e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home చింతన మామ అల్లుళ్ల విరోధం

మామ అల్లుళ్ల విరోధం

భక్త కవి బమ్మెర పోతన భాగవత స్కంధాల ఆరంభంలో, భవ హరమైన ఆ పురాణ రాజాన్ని తన నోట పలికించిన తన ఆరాధ్య దైవం రాజకుల భూషణుడు శ్రీరామచంద్రుని సంబోధన గల అందమైన కందపద్యాలను, స్కంధాల అంతంలో ‘మాలినీ’ వృత్తాలు వ్రాయడం ఆచారం- ఆనవాయితిగా పెట్టుకున్నవాడు. ‘శ్రీ కైవల్య పదంబు చేరుటకు’ చింతిస్తూ చతుర్థ స్కంధ అనువాదానికి ఇలా శ్రీకారం చుట్టాడు-‘రఘువంశ లలామా! దివ్యమైన సౌందర్య సిరులతో శోభిల్లు భూజాత, భాగ్యోపేత, సీతా కాంత యొక్క ముఖమనే సరోజాతానికి సూర్యునివంటి వాడా! తెల్ల తామర పూరేకుల వంటి కన్నులు కల చల్లని దేవరా! సకల భూపాల వరులచేత నుతింపబడు సద్గుణాలకు నిధి వంటివాడా! దశరథ నందన రామా! నీకు వందన చందనాలు.’

మామ అల్లుళ్ల విరోధం

చతుర్వేద సారమైన శ్రీమద్భాగవత పురాణం చతురీయ (నాల్గవ) స్కంధంలో చతుర్విధ పురుషార్థాలు- ధర్మ, అర్థ, కామ, మోక్షాలు, ఎంతో చాతుర్యంతో ‘నోరూరగ చవులు పుట్ట’ చాట బడినాయి. సనాతన ధర్మంలో పురుషార్థ సాధనే జన్మకు సాఫల్యం! వీటిని సాధించుకోలేని వారు మర్త్యలోకంలో భూమికి భారమై మనుష్య రూపంలో తిరుగాడే మృగాలని భారతీయ మహర్షుల మతం. ఈ నాలుగింటిలో ‘ఏకో పి’- ఏ ఒక్కటైనా సాధించని వాని బ్రతుకు ‘అజాగల స్తనస్యైవ’- మేక మెడలోని స్తనం వలె వ్యర్థమని శాస్త్ర పరమార్థం. ప్రథమంగా దక్షుని కథద్వారా ధర్మ పురుషార్థం వ్యతిరేక ముఖంగా, అనగా ‘ఇలా అయితే అది ధర్మం కాదు, అధర్మమే. అట్టిది ఫలప్రదం కాకపోగా విపరీత- విరుద్ధ, ఫలం కూడా కలిగిస్తుంది’- అని నిరూపింపబడింది. ఈ చతుర్థ స్కంధం కూడా చివరిదాకా విదుర-మైత్రేయ వార్తాలాపమే.

బ్రహ్మదేవుని కుడి బొటన వ్రేలినుండి పుట్టిన (మానస సృష్టి) ‘దక్షుడు’ ప్రజాపతులలో ప్రసిద్ధుడు. స్వాయంభువ మనువు పుత్రిక ‘ప్రసూతి’ ఆయన పత్ని. ప్రసూతి అంటే ప్రాణి సమూహాన్ని కనుట అనగా మిక్కిలి అధికమైన సంతతి సంజనన-పుట్టించే శక్తి. దక్షుడనగా సమర్థుడు అని అర్థం. ఏ విషయంలో అంటే ప్రజా (సంతాన) వృద్ధి చేయడంలో సమర్థుడని అన్నారు. కొడుకులను కనటంలోనే దక్షులు కాని కైవల్య సాధనలో కాదని కలియుగ పురుషుల గురించి ‘భాగవత మాహాత్మ్యం’లో నారద మహర్షి వ్యాఖ్యానించాడు.

ధర్మ ప్రధానమైన దక్షుని వంశం విస్తారంగా వృద్ధి చెందింది. ఆ దంపతుల సంతతితో ముజ్జగాలు నిండిపోయాయి. లోకంలో ప్రతి కానుపుకి ఆవుకు ఒక్కటి, సివంగి (ఆడసింహం)కి మూడు, ఆడపులికి ఐదు పిల్లలు పుట్టడం ప్రసిద్ధం. కాని, ఆశ్చర్యకరంగా అవని (భూమి)మీద గోజాతి మాత్రమే అతివిస్తారంగా ఉంటున్నది. ఎందుకని? గోవుల సాధుత్వం, క్రూర జంతువుల హింసా క్రౌర్య స్వభావమే కారణం. అధర్మం వలన వంశం నశిస్తుంది. ధర్మం వల్లనే వంశం నిలబడి వృద్ధి చెందుతుందని సనాతన ధర్మ శాశ్వత సిద్ధాంతం- ‘అధర్మో నష్ట సంతానః ధర్మః సంతాన వర్ధనః’. అధ్యాత్మ పరంగా దక్షుడు ప్రవృత్తి (కర్మ) మార్గపు అనుయాయి-కర్మిష్ఠి. కనుక, సహజంగానే సంతతి వృద్ధి సాధ్యం. భక్తి, జ్ఞానాలు నివృత్తి ప్రధానాలు, నిర్వాణ-మోక్ష ప్రదాలు. కాన, అంతగా వంశవృద్ధి కరాలు కావు.

దక్షునికి ప్రసూతి వలన పదహారుగురు పుత్రికలు కలిగారు. శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి మొదలుగా పదముగ్గురు ‘ధర్ము’నికి భార్యలయ్యారు. స్వాహాదేవిని అగ్నిదేవునికి, స్వధాదేవిని పితృదేవతలకు, కడసారి కూతురు సతీదేవిని అభవుడు- ఆద్యంత రహితుడు, భవనా శంకరుడు- సంసార విచ్ఛేదకుడు అయిన శంకరునికి ఇచ్చి వివాహం చేశాడు దక్షుడు.

సతీ-పశుపతి దంపతుల సంసారం సరసంగా, సాఫీగా సాగిపోతున్నది. సతి ప్రతినిత్యం అతిప్రేమతో పతిని సేవిస్తూన్నది. కాని, శివ సంకల్పం! సుగుణవతి అయిన సతికి సంతతి సౌభాగ్యం కలుగలేదు. ‘తన ప్రాణేశ్వరుడైన పరమేశ్వరునిపట్ల పగబూనిన తన తండ్రి (దక్షుని)మీద కోపించి వగతో ఆ సాధ్వీమణి ‘యోగమార్గంలో తన శరీరాన్ని విడిచేసింది’ అని మైత్రేయుడు చెప్పగానే విదురుడు విస్మయం చెంది ఆ వృత్తాంతం విస్తారంగా వినాలనే వేడ్కతో మహర్షిని వినయ పూర్వకంగా ఇలా ప్రశ్నించాడు-
‘మనీషీ జన విధేయా! మైత్రేయా! దక్షుడు దుహితృ (పుత్రికా) వత్సలుడు కదా! బిడ్డలపట్ల అట్టి దొడ్డ మనసు గలవాడు సతీదేవిని, ఆమె పతిదేవుని గుడ్డిగా అడ్డమైన మాటలు మాట్లాడి అంత చెడ్డగా ఎందుకు అవమానించాడు? శాంతమూర్తి అయిన శివుడు చరాచర గురుడు. తనలోనే- అంతర్ముఖుడై, విశ్రాంతి వహించు ఆత్మారాముడు. పగవారి యందు కూడా పగ లేనివాడు. జగములు మన్నించు జంగమ దేవుడు. శివం కరుడైన శంకరుడు శీలవంతులలో శ్రేష్ఠుడు. అట్టి మహాదేవుని యందు దక్షునికి అనుచితం, అసాధ్యమూ అయిన ద్వేషం ఎందుకు పుట్టింది? అంతటి మామ అల్లుళ్లకు ఇంతటి వైమనస్యం- విరోధం ఎలా కలిగింది? దాక్షాయణి తన దేహాన్ని యోగాగ్నిలో ఎందుకు ఆహుతి చేసుకుంది? మహర్షీ! ఈ వృత్తాంతం వినాలని నేను ఉవ్విళ్లూరుతున్నా. దయచేసి వివరంగా వక్కాణించండి’.

మైత్రేయుడు విదురునితో- మహాత్మా! పూర్వం తీర్థరాజమైన ప్రయాగక్షేత్రంలో బ్రహ్మవేత్తలు సత్రయాగానికి పూనుకున్నారు. బ్రహ్మదేవుడు, శివుడు, ప్రజాపతులు, పరమయోగులు, ఋషులు, మునీశ్వరులు, దేవతలు అంతా ఆసీనులై ఉన్నారు. అంతిమంగా, ఆలస్యంగా విచ్చేశాడు దక్షుడు. ముందుగా వచ్చి కూర్చుంటే మర్యాదకు లోపమని పాపం! కొందరి మతం. ఆలస్యంగా వచ్చి అందరి దృష్టిని ఆకర్షించాలె. ఇది అహంకారి లక్షణమని ఆర్యుల అభిమతం. దక్షుడు రాగానే పెద్దవాడు, ప్రజాపతి అన్న గౌరవంతో సదస్యులంతా లేచి నిలబడ్డారు. విరించి (బ్రహ్మ), విశ్వేశ్వరుడు, వీరిద్దరు మాత్రం లేవలేదు. తండ్రి బ్రహ్మకు తలవంచి తనయుడు ఆయన అనుజ్ఞతో ఆసీనుడయ్యాడు. కాని మనసు తుకతుక ఉడికి పోతున్నది. బ్రహ్మ జనకుడు కాన లేవకున్నా ఫరవాలేదు. కానీ, ఈ ధూర్జటి నాకు జామాత (అల్లుడు) కదా! మామనైన నాకు మర్యాద చూపవద్దా? పెద్దరికం గుర్తించి గద్దె దిగవద్దా? దక్షుడికి తల కొట్టేసినట్లయింది. అభవుని వలన సభాముఖంగా తనకు అవమానం జరిగిందని దేహాభిమానగ్రస్తుడైన దక్షుడు భావించాడు. సహించలేక పోయాడు.

వాస్తవానికి స్వాగత సత్కారాలకి, సన్మానాలకి అలవాటు పడ్డవారికి స్వభావం చెడిపోతుంది. స్వల్ప, అల్ప విషయాలకే కోపతాపాలకు, న్యూనతకు లోనవుతారు. ‘అభిమానం సురా (మద్య)పానం కన్నా అధిక మాదకద్రవ్యం. గౌరవ మర్యాదలు రౌరవ నరక ద్వారాలు. కీర్తి ప్రతిష్ఠలు సూకరీ విష్ఠ (వరాహ మలం) వంటివి. కాన, ఈ మూడింటిని విసర్జించడం శ్రేయస్కరం’ అని శాస్త్రం. అవమాన- తిరస్కారాల వలన తపోవృద్ధి! సమ్మాన-పురస్కారాల వలన తపఃక్షయం! ‘సమ్మానం కలయాతి ఘోర గరలం నీ చాపమానం సుధా’- సమ్మానం గరళ సమం, అపమానం అమృత సదృశం- అని విజ్ఞుల, అనుభవజ్ఞుల వచనం.(సశేషం)

క. శ్రీ విలసిత ధరణీ తన
యా వదన సరోజ వాసరాధిప! సిత రా
జీవ దళ నయన! నిఖిల ధ
రావర నుత సుగుణ ధామ! రాఘవ రామా!

సీ.‘చతురాత్మ! దుహితృ వత్సలుడైన దక్షుండు
దన కూతు సతి ననాదరము సేసి
యన యంబు నఖిల చరాచర గురుడు ని
ర్వైరుండు శాంతి విగ్రహుడు ఘనుడు
జగముల కెల్లను జర్చింప దేవుండు
నంచితాత్మారాము డలఘు మూర్తి
శీలవంతులలోన శ్రేష్ఠుండు నగు నట్టి
భవునందు విద్వేష పడుట కేమి’

తే.‘కారణము? సతి దా నేమి కారణమున
విడువ రానట్టి ప్రాణముల్‌ విడిచె? మరియు
శ్వశుర జామాతృ విద్వేష సరణి నాకు
దెలియ నానతి యిమ్ము సుధీ విధేయ!’

మనిషి పుట్టుక ‘లక్ష్యం’ ఏమిటి? సంపాదించడం, తినడం, కష్టాల
పాలవుతూ చివరకు చనిపోవడం. ఇంతకంటే, వెంటనే ‘చనిపోలేమా’? నిజానికి పుట్టుక ప్రయోజనం పునర్జన్మ లేకుండా చేసుకోవడమే! ఒక్క మనిషి తప్ప,
మిగిలిన జంతువులన్నీ అడ్డంగా పెరిగితే, కేవలం మానవుడే నిలువున పెరుగుతాడు. స్వీయరక్షణ కోసం జంతువులన్నిటికీ నిర్దిష్టమైన శారీరకావయవాలను ఇచ్చిన దేవుడు మనిషికి మాత్రం ‘తెలివి’ని ప్రసాదించాడు. భగవంతునితో అనుబంధం పెంచుకోవడం ద్వారా పునర్జన్మ, పాపకర్మలనుంచి మానవులు బయటపడగలరు.

జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి
జయంతి: ఈనెల 20వ తేది, (జీవితకాలం: 1894-1994)

తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మామ అల్లుళ్ల విరోధం

ట్రెండింగ్‌

Advertisement