e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home చింతన దుఃఖ నివారణ రహస్యం!

దుఃఖ నివారణ రహస్యం!

రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియై శ్చరన్‌
ఆత్మవశ్యై ర్విధేయాత్మా ప్రసాద మధిగచ్ఛతి॥
-భగవద్గీత(2-64)

దుఃఖ నివారణ రహస్యం!


‘సృష్టిలోని సర్వమానవాళికి రాగద్వేషాలు సహజాతాలై కొన్నిసార్లు సుఖదుఃఖాలకు కారణమవుతుంటాయి. ఐతే, అవి సుఖం కన్నా దుఃఖాన్నే ఎక్కువగా కలిగిస్తుంటాయి’. మరి, ‘ఈ దుఃఖాన్ని పోగొట్టుకోలేమా?’ అనే ప్రశ్నకు సమాధానమూ ‘భగవద్గీత’లోనే లభిస్తుంది. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు అంతులేని దుఃఖభావనకు లోనై, యుద్ధవిముఖుడు కావడంతో ఆయన రథానికి సారథ్యం వహిస్తున్న శ్రీకృష్ణభగవానుడే ఆ సమస్య పరిష్కారానికి పూనుకున్నాడు. సమబుద్ధివల్ల స్థిరచిత్తం, దానిద్వారా స్థితప్రజ్ఞత లభిస్తాయని బోధిస్తూ, వీటిని సాధించడానికి ఎలాంటి ప్రయత్నం చెయ్యాలో ఆయన చెప్పాడు. ‘అర్జునా! ఏ వ్యక్తి అయినా దుఃఖనివారణ పొందాలంటే ముందుగా రాగద్వేషాలు లేకుండా చూసుకోవాలి. అంతఃకరణాన్ని తన అధీనంలో ఉంచుకొని, ఇంద్రియాలను వశపరచుకోగలగాలి. అప్పుడు మనస్సు మన స్వాధీనంలోకి వస్తుంది. దాంతో అతనిలోని ‘విషయలౌల్యం’ కాస్తా మటుమాయమవుతుంది. అప్పుడతను ఎన్ని విషయాలమధ్య తిరుగాడినా ఎంతో మానసిక ప్రశాంతతను సాధించి, దుఃఖానికి దూరమవుతాడు’ అన్న నిత్యసత్యాన్ని శ్రీకృష్ణుడు బోధించాడు. ఒక్క అర్జునునిడే కాదు, విశ్వమానవులందరూ తెలుసుకోవలసిన సత్యమిది.

- Advertisement -

ఎవరైనా కోరుకునేది దుఃఖం లేని జీవితాన్నే! అది వారికి లభిస్తే అంతకన్నా ఆనందం మరేముంటుంది? మనస్సులో రాగద్వేషాలున్నంత వరకైతే అది లభించడం అంత సులభమేమీ కాదు. అందుకే, విషయవాంఛను పోగొట్టుకోవాలని చెబుతూ ‘దుఃఖరాహిత్య రహస్యాన్ని’ పరమాత్మ ప్రబోధించాడు. అయితే, ‘ఈ రాగద్వేషాలను అంత సులభంగా పోగొట్టుకోగలమా? విషయవాంఛలను ఎలా వదిలించుకోగలం?’ అంటే, దానికోసమే వ్యక్తి ‘సాధన’ చేయాలి. తాను సాధకుడుగా మారి తీవ్ర ప్రయత్నం చేస్తే అది అంత దుస్సాధ్యమేమీ కాదని స్వామివారి బోధనా సారాంశం. సాధకుడు వివేకవంతుడై, విడువకుండా ప్రయత్నించే సందర్భంలోకూడా తీవ్రమైన బాధలు కలిగించే కష్టాలు రావచ్చు. అటువంటి సమయంలోనే తనను తాను నియంత్రించుకుంటూ, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోగలగాలి. ‘..ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః’ (భగవద్గీత: 2-60). ‘క్షోభకు దారితీసేలా ఇంద్రియాలు మన మనస్సుల్ని బలవంతంగా లాక్కొని పోతుంటాయి. దానికి కారణం, చిత్తం దుర్బలమైంది కనుక’. దీపం లేని ఇండ్లలోనే దొంగలు పడటం సహజం. సంయమనం లేని మనస్సులోనే ఈ విధమైన ‘లౌల్యం’ చోటు చేసుకొంటుంది. దీన్ని జయించడానికి వ్యక్తికి ధీశక్తికూడా తోడు కావాలి. అప్పుడే, దుఃఖాలకు దూరమయ్యే మార్గం అతనికి దొరుకుతుంది.

రాగద్వేషాలనుండి విడివడిన సాధకుడు తాను ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని ఉంటాడు కనుక, ఎన్ని విషయాలు అతనిని చుట్ట్టుముట్టినా తాను మాత్రం నిర్దోషిగానే నిలబడగలడు. ‘పాము విషం కోరల్లో ఉన్నట్లు’ మన సుఖదుఃఖాలు ఇంద్రియాల్లో ఉంటాయి. కోరలు తీసేసిన పామువల్ల భయం లేనట్లే, ఇంద్రియాలను తన అధీనంలో పెట్టుకున్నవానికి ఏ భయమూ ఉండదు. సాధకుడైన వ్యక్తి తన ఆహార విహారాదుల్లోను, ఇతర లోకవ్యవహారా ల్లోనూ సమబుద్ధిని కలిగిఉంటాడు. కనుక, ఏ భయమూ ఉండదు. కేవలం శరీర రక్షణకోసమే ఆహారం స్వీకరిస్తాడు. విధి నిర్వహణకు శరీర రక్షణ అవసరం గనుక అది తప్పదు. బ్రహ్మజ్ఞానులైన వారికి రాగద్వేషాలు ఉండవు. ‘శరీరానికి అన్నం అవసరం. కనుక, అన్న సంపాదనకోసం శాస్త్రనిందితం కాని కర్మనే’ వారు చేస్తారు. ‘ఆహారం ప్రాణరక్షణకే. ప్రాణరక్షణ తత్తజిజ్ఞాస కోసమే. తత్త్వజ్ఞానం జన్మరాహిత్యానికి! (‘యోగవాసిష్ఠము’)’ అన్న ఈ మాటలు పునర్జన్మ లేకుండా తనను తాను ఉద్ధరించుకోవాలనుకునే సాధకునికి దిక్సూచి వంటివి. అప్పుడే ‘అతడు రాగద్వేషాల కుబుసాల్ని విడిచేసి, సకల దుఃఖాలకు దూరమై సత్ఫలితాలను సాధిస్తాడని’ భగవద్గీత ప్రబోధిస్తున్నది.

గన్నమరాజు
గిరిజా మనోహరబాబు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దుఃఖ నివారణ రహస్యం!
దుఃఖ నివారణ రహస్యం!
దుఃఖ నివారణ రహస్యం!

ట్రెండింగ్‌

Advertisement