e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home చింతన మూర్ఖుల స్వభావాలు

మూర్ఖుల స్వభావాలు

తివిరి ఇసుమునఁ దైలంబుఁ దీయవచ్చుఁ
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుఁ
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చుఁ
జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు!

  • భర్తృహరి (సుభాషితములు-5)
    ‘గానుగ పట్టయినా ఇసుక నుంచి చమురును సృష్టించవచ్చేమో. నీటిలా కనిపించే ఎండమావులలో దాహం తీర్చుకోవచ్చేమో. చెవులు మాత్రమే ఉండే కుందేలుకు కొమ్ములను మొలిపింపగలమేమో. ఇటువంటి ఎంతటి అసాధ్యాలనైనా సాధించగలమేమోగానీ, ఎన్ని ప్రయత్నాలు చేసినా మూర్ఖుల మనస్సులను మాత్రం మనం సంతోషపెట్టలేము, మార్చలేము’.
    మూర్ఖులలో మూడురకాల వాళ్లుంటారు. తమ స్వార్థం కోసం ఇతరులకు అపకారం చేసేవాళ్లు కొందరైతే, తమకు ఏ మాత్రం ప్రయోజనం లేకపోయినా కానీ, తమ వల్ల ఇతరులకు కీడు జరుగుతుంటే ఆనందించేవాళ్లు మరికొందరు ఉంటారు. ఇతరులకు హాని చేయడం వల్ల తాము ధ్వంసమైనా కానీ లెక్క చేయకుండా పట్టుపట్టి సమాజానికి కీడు చేస్తూనే తాము సైతం నాశనమయ్యేవాళ్లు ఇంకొందరు. ఇలాంటి ప్రమాదకరమైనవాళ్లు దేశకాలాలన్నిటికీ అతీతులు. ఇంతటి దుర్మార్గులకు ఏ మాత్రం కనికరమనేదే ఉండదు. అకారణంగా ఎప్పుడూ ఇతరులతో గొడవ పడుతుంటారు. అంతేకాదు, ఇతరుల సంపదలను అక్రమంగా, బలవంతంగా దోచుకుంటూ, మంచివాళ్లపైనా, ఒక్కోసారి తమకు కావలసినవాళ్లపైనా అకారణ ద్వేషాన్ని కూడా పెంచుకుంటూ ఉంటారు (భర్తృహరి సుభాషితాలు-41).

అలాంటివాళ్లు తమ అవసరాలను తీర్చుకోవడం కోసం ఎప్పటికప్పుడు అనేక రకాల వాగ్దానాలు చేస్తూ, ఎలాంటి హామీలనైనా గుప్పిస్తుంటారు. చీటికిమాటికీ నమస్కారాలు పెడుతూ కపట వినయాలను నటిస్తారు. ఎదుటివారిని మోసం చేయడానికి ఏవో కల్లబొల్లి కబుర్లు చెప్తూ మురిపిస్తుంటారు (నన్నయభట్టు, మహాభారతం, ఆదిపర్వం: 6-111)’. అవకాశవాద లక్షణమనేది వాళ్లకు పుట్టుకతోనే అబ్బుతుంది. తమకు సమయం కలిసొచ్చేదాకా ఎంతో అనుకూలంగా ఉంటూ, అవకాశం దొరకగానే భయంకరమైన విషసర్పం వలె నిర్దయగా కాటేస్తుంటారు (ఆదిపర్వం: 6-112). ఒకవేళ అనుకోకుండా అలాంటివాళ్ల ఎత్తుగడలో మనం చిక్కుకొనిపోతే, ఉపాయంతో ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని గట్టెక్కాలని సనాతన ధర్మం సూచిస్తున్నది. భేదాభిప్రాయాలు ఏర్పడినప్పుడు వారితో కలిసి ఉండటమనేది చాలా ప్రమాదకరం. కాకపోతే, ఒక్కోసారి అలాంటివాళ్లతోనూ కొన్ని అవసరాలు ఏర్పడటం సహజం. అలాంటప్పుడే తగిన జాగ్రత్తలు అవసరం.

- Advertisement -

పగయ కలిగెనేని పామున్న యింటిలో
నున్న యట్ల కాక యూఱడిల్లి
యుండునెట్లు చిత్తమొకమాటుఁ గావున
వలవ దధిక దీర్ఘ వైరవృత్తి!

  • తిక్కనామాత్యుడు (మహాభారతం, ఉద్యోగపర్వం: 3-20)
    ‘దుష్టులతో కలిసి ఉండాల్సి వచ్చినప్పుడు, పాములు నివాసం ఉండే ఇంట్లో వాటికి భయపడుతూ ఉన్నట్టుగానే వారి చర్యలను కనిపెట్టుకొని ఉండాలి. పామును పట్టుకోవడానికి ప్రయత్నించేటప్పుడు దాని మూతిని చేతితో పట్టుకొన్నట్లే ఆ మనుషులతోనూ అంతే జాగ్రత్తగా మసలుకోవాలి (శాంతిపర్వం: 3-230). అవసరాలు తీర్చుకొనేదాకా వాళ్లతో బాగా ఉంటూనే, అవకాశం వచ్చిన మరుక్షణంలోనే బండమీద మట్టికుండను విసిరివేసి పగుల గొట్టినట్టుగా, వాళ్ల నిర్మూలనకు ప్రయత్నిస్తుండాలి (ఆదిపర్వం: 6-114).
    ఎంతటి దుర్మార్గులైనప్పటికీ వారు కూడా సంఘంలో భాగస్వాములే. కేవలం తమ స్వార్థం కోసం ఎంతకైనా బరితెగించి ఇతరులకు కీడు చేస్తూ ఉండేవాళ్ల నుంచి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని మన ధర్మసూత్రాలు బోధిస్తున్నాయి. పట్టరానంత గర్వంతో, క్షణికమైన సంపదలు చేరగానే అహంకారంతో విఱ్ఱవీగుతూ ఇతరులకు కీడుచేసే వాళ్లకు ఎన్నటికైనా తగిన శాస్తి జరిగితీరుతుందని కూడా సనాతన ధర్మం హెచ్చరిస్తున్నది. అందుకే, మంచితనంతో మెలగుతూ, అవసరాన్ని బట్టి ఇతరులకు మేలు చేస్తుండాలి. అప్పుడే, మనకు ప్రాప్తించిన ఈ మానవజన్మ సార్థకమవుతుంది.

డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana