e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home చింతన అమ్మానాన్నలే అద్భుత దైవాలు!

అమ్మానాన్నలే అద్భుత దైవాలు!

యన్మాతా పితరౌ వృత్తం తనయే కురుతః సదా
న సుప్రతికరం తత్తు మాత్రా పిత్రాచ యత్కృతమ్‌

  • శ్రీమద్రామాయణం (అయోధ్యకాండ: 111వ సర్గ)
అమ్మానాన్నలే అద్భుత దైవాలు!
- Advertisement -

‘తల్లిదండ్రులు తమ సంతానానికి జన్మనివ్వడమేగాక తమ శక్తికి తగినట్లుగా అన్న వస్ర్తాలను సమకూరుస్తూ పెంచి పెద్ద చేస్తారు. నన్నింత ఉన్నతునిగా తీర్చిదిద్దిన నా తండ్రి ఆజ్ఞలను పాటించడమే నా జీవితంలో ప్రధాన కర్తవ్యం’. అడవులకు వెళ్లడం మానుకొని రాజ్యాన్ని పరిపాలించవలసిందిగా కోరినప్పుడు శ్రీరామచంద్రుడు, దాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ, తమ రాజ పురోహితుడైన వసిష్ఠునితో అన్న మాటలివి. ‘సంతానాన్ని పెంచడానికి తల్లి పడే శ్రమ, తపన వెల కట్టలేనివి. అమ్మ నలుగుపెట్టి స్నానం చేయించి నిద్రపుచ్చుతుంది. ప్రేమతో మాట్లాడుతూ, ఆలనా పాలనా చూస్తూ ప్రాణప్రదంగా పెంచుతుంది. అలాంటి తల్లి ఋణాన్ని తీర్చుకోవడమనేది ఈ సృష్టిలో ఎవరికీ సాధ్యం కాదు’ అని శ్రీరాముడు సమాధానమిచ్చి వనవాసానికి సిద్ధమైనాడు.

మానవునికి పుట్టుకతో సంక్రమించే ఋణాలు నాలుగు (తల్లిదండ్రులు, దేవ, ఋషి, గురు ఋణాలు). ‘ధర్మం తప్పకుండా నడుచుకుంటూ జీవించడం వల్ల ఋషి, దేవ, గురువుల ఋణాలనూ తీర్చుకోవచ్చు. దేహం నశించినా తల్లిదండ్రుల ఋణాన్ని మాత్రం తీర్చుకోలేం. పితరుల ఋణం దేహనాశమైనా తీరదు’ (వ్యాస మహాభారతం, ఆదిపర్వం, అధ్యాయం: 119). ‘ధార్మిక కార్యక్రమాల వల్ల దైవఋణాన్నీ, ఆధ్యాత్మిక సంపదను విస్తరింపజేయడం ద్వారా ఋషిఋణాన్నీ, సేవ-దక్షిణల ద్వారా గురుఋణాన్నీ తీర్చుకోవచ్చుగానీ, తల్లిదండ్రుల ఋణాన్ని మాత్రం ఎవరూ తీర్చుకోలేరు. తల్లిదండ్రులకు మేలు చేస్తే సుఖం, కీడు చేస్తే దుఃఖం కలుగుతుంటాయి. వాటి పరిమితులను నిర్ణయించడమనేది బ్రహ్మదేవునంతటి వానికైనా సాధ్యం కాదు’ (తిక్కన సోమయాజి, మహాభారతం, ఆనుశాసనిక పర్వం: 4-259). ‘ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉంటుందేమో కానీ తల్లిదండ్రులు, గురువుల పట్ల చేసే పాపానికి మాత్రం ప్రాయశ్చిత్తం ఉండదు’ (మహాభారతం, ఆనుశాసనిక పర్వం: 4-260). ‘తల్లిదండ్రులిద్దరిలో తల్లిదే అగ్రస్థానం’ అని ఉపనిషత్‌ వాక్యాలు నొక్కి చెప్తున్నాయి.

కొడుకైనా, కూతురైనా సరే తల్లి ఆజ్ఞలను కాదనకుండా పాటించాలి. అనేక సంవత్సరాలు చేసిన తపస్సూ, ఎంతో కష్టపడి నేర్చుకున్న చదువూ, ధర్మాలన్నిటి ఉమ్మడి రూపమే దైవస్వరూపుడైన తండ్రి. కనుక, అతని మనస్సు నొప్పించే పనులను సంతానం ఎంతమాత్రం చేయకూడదు’ (మహాభారతం, శాంతిపర్వం: 5-276). అతణ్ని సంతోషపెడితే సమస్త దేవతలను సంతోషపెట్టిన ఫలం లభిస్తుంది (మహాభారతం, శాంతిపర్వం: 5-271). ‘మాతా సమం నాస్తి శరీర పోషణం’. తల్లి వలె మన శరీరాన్ని ఆకలి దప్పులు లేకుండా కనిపెడుతూ ఎవరూ పోషించలేరు. నవమాసాలు మోసి, కంటికిరెప్పలా కాపాడుతూ, మరణాంతకమైన ప్రసవ వేదనను భరిస్తూ, బిడ్డకు జన్మనిచ్చి, చక్కగా ఎదగడానికి జీవితాన్నంతటినీ ధారపోసే కన్నతల్లి ఋణానికి ‘ఏ ధనం, సేవలూ’ ఎప్పటికీ ప్రత్యామ్నాయాలు కావు.

ఈ సృష్టిలో గాయత్రిని మించిన మంత్రం గానీ, కన్నతల్లిని మించిన దైవం గానీ లేదు. తల్లిదండ్రులు జీవితకాలం సంపాదిస్తూ తమ ఆకళ్లను చంపుకొని పస్తులుంటూ, కూడబెట్టిన సంపదనంతా తమ సంతానానికే కట్టబెడతారు. పెండ్లిళ్లు చేసి, వారు సుఖంగా జీవించే పరిస్థితులను సమకూరుస్తారు. ‘అంతటి త్యాగమూర్తులను ప్రతి మానవుడూ విధిగా, విధ్యుక్త ధర్మంగా ప్రత్యక్ష దైవాలుగా భావించాలి. వారు అడిగిందే తడవుగా, లేదనకుండా ఏ ప్రయత్నం చేసైనా కోరిన వాటిని సమకూరుస్తూ వారిని సేవిస్తుండాలి. అప్పుడే, ఈ మానవజన్మకు సార్థకత’ అంటున్న మన సనాతన ధర్మ సందేశాన్ని అందరం అవగాహన పరచుకుందాం.

డాక్టర్‌ శాస్ర్తుల రఘుపతి 73867 58370

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అమ్మానాన్నలే అద్భుత దైవాలు!
అమ్మానాన్నలే అద్భుత దైవాలు!
అమ్మానాన్నలే అద్భుత దైవాలు!

ట్రెండింగ్‌

Advertisement