e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home చింతన శాంతి ప్రదాత!

శాంతి ప్రదాత!

  • రేపు శ్రీనరసింహ జయంతి

స్వస్త్యస్తు విశ్వస్య ఖలః ప్రసీదతాం
ధ్యాయన్తు భూతాని శివం మిథో ధియా
మనశ్చ భద్రం భజతాదధోక్షజే
ఆవేశ్యతాం నో మతిరప్యహైతుకీ

  • శ్రీమద్భాగవతం (5.18.9)
శాంతి ప్రదాత!

‘సమస్త విశ్వానికీ మంగళమవుగాక. అసూయాపరులు సైతం శాంతితో మెలిగెదరుగాక. భక్తియుత సేవలతో ప్రతి ఒక్కరూ పరస్పర క్షేమాన్నే కాంక్షించే ఈ భక్తిమార్గాన్ని సమస్త ప్రాణులూ అనుసరించి ప్రసన్నులవుదురుగాక. మనమంతా అధోక్షజుడైన ఆ నరసింహ భగవానుని సేవలో పాల్గొని, సదా వారి స్మరణలో నిమగ్నమవుదాం.’ ఈ అద్భుత ప్రార్థన భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుడు శ్రీనరసింహ భగవానుని ఉద్దేశించి చేసింది. విశుద్ధ భక్తిశ్రద్ధలతో పరంధాముడైన ఆ భగవానుని సేవకోసం భక్తులు పడే తపన ఇంతా అంతా కాదు. ‘శ్రీమద్భాగవతం’లోని భాగవత ధర్మం అసూయాపరులైన వారి హృదయాన్ని మార్చడానికీ నిర్దేశితమైంది.

మహాభక్తుడు ప్రహ్లాదుడు, ‘అసూయాపరులైన వారు సైతం శాంతితో మెలిగెదరుగాక’ అని భగవంతుడిని ప్రార్థించాడంటే, ఇందులోని సర్వప్రాణుల సంక్షేమం పట్లగల విశుద్ధ ప్రేమను అందరం అర్థం చేసుకోవాలి. ‘హరేకృష్ణ’ ఉద్యమ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదులవారు ఇదే విషయాన్ని ఎంతో హృద్యంగా సెలవిచ్చారు. ఇప్పటికీ ఈ భౌతిక ప్రపంచం అసూయాగ్రస్థులైన వారితో నిండి వుండటం బాధాకరం. దానిని విడనాడిన వారు తమ సామాజిక వ్యవహారాలలో నిస్వార్థంగా తోటివారి అభ్యున్నతిని కాంక్షిస్తారు. మనసా వాచా కర్మణా శ్రీకృష్ణ చైతన్యవంతులై నిత్యం భగవంతుని సేవలోనే వారు నియుక్తులవుతారు.

ప్రస్తుతం ప్రపంచంలో ప్రత్యేకించి మన దేశంలో కరోనా వైరస్‌ పెద్ద ఎత్తున విజృంభిస్తూ, అనేకుల జీవితాల్లో అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నది. మరోపక్క ఇదంతా కొందరు అసూయాపరులు చేసిన పన్నాగమేనన్న విషయమూ స్పష్టమవుతున్నది. ఈ తరుణంలో ‘బహేర్‌ నృసింహ! హృదయేర్‌ నృసింహా!!’ అంటూ స్వామిని ప్రార్థిద్దాం. ఆ నరసింహస్వామి మన హృదయాంతరంలో ఆసీనుడవాలని కోరుకుందాం. కొందరిలో గూడు కట్టుకొన్న చెడు ప్రవృత్తులను తొలగించమని వేడుకొందాం. తద్వారా మన మనస్సులు స్వచ్ఛతను పొంది భగవంతుని ఆరాధనకు తోడ్పడుతూ, ప్రపంచశాంతికి బాటలు వేయాలి. భగవంతునిపట్ల సద్భావనతో భక్తియుత సేవలను ఒనర్చినట్లయితే మనుషుల్లో ఒకరినొకరు లేదా దేశాలను కొల్లగొట్టాలనే స్వార్థ సంకుచిత ధోరణులు కనుమరుగై తోటివారికి సహాయపడాలనే సద్భావన పెంపొందుతుంది. ఈ రకంగా తోటివారికి, ప్రాణులకు సహాయపడాలనే భావన ప్రతి ఒక్కరిలో పాదుకొనాలి. లోకమంతా శాంతితో విరాజిల్లాలి.

మహనీయుడైన భక్త ప్రహ్లాదుడు ‘సమస్త లోకమూ సుభిక్షంగా వర్థిల్లాలనే’ నరసింహస్వామిని ప్రార్థించాడు. “ప్రహ్లాద మహారాజు, ‘ఓం నమో భగవతే నరసింహాయ’ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ, భగవంతుణ్ణి ఒక వరం కోరాడు. ఆయన స్వలాభాపేక్షతో ఏదీ కోరలేదు. తన ప్రార్థనలో తాను మొదటగా కోరింది, ‘స్వస్త్యస్తు విశ్వస్య’. అంటే, ‘సమస్త విశ్వానికీ మంగళమవుగాక’ అని.” ప్రహ్లాదుడు సర్వప్రాణులపై భగవంతుని కరుణకోసం ప్రార్థించిన విధానాన్ని శ్రీల ప్రభుపాదులవారు ఎంతో గొప్పగా వర్ణించారు.

ప్రపంచానికి మేలు చేసే విధంగా మనమంతా శ్రీనరసింహస్వామికి ఏ విధంగా భక్తియుత సేవలు చేయగలం? సమాధానం ‘శ్రీమద్భాగవతం’లోనే ఉంది. ప్రహ్లాదుడే ‘శ్రవణం, కీర్తనం’ వంటి నవవిధ భక్తిమార్గాలను లోకానికి ఉపదేశించాడు. భగవంతుని గురించి విన్నంత మాత్రాన లేదా కీర్తించినంతనే మనసు పులకిస్తుంది. ఇది హృదయాన్ని పరిశుద్ధం చేయడమేగాక వ్యక్తిగతంగా, సమస్త విశ్వానికీ శుభాల్ని చేకూరుస్తుంది. శ్రీహరి దివ్యనామాలను కీర్తిస్తూ శ్రవణం చేసే సులభమైన మార్గాన్ని ఆచరిద్దాం.

శ్రీమాన్‌ సత్యగౌర చంద్రదాస ప్రభూజి
93969 56984

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
శాంతి ప్రదాత!

ట్రెండింగ్‌

Advertisement