e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home చింతన కృష్ణ భక్తి.. రాధ శక్తి!

కృష్ణ భక్తి.. రాధ శక్తి!

దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడితో సరిసమానుడు గానీ, శ్రీకృష్ణుడికన్నా అధికుడుగానీ మరొకరు లేరని భగవద్గీత వివరిస్తున్నది. బలంతో శ్రీకృష్ణుడిని ఎవరూ జయింపజాలరు. అంతేగాక, గోపాలుడికి ఈ లోకంలో బలవంతంగా నిర్వర్తించాల్సిన కర్తవ్యాలంటూ ఏమీ లేవు. ఆ నంద నందనుడు ఏది చేసినా అది కేవలం వారి స్వీయ సంకల్పంతో మాత్రమే. ఆనందానుభూతి కోసమే. శ్రీకృష్ణుడు అజితుడైనప్పటికీ వారిలో ఒక అద్భుతమైన గుణం ఉంది. అదే తన భక్తుల ప్రేమకు లొంగిపోవడం. తాను దేవాదిదేవుడైనా, తన భక్తుల విశుద్ధ భక్తియుత సేవకు మాత్రం బందీ అవుతాడు. ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా, నిస్వార్థంతో కూడిన భక్తియుత సేవ భగవంతుణ్ని ఆకర్షించేంత గొప్పది.

సర్వాకర్షకుడైన శ్రీకృష్ణుడినే ఆకర్షిస్తున్నదంటే ఏమిటా శక్తి? అదే భక్తియుతమైన శక్తి. అది శ్రీకృష్ణుని ఆంతరంగిక శక్తి స్వరూపమైన పరదేవత శ్రీరాధిక. ఆ పరమాత్మకు ఒసగే సకల సేవలూ రాధారాణి ద్వారానే స్వామికి చేరుతాయి. ‘రాధిక’ అంటే అత్యున్నత ఆరాధన అని అర్థం. ఆమె విశుద్ధమైన భక్తి తత్వంతో కూడినది. అందుకే, రాధారాణి పట్ల శ్రీకృష్ణుడు ఆకర్షితుడవుతాడు. గోపాలుడు తన భక్తులు ధన ధాన్యాలు, కీర్తి ప్రతిష్టలను కోరితే వాటిని సులభంగా ప్రసాదించేస్తాడని ‘భక్తిరసామృత సింధు’ తెలియజేస్తున్నది. కానీ, విశుద్ధమైన భక్తిని మాత్రం పరమాత్మ అంత సులభంగా ఎవ్వరికీ అనుగ్రహించడట. ఎందుకంటే, అలాంటి భక్తికి తాను వశుడైపోతాడు కనుక! శ్రీకృష్ణుడు జగన్మోహనుడైతే, శ్రీరాధిక జగన్మోహన మోహిని. రాధారాణి ద్వారా మాత్రమే భగవంతుని కృప ప్రాప్తిస్తుంది. ఆమె కృప లేకపోతే భక్తిలో పరిపూర్ణత సాధించలేం. శ్రీకృష్ణుని ఆరాధించే భక్తులు ముందుగా రాధారాణిని ఆశ్రయించాలి. భక్తులు ‘జయ రాధే’అంటూ రాధారాణిని కీర్తిస్తుంటారు. భగవంతుణ్ని ‘రాధాకృష్ణ’ అనీ, ‘రాధా గోవింద’ అనీ రాధా సహిత నామంతో సంబోధించినపుడు ఆయన మరింత ప్రసన్నుడవుతాడట. శ్రీ రాధాకృష్ణుల చరణారవిందాల ఆశ్రయాన్ని పొందటమే మానవ జన్మకు పరిపూర్ణత.
రాధానుగ్రహం పొందిన వారిని తాను సర్వదా కటాక్షిస్తానని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఒకానొకసారి నారద మహర్షికి వివరించాడు.

- Advertisement -

సత్యం సత్యం పునః సత్యం సత్యమేవ పునః పునః వినా రాధా ప్రసాదేనమత్ప్రసాదో న విద్యతే॥ (నారద పురాణం)
‘నారదా! ఇది సత్యం, సత్యం. మళ్ళీ మళ్ళీ ఇదే సత్యం సత్యమని చెబుతున్నాను. రాధ కృప లేనిదే నా కృపను ఎవ్వరూ పొందజాలరు’ అన్నాడు భగవానుడు. అజితుడైన శ్రీకృష్ణుడిని నేరుగా చేరుకోవటం సాధ్యపడదు. రాధారాణిని ఆశ్రయించిన ఒక విశుద్ధ భక్తుడిని ఆశ్రయించడమే అందుకు మార్గం. అటువంటి విశుద్ధ భక్తులలో ఒకరైన శ్రీల ప్రభుపాదులు రాధాకృష్ణులను ఆశ్రయించే భాగ్యాన్ని మనకూ అనుగ్రహించగలరు. కలియుగమంటే కలహ, కల్మషాలతో కూడినది. అయితే, ప్రస్తుత యుగంలో శ్రీకృష్ణుడే రాధిక భావంతో అవతరించి విశుద్ధ భక్తి అంటే ఏమిటో లోకానికి తెలియజేశాడు. ఆ కరుణామయ స్వరూపమే శ్రీచైతన్య మహాప్రభువు. అవతార ‘శిరోమణి’ అయిన శ్రీచైతన్య మహాప్రభువు కృష్ణ ప్రేమను ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్కరికీ అనుగ్రహించారు. వారి అపారమైన కరుణ.. కలి సంకెళ్లలో బద్ధులైన జీవాత్మలనూ ముక్తిగావిస్తుంది. రాధాదేవి అనుగ్రహం శ్రీకృష్ణుడిని చేరుకోవడానికి సోపానం వంటిది. ఆ తల్లి చల్లని నీడ తమపై పడాలని ఎందరో యోగులు, భక్తులు బృందావనంలో సదా రాధారాణి ఉపాసన చేస్తూ కనిపిస్తారు. అలాంటి రాధామాయి సేవలో మనమూ తరిద్దాం. జై శ్రీ రాధే!
(నేడు రాధాష్టమి)

శ్రీమాన్‌ సత్యగౌర
చంద్రదాస ప్రభూజీ
93969 56984

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana