e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home చింతన దక్షుని కక్ష

దక్షుని కక్ష

మైత్రేయ మహర్షి విదురునికి వివరించిన ‘దక్ష చరిత్ర’ను శుక ముని పరీక్షిత్తుకు ఇలా ప్రవచించాడు- శంకరుని శపించి దక్షుడు సభాసదుల నిరసనల మధ్య ఆగ్రహంతో తన నివాసానికి వెళ్లిపోయాడు. శంకర కింకరులలో శ్రేష్ఠుడైన నందికేశ్వరుడు కోపంతో కన్నెర్ర చేసి తన స్వామిని శపించిన దక్షునికి, అతని అనుయాయులకు తగిలేటట్టుగా ఇలా దారుణంగా పలికాడు-

దక్షుని కక్ష

“దేహాత్మవాది (మరణశీలమైన తన ‘మేను’-దేహాన్ని ‘నేను’-ఆత్మగా, మిక్కిలి మహిమ గలదిగా భావించువాడు), భేదదర్శి (అభేద దర్శనమే జ్ఞానం, భేదదృష్టి అజ్ఞానం) అయిన ఈ దక్షుడు వట్టి మూర్ఖుడు. అద్వేష్ట- ఎవ్వరినీ ద్వేషించనివాడు, అప్రతిద్రోహి- ద్రోహికి కూడా ద్రోహం తలపెట్టనివాడు, అయిన అభవుని (శివుని) ద్వేషించు ఈ అజ్ఞాని ఆత్మ తత్తాన్ని- పరమార్థాన్ని, విస్మరించి పశుప్రాయుడై కామినీ పరవశుడౌగాక! అంతేకాదు, వీడు అచిరకాలంలోనే ‘గొర్రె తలవాడు’ అగుగాక! ఈ శివద్రోహులు అసత్‌ కర్మల మోహజాలంలో చిక్కుపడి, చావు పుట్టుకల సంసార చక్రంలో తగుల్కొని తిరుగుతూ ఉందురు గాక! వీనిని అనుసరించే ఈ అవనీసురులు (బ్రాహ్మణులు) భక్ష్య-తినదగినవి, అభక్ష్య- తినదగనివి, అనే ఆలోచన లేక అన్నిటినీ ఆరగిస్తారు. విద్యను, తపస్సును, వ్రతాలను ఉదరపూరణ-పొట్ట పోసుకోవడానికే అవలంబిస్తారు. దేహ, ఇంద్రియాల మీది ఆసక్తితో ధనాశాపరులై, యాచకులై సంచరిస్తారు.”

నందీశ్వరుని శాపవాక్కులు విని ఆగ్రహించి భృగు మహర్షి- ‘లోకంలో శివదీక్షా పరులు, వారిని అనుసరించువారు పాషండులై- వేద విరుద్ధ వ్రత, ఆచార, ప్రసంగాలు కలవారై భ్రష్టులగుదురు గాక! భస్మాన్ని, జడలను, ఎముకలను ధరించు అపవిత్రులై నశింతురు గాక!’ అని ప్రతిశాపం సంధించాడు. ఇలా పరస్పరం శాపనార్థాలు పెట్టుకున్నా సర్వపాప, తాప నివారకమైన ఈశ్వరానుగ్రహంతో వారు నశించలేదు. విశ్వేశ్వరుడు విమనస్కుడైన- మనస్సు వికలమైన వానివలె (విమనా ఇవ) తన అనుచరులతో ఆ ప్రదేశం వదలి వెళ్లిపోయాడు. బ్రహ్మవాదులైన మునులు, మహర్షులు యజ్ఞాన్ని ముగించి సంతుష్ట హృదయులై తమ-తమ నివాసాలకు తరలిపోయారు. ‘అభవుడు, ఆత్మారాముడు అయిన శివ భగవానునికి ఖేదం- వికలత్వం కల్గటమనేది కల్పన- ఊహకు కూడా అందని అసంబద్ధమై, అసంగతమైన విషయం. వేద విరుద్ధ కర్మలను, వామ మార్గాన్ని విరమించుకొని, సంప్రదాయ బద్ధమైన, శుద్ధ సాత్తికమైన (ఏకో దేవః కేశవో వా శివోవా) శైవ లేక వైష్ణవ మార్గాన్ని అవలంబించుటే శ్రేయస్కరం’ అని మాత్రమే పరస్పర శాపాలతో కూడిన ఈ ప్రకరణానికి పరమ తాత్పర్యం!

శ్లో.‘న వైరాగ్యాత్‌ పరం భాగ్యం, న బోధా దపర స్సఖా, న హరే రపరస్ర్తాతా న సంసారాత్పరో రిపుః’- వైరాగ్యాన్ని మించిన భాగ్యం, జ్ఞానం వంటి సఖుడు, హరిని మించిన రక్షకుడు, సంసారాన్ని తలదన్నిన శత్రువు లేరు గదా! పర వైరాగ్యానికి పరాకాష్ఠ అయిన పరమేశ్వరుడు కైలాసంలో ప్రశాంతంగా ఉన్నాడు. కాని, దయాశాలి అయిన శూలి (శివుని) మీద కక్ష పూనిన దక్షునికి మాత్రం- ‘కంటికి నిద్ర వచ్చునె? సుఖంబగునే రతికేళి? జిహ్వకున్‌ వంటక మించునే?’ అన్న చందాన నిద్రాహారాలు లేవు. అహర్నిశం- రాత్రింబవళ్లు అశాంతంగా ఉన్నాడు. శాంతము లేనిదే సౌఖ్యమెక్కడ?

మైత్రేయ మహర్షి మరల ఇలా ముచ్చటించాడు- విదురా! మామా అల్లుళ్ల మనఃస్పర్ధతో చాలా కాలం గడచిపోయింది. ఇంతలో బ్రహ్మదేవుడు దక్షుని ప్రజాపతులందరికీ అధ్యక్షునిగా నియమించాడు. ఇంకేముంది? వంకరబుద్ధి దక్షుడు ప్రమథాధిపుని (శివుని) మీది ప్రతీకార వాంఛతోను, అధికార మదగర్వంతోను రుద్రుడు లేని యజ్ఞం ఉండనప్పటికీ రుద్రహీనంగా ‘వాజపేయం’ అనే యజ్ఞం చేశాడు. పగ చల్లారక పశుపతిని బహిష్కరించి దక్షుడు మరోమారు ‘వాజపేయం’ కంటే గొప్పదైన ‘బృహస్పతి సవనం’ అనే యజ్ఞానికి అపక్రమంగా ఉపక్రమించాడు. ‘అధికార రోగ పూరిత బధిరాంధక శవము జూడ పాపము’ అని గదా సుమతీ సూక్తి! అంధుని పిక్కబలం ఎలా వ్యర్థమో, క్రోధాంధుని రెక్కల బలం పక్క బలం కూడా నిక్కంగా నిరుపయోగమే!

దక్షుని యజ్ఞ వైభవం దర్శించాలని దేవతలంతా ద్వితీయా (భార్యా) సమేతంగా విమానారూఢులై వియన్మార్గంలో వెళ్లటం వీక్షించి సతి తన ప్రాణపతి పశుపతిని- ‘ప్రభూ! మా నాన్నగారు చేసే మఖానికి- యజ్ఞానికి, మనం కూడా వెళుదాం. పుట్టింట్లో జరిగే పుణ్యకార్యాలకు పోకపోతే ఏ పుత్రిక ప్రాణాలు నిలుస్తాయి? పిలవని పేరంటంగా పోవడం పాడి కాదని మీరు పలుకవచ్చు. మదనాంతకా! పితృ సదనానికి వెళ్లడానికికూడా పిలుపు కావాలా? అభవా! మీ అర్థాంగినైన నా అభ్యర్థనను దయచేసి వ్యర్థం కానీయకండి’ అని దీనంగా అర్థించింది. ప్రయాగ సత్రయాగంలో దక్షుడు సంధించిన సునిశిత వాక్యసాయకాలు (బాణాలు) స్మరణకు రాగానే స్మరవైరి (రుద్రుడు) మందస్మితం చేసి ఇలా అన్నాడు-

ప్రియే! ప్రేమానురాగాలు పరస్పరం పెనవేసుకుని ఉన్నప్పుడే నీ పలుకులు ప్రామాణికాలు అవుతాయి. ఆప్యాయతగల ఆత్మబంధువుల ఇళ్లకు ఆహ్వానం లేకపోయినా వెళ్లవచ్చు. నీ తండ్రి సరసుడు కాడు. ఈ పట్టున నీవు పుట్టింటికని వెళ్లినా నిన్ను నేను కట్టుకొన్నందున కన్నకూతురివైనా మీ నాన్న నిన్ను కన్నెత్తికూడా చూడడు సరికదా, కనుబొమ్మలు చిట్లిస్తాడు. సుందరీ! మందబుద్ధులు మదోన్మత్తులై మహాత్ముల మహిమను మదినెంచి గౌరవించరు. అంతేకాదు-
సుదతీ! శక్తివంతుడైన శత్రువు ప్రయోగించిన శరముల (బాణాల) చేత శరీరం జీర్ణ జీర్ణమైనా- తూట్లు పడినా, ఆ బాధను భరిస్తూ కూడా బాధితుడు ఏదో ఒక సమయంలో ఆద మరచి నిద్రిస్తాడే కాని కృంగి కృశించిపోడు. కాని, దాక్షాయణీ! దగ్గరి బంధువులు ఇష్టత లేక దుష్టబుద్ధితో ఆడిన దుర్భాషలు గుండెల్లో గునపాల్లా గుచ్చుకొని కంటికి కునుకు లేకుండా చేస్తాయి. పగలు-రేయి వగలతో ఒంటిని కృశింప జేస్తాయి.
గరళాన్ని (విషాన్ని) గళం (కంఠం)లో దాచి పెట్టుకొని శశికళ (చంద్రరేఖ)ను శోభనంగా శిరమున దృశ్యమానంగా ధరించిన నీలకంఠుడే (శివుడే), పరుల దోషాలను మదిలోనే పదిలంగా ఉంచుకొని, ఇంచుక-కొద్ది గుణాలనుకూడా ఎంతో హెచ్చుగా- పెద్దగా ఎంచుకొని తలదాల్చే పండిత శిరోమణులకు పరమ ఆదర్శం.

‘న బ్రూయాత్‌ సత్యమప్రియం’- అప్రియమైన సత్యాన్ని పలక వద్దని కదా సనాతన ధర్మం! తనకు మామకు మధ్య తలెత్తిన మనఃస్పర్ధను వామదేవుడు (శంకరుడు) ఇంతవరకు తన భామామణి సతీదేవికి చెప్పి నొప్పించలేదు. ఇప్పుడిక కనువిప్పుకై గుట్టురట్టు చెయ్యక తప్పలేదు.
‘సతీ! అహంకార మమకారాలు లేనివారు, పాపరహితులు అయిన సజ్జనులకు సహజంగానే సత్కీర్తి లభిస్తుంది. అట్టి అమలిన కీర్తిని ఆశించి అయోగ్యులు కొందరు అసమర్థులై దానిని పొందలేక భంగపడి వందనీయులైన యశోధనులందరిపై నిందలు మోపుతారు. మహాశక్తిమంతుడు, మహామహిమోపేతుడైన విష్ణు భగవంతునిపై అసహిష్ణులై- ఓర్వలేక, పగ పెంచుకొన్న అశక్తులైన అసురులవలె వారు కూడా అకారణంగా అసూయ అనే అగ్నిని రగుల్చుకొని అంతరంగాలలో నిరంతరం దహించుకుపోతూ ఉంటారు’. (మూలంలోని ‘పాపచ్య మానేన హృదాతురేంద్రియ..’ అనే శ్లోకానికి పై మత్తేభ వృత్తం విస్పష్టంగా అర్థాన్ని వ్యక్తపరచే పోతన అమాత్యుని యథోచిత
అనుసరణం.)

దేవీ! మా దివ్య విభూతులను చూసి నీ తండ్రి నేత్రాల్లో నిప్పులు పోసుకుంటున్నాడు. లోకంలో ప్రజ్ఞావంతుల ‘వందన’ విధానం విలక్షణంగా విరాజిల్లుతుంది. దానిని విజ్ఞులు తప్ప అజ్ఞులు గ్రహించలేరు. స్వామి సర్వాంతర్యామి అని సంభావించి వారు దేహాభిమానగ్రస్తులకు మానసికంగానే వందన మాచరిస్తారు. మీ తండ్రిని కూడా నేను అలాగే వందించాను. ఆ మూర్ఖుడు గ్రహించలేక పోయాడు. సాధ్వీ! నన్ను కాదని వెళితే నీకు పరాభవం తప్పదు-

‘జనకుని చే బూజ బడయ జాలవు తరుణీ!’. బంధువులచేత అవమానం పొందటం మరణ సమానం- అని మహాదేవుడు మౌనం వహించాడు.

(సశేషం)

మ.‘నిరహంకార నిరస్తపాప సుజనా నింద్యోల్ల సత్‌కీర్తి గొం దఱు కామించి యశక్తులై మనములన్‌ దందహ్య మానేంద్రియా తురులై యూరక మచ్చరింతురు మహాత్ముండీ శ్వరుండైన యా హరితో బద్ధ విరోధముం దొడరు దైత్యశ్రేణి చందంబునన్‌.’

చ.‘సమద రిపు ప్రయుక్త పటు సాయక జర్జరితాంగు డయ్యు దుః ఖమును దొఱంగి నిద్రగనుగాని కృశింపడు మానవుండు, నో యుమ! విను మిష్ట బాంధవ దురుక్తులు మర్మములంట నాట జి త్తమున నహర్నిశంబు బరితాపము నొంది కృశించు నెప్పుడున్‌.’

తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దక్షుని కక్ష

ట్రెండింగ్‌

Advertisement