e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home చింతన వీరభద్ర విజయం!

వీరభద్ర విజయం!

సీ.“అభ్రం లిహా దభ్ర విభ్రమాభ్ర భ్రమ కృన్నీల దీర్ఘ శరీర మమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికా జాల జాజ్వల్యమాన కేశములు మెఱయ జండ దిగ్వేదండ శుండాభ దోర్దండ సాహస్ర ధృత హేతి సంఘ మొప్ప వీక్షణ త్రయ లోక వీక్షణ ద్యుతి లోక వీక్షణ తతి దుర్నిరీక్షముగను

తే. గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ ఘన కాపాలాస్థి వనమాలికలును దనర నఖిల లోక భయంకరు డగుచు ‘వీర భద్రు’ డుదయించె మాఱట రుద్రుడగుచు.”

- Advertisement -

పినాకి (శివుడు) పీకి పారవేసిన ఆ జడనుండి వీర, అద్భుత, భయానక, బీభత్స, రౌద్రాలనే పంచరసాల సమాహార స్వరూపుడై పంచముఖుడైన రుద్రుని మారుమూర్తిగా అఖిలలోక భయంకరుడు, అరివీర భంజకుడైన ‘వీరభద్రుడు’ ఉదయించాడని రససిద్ధుడు పోతన ఈ సీసపద్యంలో సహృదయ హృదయ రంజకంగా వర్ణించాడు. వస్తు సాక్షాత్కారం అయ్యే విధంగా అభివర్ణించడం మహాకవుల మహత్తర కవిత్వ లక్షణాలలో ఒకటి. వీర, రౌద్రాది రసవర్ణన క్లిష్టమైన ద్విత్వ, సంయుక్త మహాప్రాణ అక్షరాలతో కూడిన శబ్దాలతో కూర్చిన సమాస భూయిష్ఠం (మయం)గా చేయుట ఆలంకారిక మార్గం. అమ్మలగన్నయమ్మను ఇమ్ముగ అర్థించి ఈ మహత్త, కవిత్వ, పటుత్వ సంపదలను ముందుగానే పొందిన కవీంద్రుడు- భక్తకవి కుల కుబేరుడు కదా మన పోతన! కవి రాజులకు సుకవిత్వమే రాజ్యము కదా!
మైత్రేయ మహర్షి విజ్ఞాని అయిన విదురునికి ప్రకటమైన వీరభద్రుని వికట వికరాళ రూపాన్ని ఇలా వర్ణించి చెప్పాడు-
‘విదురా! వీరభద్రుని కడు నిడుపైన కారు నలుపు కాయం (దేహం) ఆకాశాన్ని అంటిన ప్రళయకాల అభ్ర (మేఘ) మేమో అన్న విభ్రమాన్ని (భ్రాంతిని) కలిగిస్తోంది. అతని తల వెంట్రుకలు భగభగ మండే అగ్నిజ్వాలా మాలికలవలె ఉజ్వలంగా ఉన్నాయి. దిగ్గజాల శుండాల (తొండాల) వంటి అతని వేయి బాహు దండాలలో నిండైన ఆయుధాలు మెండుగా మెరుస్తున్నాయి. అతని వీక్షణ త్రయ (మూడు కళ్లు) మనే చండ ప్రచండ మార్తాండుని (సూర్యుని) తీక్ష ప్రకాశం లోకుల వీక్షణా (చూపు)లకు దుర్నిరీక్ష్యంగా- తేరిపార చూడరాకుండా ఉంది. అతని కోరలు రంపాలవలె కఠినంగా, కర్కశంగా వెలుగుతున్నాయి. కంఠంలో కపాల మాలలు, ఎముకల దండలు వనమాలల వలె వ్రేలాడుతున్నాయి’. మూలంలోని శ్లోకాలకు రసానుకూలంగా మార్పులు, కూర్పులతో మెరుగులు దిద్ది మురిపింప చేసిన ముత్యాలవంటి ఇట్టి పద్యాలు భాగవతంలో కోకొల్లలు.

వీరభద్రుడు శిరసు వంచి, వేయి చేతులు జోడించి వినయ పూర్వకంగా- ‘అధీశ్వరా! ఆజ్ఞాపించండి!’ అని అభవుని అభ్యర్థించాడు. రుద్రుడు వీరభద్రుని ‘వీరాధివీరా! రణకోవిదా! ప్రమథగణ సమేతంగా సాగిపోయి యజ్ఞంతోసహా యజమాని దక్షుణ్ణి సంహరించు. బ్రాహ్మణ తేజం అజేయమని సందేహించవద్దు. మహాకాలుని అంశతో అవతరించిన నీకు మూడు లోకాలలో అసాధ్యమైనదంటూ ఉండదు’- అని కోపోద్రేకంతో ఆదేశించాడు.

రుద్రునికి మోదంతో ముమ్మారు ప్రదక్షిణం చేసి వీడ్కొని, కాల యముణ్ణి కూడా నేలకూల్చగల త్రిశూలం కేల (చేత) ధరించి, కాళ్లకుగల నూపుర (గజ్జెల) భూషణ ధ్వనులు విజయ ఘోషణలు కాగా, భూమికూడా దద్దరిల్లే భీషణ వేగంతో బయల్దేరాడు భద్రుడు. రుద్ర గణాల కాళ్ల త్రొక్కిళ్లవల్ల ఎగసిపడే దుమ్ముతో పట్టపగలే చిమ్మచీకటి కమ్ముకొన్నట్లయింది. ‘కారు చీకటి కాదు, కాళ్ల దుమ్ము!’ అంటూ దక్షునితోసహా సభ్యులందరూ తత్తరపాటుతో బిత్తరచూపులు చూచారు. ప్రసూతి (సతీమాత) మొదలుగా బ్రాహ్మణ స్త్రీలు- ‘ఈ అకాల ప్రభంజనం సతీ-పతులను అవమానించి, విడదీసిన మహాపాపానికి ప్రతిఫలమేమో’ అని భయకంపితులయ్యారు.

అంతలోనే రుద్రగణాలు యజ్ఞశాలలో ప్రవేశించి యజ్ఞాన్ని అడ్డుకొని సామగ్రిని భగ్నం చేశాయి. శివనింద చేస్తున్న సమయంలో కన్నుగీటి దక్షుని ప్రోత్సహించిన భగదేవతను బంధించి నందికేశ్వరుడు కళ్లు పీకి వేశాడు. పరిహసిస్తూ పకపక నవ్విన పూషా దేవత (సూర్యుడు) పళ్లు పట్టి చండీశ్వరుడు పెకలించాడు. నిందిస్తున్నందుకు ఆనందిస్తూ గడ్డం దువ్వుకుంటూ మీసం మెలేసిన భృగువుని పట్టి, భద్రుడు ఆయన గడ్డం, మీసం పెరికి వేశాడు. విజృంభించిన వీరభద్రుడు దక్షుని మెడ నులిమి, తల తునిమి దానిని దక్షిణాగ్ని కుండంలో పడేసి దగ్ధం చేశాడు. అభవుని అనుచరులు ఆనందించగా, దేవతలు, భూదేవతలు- బ్రాహ్మణులు బహు బాధలకు గురి అయ్యారు. దక్షుని వధించి వీరభద్రుడు కైలాసం చేరుకున్నాడు.
(సశేషం)

తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana