e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home చింతన భగవదనుభూతి

భగవదనుభూతి

దేవుడు, దేవత, దైవం, భగవంతుడు లాంటి పదాలు సగటున మనం పరాత్పర అస్తిత్వానికి సంబంధించి వాడేవి. ఏ మతంలోనైనా వీటి అర్థం స్వయం ప్రకాశక, అనంతశక్తిమయ, కరుణామయ, జగదాధార మహా అస్తిత్వమనే! పెద్ద ప్రజ్ఞ అవసరం లేకుండానే మన లోపల, వెలుపల అసంఖ్యాకమైన సంఘటనలు మన ప్రమేయం లేకనే జరిగి మన ఉనికికి, సౌఖ్యానికి కారణమవుతున్నాయని, అవి ఒక నియతితో జరుగుతున్నాయనీ తెలుసుకోవచ్చు. అయితే, కార్యకారణ సంబంధ సూత్రం ప్రకారం ఈ నియతికి కారణం తెలుసుకోవాలన్న ఇచ్ఛ మానవునికి సహజం. ఆ మూలమహా కారణం అస్తిత్వాన్నే భగవంతునిగా అన్ని మతాలు పిలుస్తాయి. భారతీయ ఆర్షదర్శనం, అనుభవం ఈ మహా అస్తిత్వాన్నే ‘సచ్చిదానంద పరబ్రహ్మం’గా ప్రత్యక్షం చేసుకున్నది. దానినే ‘భగవంతుడి మూలబీజం’గా ఆవిష్కరించింది.
‘భగవంతుడు ఏకమా, అనేకమా?’ అంటే, ఒకే పరబ్రహ్మం ఎన్ని నియతులుగా వ్యక్తమైతే అన్ని భగవన్మూర్తులుగా భావించడం సహజమూ, సమంజసమూ అవుతుంది. అన్నిటికీ అనుమతిని, ఆశ్రయాన్ని, ఆత్మీకరించుకోవడానికి బహు విధ అవకాశాలనూ ఇది కల్పిస్తుంది.

ఈ అనన్య విశాల దర్శనం వల్లే ఆర్షసంస్కృతి భగవద్విభూతిని మౌలికంగా అంటే తత్వపరంగా నిరాకార, నిర్గుణ అద్వయ పరబ్రహ్మంగా నిలుపుతుంది. ఉపాసనాపరంగా సగుణమూ, సాకారమూ అయిన అనేక మూర్తులుగా, సంకేతాత్మక చిహ్నాలుగా, శబ్దాలుగానూ అందిస్తుంది. ఇవేకాక ఇతర సంస్కృతులనూ నిరాకరించక, అవమానించక తగు పరిమితుల్లో వాటిని అర్థం చేసుకొని ఆదరిస్తుంది. దైవభావన అన్ని దేశాలకు అంటే తెలిసిన లేక విశ్వసించిన అన్ని లోకాలకు, తెలిసిన, తెలియని అన్ని కాలాలకూ చెందిన ‘మహాభావన’. కాబట్టి, ఈ విషయంలో ఏర్పడే అభిమతం లేక మతానికి చెందిన విభేదాలు చాలా లోతైనవి. అవి ప్రత్యక్షానుమానాది తార్కిక ప్రమాణాలను వదలి కేవలం ఆయా మతగ్రంథాల శబ్దప్రమాణంపైనే ఆధారపడినప్పుడు అంధవిశ్వాసంగా మారి, సంకుచితమై విపరీతమైన విభజనలకూ, విద్వేషాలకూ దారితీస్తాయి.

- Advertisement -

భగవద్రూప విభూతులు ఎన్ని ఉన్నా సారభూత భగవత్తత్వం ‘సచ్చిదానంద పరబ్రహ్మమే’. ఆ భగవత్తత్వం విశ్వనియమ అస్తిత్వ సూత్రం. అది స్వతంత్రమైన, అబాధితమైన శాంతానంద మహా చైతన్యం. అంటే అది అభవం, స్థిరం, శివం అయిన చైతన్యం. దాని అనంత స్పందనాశక్తుల సమాహారమే ఈ విశ్వం. దీని నిండా పరచుకున్న ఆ శాంతానంద చైతన్యాన్ని మన అనుభవంలోకి ఆవిష్కరించుకోవడమే ‘యోగం’. అంటే, పరిమిత చైతన్యం అనంత చైతన్యంలో లయమై నిలవడం. అందుకే, యోగం ప్రధానంగా విలయాత్మకం. ఈ యోగశక్తి, సమర్థత మనిషికి మాత్రమే పరిమితం కనుక, మానవజన్మ పరమాశయం ఈ యోగానుభవ సిద్ధియే. ఇందుకు కర్మ, ఉపాసన, ధ్యానం (తపస్సు), జ్ఞానం- అనే ఈ నాలుగు ప్రధాన మార్గాలను భారతీయ ఆర్షసంస్కృతి వర్ధిల్లజేసింది. ఇతర ఖండాల్లో పుట్టిన మార్గాలు చాలావరకు కర్మ, ఉపాసనలకే పరిమితమయ్యాయి.

కర్మ, ఉపాసనలకు ఆయా మతగ్రంథాల శబ్ద ప్రమాణం, సంప్రదాయమే ఆలంబన. ధ్యానానికి శబ్ద ప్రమాణాన్ని మించి, వ్యక్తిగత సాధనానుభవమే ఆలంబన. జ్ఞానానికి శబ్ద ప్రమాణంతోపాటు ప్రత్యక్షానుమాన ప్రమాణాలతో కూడిన వివేచనమే ఆలంబన. కాబట్టి, అది విభేదాతీత విస్తృతానుభవం. అందుకే, కర్మ, ఉపాసనా మార్గాలు కూడా విశ్వాత్మీయతను అనుభూతిలోకి తెచ్చుకోవాలంటే ప్రగాఢమైన జ్ఞానస్పర్శ అవసరం. విశ్వజనీన సత్యాలు ఏ దేశకాల శుద్ధ దార్శనిక హృదయాలు చెప్పినా ఒకేవిధంగా ఉంటాయన్నది వేదోక్తి. ఆయా మత గ్రంథాల్లో చెప్పిన సత్యాలు ఆయా దైవీ విభూతుల నామరూపాలకు తీవ్ర సంకుచిత బుద్ధితో పరిమితం చేయక, ఆ సత్యప్రకాశంలో కరిగి వ్యాపించడమే పరమోన్నత పరిణతి. అదే పరమాత్మీయమైన మధురామృత భగవదనుభూతి.

యముగంటి ప్రభాకర్‌
94401 52258

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana