e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 17, 2021
Home చింతన శివ సాయుజ్యంతోనే అమ్మ దర్శనం

శివ సాయుజ్యంతోనే అమ్మ దర్శనం

త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం
కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః
యదాలోకౌత్సుక్యా దమరలలనా యాంతి మనసా
తపోభిర్దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీమ్‌!
(సౌందర్యలహరి-12)

ఓ తుహినగిరి కన్యా! పార్వతీమాతా! నీ సౌందర్యాన్ని సరిపోల్చి వర్ణించడానికి ఉపమాన వస్తువు లభించక బ్రహ్మాది కవీంద్రులకే సాధ్యపడలేదు. పోలిక చెప్పాలి అంటే పోల్చదగిన వస్తువు ఉండాలి కదా! బ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడు. ఆయన సృజననే కవులు దర్శించి ఊహించి వర్ణిస్తారు. ఆయన దర్శనానికి, ఊహకు అతీతమైన దానిని ఎవరు వర్ణించగలరు? అత్యంత సౌందర్యవతులైన అప్సరసలే నీ జగన్మోహన సౌందర్యాన్ని చూడాలనే కుతూహలంతో, తాము నీ అందంతో కొంతైనా సరిరాకపోయినా.. పరమశివుని సాయుజ్యాన్ని పొందడం వల్ల నీ అందాన్ని చూడవచ్చని తపిస్తున్నారట. వారు దేవతలే అయినా దేవతలంతా కూడా జీవభావన పొందిన వారే కాబట్టి విశ్వ సృజనకు అతీతమైన సౌందర్యాన్ని జీవ భావనతో దర్శించడం సాధ్యపడక పోవడంతో చూడలేక పోతున్నారట.

- Advertisement -

అమ్మ అన్నిటికీ అతీతురాలు కాబట్టి సృష్టిలోని ఏ సామ్యాన్నీ అమ్మతో సరిపోల్చలేము. ‘ఉద్యద్భాను సహస్రాభ…’ ఉదయిస్తున్న అనేకమంది సూర్యుల ప్రకాశాన్ని అతిక్రమించెడి తల్లి లలితాపరమేశ్వరి. ‘నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండలా..’ తన సౌభాగ్యయుతమైన అరుణ కాంతులతో సకల బ్రహ్మాండాన్నీ ముంచివేయు చిద్రూపిణి అంటున్నాయి లలితా సహస్రనామాలు. తారాకాంతి తిరస్కారి (లలితా సహస్రనామం) కవులు పోల్చడానికి తారలను ఎన్నుకున్నారు! కానీ, ఆ తారల కాంతిరేఖలను తిరస్కరించే సౌందర్యం ఆమెది. ‘తాటంక యుగళీభూత తపనోడుప మండలా..’ సూర్య చంద్రులనే చెవి కమ్మలుగా ధరించిన అమ్మకు తారలు సాటి వస్తాయా?

మాటలకు అందనిది, మనసు చేరలేనిది ఏదైతే ఉన్నదో అదే పరమపావని అమ్మ స్థానం. శివార్చన వల్ల శివ సాయుజ్యం సిద్ధిస్తుంది. శివునికి- శివానికి భేదం లేదు. శివసాయుజ్యం పొందిన వేళ మాత్రమే అమ్మ సౌందర్యాన్ని చూసే భాగ్యం కలుగుతుంది. శివుడు, వశిన్యాది వాగ్దేవతలు మాత్రమే అమ్మ సౌందర్యాన్ని చూడగలిగారు. వశిన్యాది వాగ్దేవతలు ఎవరు? మణిద్వీపంలో సదాశివునితో ఆనందాన్ని అనుభవిస్తున్న సమయంలో ఆమె శరీరం నుంచి ఎనిమిది కిరణాలు వెలువడి వశిన్యాది వాగ్దేవతల ఆకారాన్ని ధరించాయి. అమ్మ నుంచి రావడం వల్ల వారూ, భర్తయైన శివుడు తప్ప అన్యులెవరు అమ్మ సౌందర్యాన్ని చూడగలరు?

అమ్మవారిని బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదినీ, రుద్రగ్రంథి విభేదినీ అంటూ స్తుతిస్తున్నాయి లలితా సహస్రనామాలు. మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకుగల ఆరు చక్రాలలో మూలాధారం, స్వాధిష్ఠాన చక్రాలను బ్రహ్మగ్రంథిగా, మణిపూరం, అనాహత చక్రాలను విష్ణుగ్రంథిగా, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలను రుద్రగ్రంథిగా చెబుతారు. వాటినే వరుసగా అగ్ని మండలం, సూర్య మండలం, చంద్ర మండలాలుగా వ్యవహరిస్తారు. సాధనలో ఆయా స్థాయిల లో ఆ గ్రంథులు విడిపోవడం వల్ల ఉన్నత స్థితికి చేరుకుంటాడు సాధకుడు. బ్రహ్మగ్రంథి కార్యశక్తికి, కర్తృత్వానికి సృజన కేంద్రంగా చెబుతారు. అందులో నుంచి ఉప్పొంగే ‘చిచ్ఛక్తి’ లలితాదేవి. అలాగే ప్రపంచ స్థితికి, రక్షణకు, దయాది సకల గుణాలకు వెలుగుచూచే శక్తిని విష్ణుగ్రంథిగా అభివర్ణించారు. కాగా, జ్ఞానశక్తిగా సంసార భ్రాంతిని లయం చేసే శక్తిని రుద్రగ్రంథిగా చెబుతారు. ఈ మూడు గ్రంథులు విడివడటమంటే సాంసారిక బంధనాలు తొలిగిపోవడం. దానితో సహస్రారంలో ఉన్న అమృతమూర్తి అయిన అమ్మ దర్శనం లభిస్తుంది.

భక్తితో మాత్రమే పొందదగినది, భక్తులకు సౌభాగ్యాన్నిచ్చే తల్లియైన లలితాపరమేశ్వరిని దర్శించేందుకు అర్హతగా లోకంలో అయిదు రకాలైన ఉపాసకులు శివసాయుజ్యాన్ని పొందగలుగుతారట. స్థూల రూపాన్ని ఉపాసించేవారు, మంత్రోపాసకులు, కుండలినీ సాధకులైన యోగులు, జ్ఞానమార్గంలో పరతత్త్వ సాధకులు… చివరగా త్రికరణ శుద్ధితో ఈ అయిదు మార్గాలలో సాధనచేసేవారు శివసాయుజ్యం ద్వారా అమ్మను దర్శించగలుగుతారు.

పాలకుర్తి రామమూర్తి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement