e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home చింతన చరిత్రలో నిలిచిపోదాం!

చరిత్రలో నిలిచిపోదాం!

చరాచరాత్మకమైన ఈ జగత్తులో మానవుడిది ప్రత్యేక స్థానం. పూర్వజన్మల సుకృతఫలంగా లభించిన మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే మనిషి ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకోవాలి. శాస్ర్తోపదేశాలను పాటించాలి. ధార్మికంగా జీవించాలి. సుఖశాంతిమయ జీవితానికి ఉపకరించే వాతావరణాన్ని ఏర్పరుచుకోవాలి. సచ్చరితను, ఆత్మగుణాలను అలవర్చుకోవాలి.
క్షమ, దయ, ఇంద్రియ నిగ్రహం, స్థిరచిత్తం, మాటలలో, చేతలలో, సంకల్పాలలో పరిశుద్ధత, సత్యనిష్ఠ, ధర్మనిరతి మొదలైన సద్గుణాలు పెంపొందించుకోవాలి. ఈర్ష్య, అసూయలకు చోటివ్వరాదు. కోపాన్ని దరిచేరనీయొద్దు. ఇతరుల వస్తువులను ఆశించొద్దు. మాటలతో, చేతలతో ఇతరులను బాధపెట్టొద్దు. ఈ నియమాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. గురువును, తల్లిదండ్రులను, తోబుట్టువులను, వయోవృద్ధులను అవమానించకూడదు. స్త్రీల పట్ల ఆదరభావాన్ని కలిగి ఉండాలి. స్త్రీలను గౌరవించే వారికే దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఆడపిల్లలను చులకనగా చూసే వ్యక్తులు ఎన్ని ధార్మిక కార్యక్రమాలు నిర్వహించినా అవన్నీ నిరర్థకమే అవుతాయని చెబుతుంది సనాతన ధర్మం.

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః
యత్రైతాస్తు నపూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః ॥ అనే ధర్మశాస్త్ర ఉపదేశాన్ని అందరూ ఆచరించాలి.
తోటి మానవులను, ఇతర ప్రాణులను ఒకవైపు అవమానిస్తూ, మరోవైపు దేవతారాధన చేసినా ఎలాంటి సత్ఫలితాలు పొందలేరు. చేసిన పూజలన్నీ బూడిదలో వేసిన నేతి హవిస్సుల వలే నిష్ఫలమవుతాయి. ఇతరుల మనసును కష్టపెట్టడం వల్ల కలిగే ఆనందం తర్వాతి కాలంలో పాపంగా పరిణమించి మనశ్శాంతిని దూరం చేస్తుంది.

- Advertisement -

యో మాం సర్వేషు భూతేషు సంతమాత్మానమీశ్వరమ్‌
హిత్వార్చాం భజతే మౌఢ్యాత్‌ భస్మన్యేవ జుహోతి సః॥

‘ప్రాణులన్నిటిలో నేనే అంతర్యామిగా ఉంటాను. ఏ ప్రాణిని అవమానించినా నన్ను అవమానించినట్టే! కాబట్టి తిరస్కార స్వభావం కలవాడు ఎన్నటికీ మనశ్శాంతిని పొందలేడు’ అని మహావిష్ణువు అవతారంగా భావించే కపిల ముని భాగవతంలో పేర్కొన్నాడు.
కదిలే, కదలని ప్రాణులన్నీ భగవంతుని సువిశాలమైన సృష్టిలోనివే! స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో, సుఖశాంతులతో జీవించే అధికారం ప్రతిప్రాణికీ ఉంది. అందువల్ల మానవులు ఏ ప్రాణికీ బాధ కలిగించకుండా జీవనం సాగించాలి. చెట్లకు, గుట్టలకు హాని తలపెట్టకూడదు. గాలి, నీరు, నేల ఇలా మన చుట్టూ ఉన్న ప్రకృతిని కలుషితం చేయకుండా జీవించాలి. పర్యావరణాన్ని రక్షించడానికి తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. సుఖదుఃఖాలు మనకు ఎలా ఉంటాయో, సమస్త జీవరాశికీ అలాగే ఉంటాయని గుర్తుంచుకొని ఎవరికీ హాని కలిగించకుండా వ్యవహారాన్ని సలిపేవాడు నిజమైన ‘యోగి’!

ఆత్మౌపమన్యేన సర్వత్ర సమం పశ్యతి యో‚ర్జున
సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః॥

‘మానవులు సమాజంలో తోటివారి క్షేమాన్ని కోరేవారు కావాలి. ఇతరుల దుఃఖాన్ని సహించలేక వారి బాధలను, కష్టాలను పోగొట్టడంలో తమవంతు బాధ్యతను నిర్వర్తించాలి’ అంటుంది భగవద్గీత.

నత్వహం కామయే రాజ్యం న స్వర్గం న పునర్భవమ్‌
కామయే దుఃఖ తప్తానాం ప్రాణినాం ఆర్తి నాశనమ్‌

‘నేను రాజ్యాధికారాన్ని కోరుకోను. స్వర్గం, పునర్జన్మలను పొందాలని ఆశించను. అందరి కష్టాలను తొలగించేందుకు నేను యథాశక్తితో ప్రయత్నిస్తాను’ అన్న రంతిదేవుడి మాటలు నేటి సమాజానికి ఆదర్శం. మానవులంతా ఆరోగ్యకరమైన ఆలోచనా విధానంతో, ఆత్మీయ భావనతో మెలగాలి. నైతిక, మౌలిక, ధార్మిక విలువలతో ఆదర్శప్రాయంగా జీవనయాత్రను కొనసాగించేందుకు ప్రయత్నిద్దాం. సత్ఫలితాలను పొందుదాం. మానవులుగా పుట్టిన మనం మహనీయులుగా చరిత్రలో స్థానం పొందే దిశగా కార్యాచరణను రూపొందించుకుందాం! అప్పుడు దైవానుగ్రహం కలుగుతుంది. నలుగురికీ మేలు చేశామన్న సంతృప్తి కన్నా మించిన అనుగ్రహం ఏముంటుంది!!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement