e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home చింతన మనో ధైర్యాన్నిచ్చే మంగళచండి!

మనో ధైర్యాన్నిచ్చే మంగళచండి!


ప్రకృతేర్ముఖ సంభూతా మంగళదా సదా
సృష్టౌ మంగళ రూపాచ సంహారే కోపరూపిణీ॥

మనో ధైర్యాన్నిచ్చే మంగళచండి!


‘మంగళం’ అంటే ‘శుభాన్నిచ్చేది’. ‘చండి’ అంటే ‘ప్రతాపమూర్తి’. కనుక, ఆమె పేరు ‘మంగళచండి’. మూలప్రకృతి దుర్గాదేవి రూపాంతరమే ‘మంగళచండి’. ఈ దేవి నవదుర్గలలో ఒకరు. సృష్టి స్థితులలో మంగళగా, లయలో చండిగా ఉంటుంది. ధర్మం, పుణ్యం ఉన్నచోటే మంగళ. అధర్మం, పాపం ఉన్నప్పుడు చండి. భూమి కొడుకు మంగళుడు, మనువంశరాజు మంగళునిచేత పూజింపబడటం వల్ల ఈ తల్లికి ఆ పేరు వచ్చింది. ప్రథమంగా శివుడు ఈమెను ఆరాధించాడు. త్రిపురాసురుల సంహారమప్పుడు బ్రహ్మాదుల ఉపదేశం మేరకు శివుడు స్తోత్రం చేయడంతో ప్రత్యక్షమై, అభయమిచ్చి శక్తిస్వరూపిణియై శివుడికి తోడ్పడింది. అలా దేవి సహాయంతో శివుడు త్రిపురాసురులను జయించిన కారణంగా, దేవతలందరూ శివుణ్ని ప్రశంసిస్తూ అసలు కారకురాలైన ‘మంగళచండి’ని పూజించారు. మరోసారి శుంభ, నిశుంభ రాక్షసులను సంహరించమని దేవతలంతా వేడుకోగా, అప్పుడు ఈ పరాశక్తి దేహం నుండి ఒక దేవత ‘చండికా’నామంతో వెలువడింది. ఈమెను ‘అంబికా’ అంటారు. అసలు పేరు ‘చంద్రఘంటాదేవి’. రక్తబీజ రాక్షసుని సంహరించినందున అంబిక, అమ్మవారి శిరస్సుమీది చంద్రుడు గంటాకృతిలో ఉన్నందున ‘చంద్రఘంట’గా పిలుస్తారు. సింహవాహనంపై ఈ అమ్మ ఎనిమిది చేతులతో దర్శనమిస్తుంది. గద, విల్లమ్ములు, ఖడ్గం, శూలం, కమలం, అభయముద్ర, కమండలం, జపమాలతో దర్శనమిస్తుంది.

ప్రతి మంగళవారం ‘మంగళచండి’ని పూజించడం ఆనవాయితీ. స్త్రీలు పూజించాల్సిన దేవత ఈమె. స్త్రీలకు అన్ని మంగళములు కలిగించేదికూడా ఈమెయే. కోపం వస్తే సమస్త విశ్వాన్నీ నమిలి వేయగలదు. ఇది తల్లి యొక్క ఐదవ రూపం. అమ్మవారిని ప్రకృతిగా చెప్పుకుంటున్నప్పుడు సృష్టిలో ప్రతి స్త్రీకూడా అమ్మవారి రూపమే. ప్రతి స్త్రీలోనూ అమ్మవారి కళ ఉంటుంది. ఈ కారణం చేతనే రెండేండ్ల వయసునుండి మరణ పర్యంతం స్త్రీని అమ్మవారి భావనతో ఆరాధిస్తాం. కుమారి, బాల సుహాసిని, ‘గంగా భాగీరథి సమానం’ అంటూ స్త్రీని ప్రతి దశలోనూ గౌరవించడం భారతీయ సంప్రదాయం. స్త్రీలో అమ్మవారి అనుగ్రహం, చైతన్యం, విభూతి ఉంటాయి. అమ్మవారిని ఎన్ని రకాలుగా ఆరాధించినా చివరకు స్త్రీరూప ఆరాధనతోనే ఆ పూజ పరిపూర్ణమవుతుంది. కనుక, స్త్రీ ఎప్పుడూ మంగళ స్వరూపిణియే. ఈ పూజ చేసిన వారికి శత్రుభీతి పోయి కుటుంబమంతా మంగళకరంగా ఉంటుంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఉపదేశించిన పూజావిధానం ‘శ్రీ దేవీ భాగవతం’లో ఉంది. ఈ దేవిస్తోత్రం మంగళవారం పఠిస్తే కుజగ్రహ దోషాలు పోయి, అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని శాస్ర్తాలు చెబుతున్నాయి.

మనోధైర్యం కోల్పోయినప్పుడు ఈ తల్లిని పూజించాలి. భగవంతునిపై గట్టి నమ్మకం లేకపోవడం వల్ల చాలామంది మనోధైర్యాన్ని కోల్పోతారు. మనం అనుకున్న పని కాకున్నా, పెద్దలు చెప్పిన మాట పిల్లలు వినకున్నా, ప్రతి సామాన్య విషయానికి మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండటానికి తామసిక శక్తినుండి మనలను కాపాడేది ఈ చండీదేవియే. ‘ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే’. ‘ఐం’ అంటే సరస్వతి, ‘హ్రీం’ అంటే లక్ష్మి, ‘క్లీం’ అంటే గౌరి. త్రిమాతల సముదాయం ‘విచ్చే’ అంటే ‘రమ్మని’ ఈ మంత్రార్థం. మనోధైర్యాన్ని పూర్తిగా కోల్పోయి భయం భయంగా బతుకుతున్న వారందరికీ తొమ్మిది అక్షరాల ఈ మంత్రమే తిరుగులేని రక్ష.

వేముగంటి శుక్తిమతి
99081 10937

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మనో ధైర్యాన్నిచ్చే మంగళచండి!

ట్రెండింగ్‌

Advertisement