e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home చింతన దశాపరాధాలు

దశాపరాధాలు

సన్నిందాసతి నామవైభవ కథా శ్రీశేశయో ర్భేదధీ
రశ్రద్ధా శ్రుతిశాస్త్ర దైశిక గిరాం నామ్న్యర్థ వాద భ్రమః
నామాస్తీతి నిషిద్ధ వృత్తి విహిత త్యాగో హి ధర్మాంతరైః
సామ్యం నామ్ని జపే శివస్యచ హరే ర్నామాపరాధా దశ॥

  • భాగవతం (ఆంధ్రానువాదం: శ్రీ జోస్యుల రామచంద్రశర్మ, హిందీమూలం: శ్రీ జయదయాళ్‌ జీ గోయన్దకా)
    ‘సన్నింద, అసతినామ వైభవకథ, శ్రీశేశ భేదబుద్ధి, శ్రుత్యశ్రద్ధ, శాస్ర్తాశ్రద్ధ, దైశిక వచనాశ్రద్ధ, శ్రీశేశనామార్థవాద భ్రమ, నిషిద్ధ కర్మాచరణం, విహితకర్మ పరిత్యాగం, ధర్మాంతర సామ్యం’. ఇవి దశాపరాధాలు (10 నామాపరాధాలు). శివకేశవ నామజపం సందర్భంలో అసంకల్పితంగా జరిగే అపరాధాలలో ఇవి ప్రధానమైనవి. దైవసేవకు ‘నవవిధ భక్తిమార్గాలు’ ఉన్నట్లే, భగవంతుని విషయంలో చేయకూడని పది పొరపాట్లను కూడా ‘భాగవతం’ పేర్కొన్నది.
దశాపరాధాలు
- Advertisement -

సన్నింద: సజ్జనులను, భక్తులను ప్రశంసిస్తూ, వినయ విధేయతలు చూపాలి. వారి ఆశీస్సులు పొందడమూ సత్కార్యాలలో ముఖ్యమైంది. వాళ్లు సమకూర్చుకొన్న సుగుణ సంపత్తి, దైవానుగ్రహం మెచ్చదగినవి కదా. అసూయతోనో, నిర్లక్ష్యంతోనో అలాంటివారిని తూలనాడటం, వారిపై అభాండాలు మోపడం వంటి పనులు చేయరాదు. అసతినామ వైభవకథ: మహిమగల భగవత్‌కథలను, నామవైభవాన్ని పాపకర్మలు చేసే వ్యసనపరులకు లేదా దుర్జనులకు విశదీకరించాలని పూనుకోకూడదు. శ్రీశేశ భేదబుద్ధి: ‘శివునికంటే విష్ణువే లేదా విష్ణువుకంటే శివుడే గొప్పవారంటూ’ భేదబుద్ధి చూపరాదు. ‘శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే’ కదా. ఒకరికన్నా మరొకరు గొప్పవారు కారు, ఇద్దరూ ఒక్కటే.

శ్రుత్యశ్రద్ధ: శ్రుతులు, వేదాలపట్ల విముఖత, అశ్రద్ధ, నిర్లక్ష్యం కూడదు. ‘వేదమూల మిదం జ్ఞానం’. వేదజ్ఞానాన్ని విడిచి పెట్టడం, అందులోని పరమార్థాన్ని గ్రహించకపోవడం, కేవలం లౌకికార్థాన్నే తీసుకోవాలనుకోవడం వంటివన్నీ అపరాధాలే. శాస్ర్తాశ్రద్ధ: శాస్త్రం పట్లకూడా అశ్రద్ధ పనికిరాదు. ‘తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ’. ఏ పనికైనా శాస్త్రమే ప్రమాణం. అందువల్ల, శాస్త్రం చెప్పినట్టు చేయాలి. దైశిక వచనాశ్రద్ధ: ‘దేశికుడు’ అంటే గురువు. గురువచనానికి విలువ ఇస్తూ, ఆయనను దేవునిలా భావించాలి. వారి వాక్కులను శిలా శాసనాలుగా పాటించాలి. శ్రీశేశనామార్థవాద భ్రమ: శివకేశవుల నామాలు ఎంతో మహిమాన్వితం. భగవన్నామం పట్ల వెటకారమూ అపరాధమే. నిషిద్ధ కర్మాచరణం: ‘ఎలాగూ మహిమగల భగవన్నామం సర్వదా పఠిస్తున్నాం కదా, ఏం చేసినా చెల్లుతుందిలే’ అని భావించి నిషేధితాలైన మద్యపానం, వ్యభిచారం వంటి పాపకర్మలను నిస్సంకోచంగా చాటుమాటుగా చేయడం, వాటిని కప్పిపుచ్చుకో చూడటం పనికిరాదు.

విహితకర్మ పరిత్యాగం: ఎలాగూ భగవదారాధనలో ఉన్నాను కదా, అని విధ్యుక్త సంప్రదాయ కర్మలు (సంధ్యావందనం, శ్రాద్ధకర్మలు మొదలైనవి) విడిచి పెట్టడం తగదు. వాటిని విధిగా ఆచరించాల్సిందే. ధర్మాంతర సామ్యం: ‘అన్య ధర్మాల’తో అంటే శాస్త్ర విహిత ధర్మాలతో భగవన్నామాన్ని పోల్చకూడదు. భగవన్నామానికున్న శక్తి అనిర్వచనీయం, అనంతం. దాని ముందు నిజానికి యజ్ఞయాగాదులు మొదలైనవేవీ పనికిరావు. ‘ఈ దేవునికంటే ఆ దేవుడు గొప్ప. ఆ నామం కంటే ఈ నామం గొప్ప’ అంటూ వాదనలు చేయకూడదు. ఈ భావన భక్తులలో ‘చిత్త విక్షిప్తి’(బుద్ధి చెదరడం)కి దారితీస్తుంది. అలాంటివారు ఏదీ సాధించలేరు. అందువల్ల ప్రతీ సాధకుడు భగవంతునిపట్ల ఈ పది అపరాధాలకు పాల్పడకుండా ఉండాలి. ఒకవేళ అలాంటి పరిస్థితులే కనుక అనివార్యంగా ఎదురైతే వాటిని తెలివిగా అధిగమించేలా జాగ్రత్త పడాలి’ అని ‘భాగవతం’ ప్రబోధిస్తున్నది.

డాక్టర్‌ వెలుదండ
సత్యనారాయణ
94411 62863

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దశాపరాధాలు
దశాపరాధాలు
దశాపరాధాలు

ట్రెండింగ్‌

Advertisement