e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home చింతన అవి నరక ద్వారాలు!

అవి నరక ద్వారాలు!

శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్‌శరీర విమోక్షణాత్‌
కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః॥

  • భగవద్గీత (5-23)
    ‘ఈ శరీరాన్ని విడువక ముందే (జీవించి ఉండగానే) కామ క్రోధాదులను అదుపులో ఉంచుకోగల మానవుడే సుఖవంతుడు. అతడే యుక్తుడు!’. ఇంద్రియాలు ఎప్పుడూ బాహ్యవిషయాలపైనే ఆసక్తిని కలిగిస్తాయి. ఫలితంగా కోరికలు పుడతాయి. అవి అనుభవించిన కొద్దీ పెరుగుతుంటాయి, పూర్తిగా తీరేవీ కావు. కొన్ని కోరికలైతే ఒకసారి తీరినాకూడా మరల మరల పుడుతూనే ఉంటాయి. అందువల్ల, వాటిని పూర్తిగా తీర్చుకోవడం అసాధ్యం. కోరికలు తీరక పోవడం వల్ల క్రోధం ఏర్పడుతుంది. ‘పొగతో అగ్ని కప్పి వేయబడినట్లు’ క్రోధంతో జ్ఞానం (వివేకబుద్ధి) కప్పి వేయబడుతుంది. దీంతో మనిషి విచక్షణ కోల్పోయి పాపకార్యాలకు పాల్పడతాడు.
అవి నరక ద్వారాలు!

కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః
మహాశనో మహాపాప్మా విద్ధ్యేన మిహ వైరిణమ్‌

  • భగవద్గీత (3-37)
    ‘రజోగుణం నుంచి పుట్టిన కామమే క్రోధరూపాన్ని పొందుతుంది. ఇది తీరని ఆకలితో కూడింది. మహా పాపాలను ప్రేరేపిస్తుంది. ఇది పరమశత్రువు అని తెలుసుకోవాలి’. కామక్రోధాల స్వభావమే అంత. ఇవి ‘భస్మాసుర హస్తం’ వంటివి. వీటితో మానవుడు తనను తానే నశింపచేసుకుంటాడు. విపరీత కోపం గలవారిలో ఒక్కోసారి రక్తపు పోటు (బీపీ) బాగా పెరిగి నరాలు చిట్లి పోవడం, ఫలితంగా మరణానికి దారితీయడం వంటివి జరుగుతున్నాయి కదా.

‘భాగవతం’లో హిరణ్యకశిపునితో అతని కుమారుడు, మహాభక్తుడు అయిన ప్రహ్లాదుని మాటలు ఇక్కడ సందర్భోచితం. “తండ్రీ! ముల్లోకాలను జయించితినని అంటున్నారు. కానీ, మిమ్మల్ని మీరే జయించలేకున్నారు. మీలోని కామక్రోధాదులను జయించలేక పోయారు కదా!’. భౌతికంగా ఎంత ఉన్నతిని సాధించినా, ఎన్ని విజయాలు పొందినా, తనను తాను జయిస్తేనే నిజమైన విజయుడవుతాడు. గొప్ప తపోధనుడైన విశ్వామిత్రుని వృత్తాంతం మరో ఉదాహరణ. కామక్రోధాదుల కారణంగానే ఎంత గొప్ప తపస్సు చేసినా అతని అహంకారం తొలగలేదు. కామంతో మేనక సుఖం కోసం చివరికి ఘనమైన తపశ్శక్తినీ కోల్పోయాడు. వశిష్ఠ మహర్షిపై గల క్రోధంతో ‘త్రిశంకుని’ కోసం స్వర్గాన్ని సృష్టించే వరకు తన తపశ్శక్తిని వృథా చేసుకున్నాడు. తనలోని కామ క్రోధాదులను జయించాకే విశ్వామిత్రుడు ‘బ్రహ్మర్షి’ అయ్యాడని ‘రామాయణం’ స్పష్టం చేస్తున్నది. ‘ఒక్కసారి పొందే కోపం వల్ల ఒక నెలరోజుల పాటు లభించిన తపశ్శక్త్తి వృథా అవుతుంది’ అన్న ఋషుల వాక్కు గమనార్హం.

‘కోపం’వల్ల కొన్ని సందర్భాల్లో మేలు కలుగుతుంది. తల్లిదండ్రులు, గురువులు వంటివారు పిల్లల అభివృద్ధిని ఆశించి చూపించే కోపం హానికరం కాదు. ఒక్కోసారి కొందరు ఋషుల కోపాలూ ప్రయోజనాన్ని చేకూర్చినవే కానీ, వినాశకరాలు కాలేదు. ఇలాంటి కోపం గడ్డిపోచలోని అగ్ని వంటిది. కానీ, ద్వేషం, శత్రుత్వంతో కూడిన కోపం వినాశకారి అవుతాయి. ‘క్రోధం’ ఎలాంటి వారిలో ఉన్నా నియంత్రించదగిందే. ‘అహంకారం, కామం, క్రోధం’ వంటివన్నీ రాక్షసగుణాలు. వీటివల్ల మనిషి హింసాప్రవృత్తికి లోనై అనేక పాపాలు చేస్తాడు. ఇలాంటివారు ఘోరమైన నరకాలకు వెళ్లడమేకాక మరల మరల హీనమైన జన్మలను పొందుతారని ‘భగవద్గీత’ హెచ్చరిస్తున్నది. ఈ నరక ద్వారాల బారిన పడని వారే పరమగతిని పొందుతారని శ్రీకృష్ణ భగవానుడు ఉద్భోదించాడు.

కామక్రోధా వనిర్జిత్య కిం అరణ్యే కరిష్యతి
ఆర్యోక్తి
‘కామక్రోధాదులను విసర్జించనివారు అరణ్యాలలో ఉండికూడా ఏమీ చేయలేరు. అంటే, శాంతిని పొందలేరు. కామ క్రోధాదులను జయించినవారు అరణ్యానికి వెళ్లవలసిన పనే లేదు. ఎక్కడైనా శాంతిగా ఉండగలరు. అందువల్ల, ఇంద్రియ నిగ్రహంతో కామక్రోధాది అరిషడ్వర్గాలను జయించడం వల్లనే పరమమైన శాంతిని పొందగలరు.

దోర్బల కుమారస్వామి
94400 49608

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అవి నరక ద్వారాలు!

ట్రెండింగ్‌

Advertisement