e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home చింతన నమో నారసింహా!

నమో నారసింహా!

నమో నారసింహా!

‘చతుర్దశం నారసింహం బిభ్రత్‌ దైత్యేంద్ర మూర్జితం’. ‘అసురరాజైన హిరణ్యకశిపుని వధించడానికి భగవంతుడు 14వ అవతారంలో శ్రీనృసింహదేవుని రూపంలో అవతరించాడు’ అని ‘శ్రీమద్భాగవతం’ (1.3.18) పేర్కొంది. ‘తవ కర కమలవరే నఖమద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తనుభృంగం కేశవధృత నరహరి రూప జయజగ దీశహరే’. ‘ఓ కేశవా! నరహరి రూపాన్ని ధరించిన ఓ శ్రీహరీ! నువు భృంగము వంటి హిరణ్యకశిపుని దేహాన్ని నీ కరకమలముల యొక్క అద్భుతమగు గోళ్ళతో చీల్చివేసితివి’ అని భక్త జయదేవుడు కీర్తించాడు. ధర్మవినాశనం జరుగుతున్నప్పుడు దాన్ని పరిరక్షించడం కోసం జగత్తులో భగవదవతారం ప్రకటితమవుతుంది. భక్త రక్షణే మూలంగా, అందులో దుష్టశిక్షణం ఒక అంశంగా జరిగిన అవతారమే శ్రీనరసింహదేవుని అవతారం. ‘ఇప్పుడే నా ఖడ్గంతో నీ శిరస్సును ఖండిస్తాను. ఏ విధంగా నీ శ్రీహరి నిన్ను రక్షిస్తాడో చూస్తాను’ అని క్రోధావేశంతో హిరణ్యకశిపుడు పలికినప్పుడు దానికి సమాధానంగా భగవంతుడు నరహరి అవతారుడై ఆవిర్భవించాడు.

ఆ విధంగా తన భయాన్ని తొలగించిన శ్రీనృసింహుడు ఎల్లరకూ భయాన్ని తొలగించగలడని సాక్షాత్తుగా ప్రహ్లాదుడే పలికాడు. ‘రూపం నృసింహ విభయాయ జనాః స్మరన్తి’, ‘ఓ నృసింహదేవా! తమ భయ నివారణకు విశ్వజనులు నీ రూపాన్నే స్మరిస్తారు’ అని ఆ బాలభక్తుడు తన స్తుతిలో వర్ణించాడు. శ్రీనృసింహదేవుడు వైశాఖ శుక్లపక్ష చతుర్దశి రోజు స్తంభంలో అవతరించాడు. అందుకే, నృసింహావతార శుభదినం ‘నృసింహ చతుర్దశి’గా ప్రసిద్ధి చెందింది. ముఖ్యమైన విషయమేమంటే, శ్రీనృసింహావతారం సంధ్యా సమయంలో జరిగింది. అందుకే, భక్తులు సంధ్యా సమయం వరకు ఉపవాసం ఉండి ఆ తర్వా త స్వామికి అభిషేకాది కైంకర్యాలు చేస్తారు. ప్రహ్లాదచరిత్రను వింటారు, చదువుతారు. ముఖ్యంగా భక్త ప్రహ్లాదుడు నృసింహదేవునికి చేసిన స్తుతిని భక్తి ప్రపత్తులతో పఠిస్తారు. ‘య ఏతత్కీర్తయేన్మహ్యం. నీ చరితమును, నా చరితమును కూడ స్మరిస్తూ నీవు చేసిన స్తోత్రాన్ని కీర్తించే నరుడు కాలక్రమంలో కర్మఫలం నుంచి బయటపడతాడు’ (శ్రీమద్భాగవతం: 7.10.14) అని సాక్షాత్తు శ్రీనృసింహదేవుడే భక్త ప్రహ్లాదునితో పలికాడు.

హిరణ్యకశిపుడు తాను అమరునిగా కావడానికి ఎంతో తీవ్రమైన తపస్సులు చేశాడు. పరమాద్భుతంగా బ్రహ్మ నుంచి ఎన్నో వరాలను పొందాడు. కానీ, భక్త ప్రహ్లాదుడు కేవలం శ్రీహరి భక్తి ప్రభావంతో సమస్తమైన భయాల నుంచి, సంహార ప్రయత్నాల నుంచి బయటపడ్డాడు. రాక్షసుల ఖడ్గాలు ఆ బాలుని శరీరాన్ని ఖండించలేకపోయాయి. వారి బల్లెములు అతని శరీరాన్ని గ్రుచ్చలేకపోయాయి. వారి గదలు హరిభక్తి ప్రభావం ముందు ఒట్టిపోయాయి. హరిభక్తి ప్రభావాన్ని పరమాద్భుతంగా లోకానికి ప్రదర్శించినవాడే పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు. అందుకే, మహా భాగవతుల పేర్లలో ప్రహ్లాదుని పేరే చెప్పబడుతుంది. అతిభీకరమైన రూపంతో, పరమక్రోధంతో అవతరించిన శ్రీనృసింహుని లక్ష్మీదేవితోపాటుగా ఏ దేవతా ప్రముఖుడూ శాంతింపజేయలేకపోయాడు. కేవలం ప్రహ్లాదుడు మాత్రమే సాష్టాంగదండ ప్రణామంతో ఆ స్వామిని శాంతింపజేసి భక్తుల మహిమను శాశ్వతంగా లోకానికి చాటాడు. శరణాగత భక్తుల సమస్త భయాలను, పీడలను, వ్యాధులను నశింపజేయడానికి శ్రీనృసింహుడు తెలంగాణలో యాదాద్రి, ధర్మపురి వంటి క్షేత్రాలలో, ఆంధ్రప్రదేశ్‌లో సింహాచలం, మంగళగిరి, అహోబిలం వంటి ఎన్నెన్నో క్షేత్రాలలో వెలసి అందరికీ కొంగుబంగారమై నిలిచాడు. ప్రహ్లాద వరదుడైన శ్రీలక్ష్మీనృసింహదేవుని కరుణా వీక్షణాలతో సమస్త మానవులు శీఘ్రమే కరోనా మహమ్మారి బారినుంచి బయట పడుదురు గాక!

డా॥ వైష్ణవాంఘ్రి సేవక దాస్‌
98219 14642

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నమో నారసింహా!

ట్రెండింగ్‌

Advertisement