందర్భంగా.. భక్త కవితా పితామహుడు

ట్రెండింగ్‌

Advertisement