e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home చింతన ‘వీరబ్రహ్మం వారి ఆరాధన’ సందర్భంగా..కాల జ్ఞానాన్వేషి!

‘వీరబ్రహ్మం వారి ఆరాధన’ సందర్భంగా..కాల జ్ఞానాన్వేషి!

దైవ స్వరూపుడవు నీవేనురా
కోర్కెలతో మనిషివై పోయావురా
కొరగాని కోర్కెలను కట్టిపెట్టిన నీవు
కోదండ రాముడై వెలిసేవురా!

‘వీరబ్రహ్మం వారి ఆరాధన’ సందర్భంగా..కాల జ్ఞానాన్వేషి!

మనిషిలోని శక్తిని వెలికితీసి చూపించిన మహాయోగి, తపస్వి, హేతువాది, సంఘసంస్కర్త, కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. పోతులూరి పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబల గర్భశుక్తి ముక్తాఫలం. పెంచిన తల్లిదండ్రులు వీరభోజయాచార్యులు, వీర పాపమాంబలు. చిన్న వయసునుండే ఆత్మచింతన, మితభాషణాదులు అలవడిన వీరబ్రహ్మేంద్రులు స్వయంగా జ్ఞానసముపార్జన కోసం 8వ ఏట దేశాటనకు తల్లి అనుమతి కోరాడు. పుత్ర మమకారంతో నిరాకరించడంతో తొలుత జ్ఞానామృతాన్ని తల్లికే పంచాడు. పిండోత్పత్తినుండి జీవిపుట్టుక రహస్యాలన్నింటినీ తెలియజేసి, ఆఖరకు ఆమె అనుమతితోనే దేశాటనకు వెళ్లాడు. తల్లికి మొదటగా జ్ఞానబోధ చేసిన జగద్గురువు ఆది శంకరులవారికీ, వీరబ్రహ్మేంద్రులకు ఈ విషయంలో సామ్యం కనిపిస్తుంది.

తల్లికి చేసిన జ్ఞానబోధలో భాగంగా మానవ శరీరాన్ని ప్రకృతికి అనుసంధానం చేసి పంచభూతాలకు, పంచజ్ఞానేంద్రియాలకు ఉన్న సంబంధాన్ని తెలిపాడు. ఆత్మ కేవలం సాక్షి అని, బుద్ధి మాత్రమే జీవుణ్ణి నడిపిస్తుందని, బుద్ధిని కర్మ నడిపిస్తుందని, కర్మను తప్పించడం ఎవరికీ సాధ్యం కాదనీ ప్రకటించాడు. మనసును పరబ్రహ్మపై కేంద్రీకరింపజేసిన జీవునికే ముక్తి లభిస్తుందంటూ, అతిసాధారణమైన మాటల్లో తెలియజేసి తల్లివద్ద సెలవు తీసుకొని వెళ్లాడు. పుణ్యక్షేత్రాల దర్శిస్తూ బనగానపల్లెకు వచ్చి పగలంతా తిరిగి రాత్రికి ఒక ఇంటి అరుగుమీద విశ్రమించాడు. తెల్లవారాక ఆ ఇంటి యజమానురాలు అచ్చమ్మ ఆయన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసింది. ‘ఏదైనా పనికోసం వచ్చానని’ చెప్పడంతో ఆమె ఆయనకు పశువులను కాచే పని అప్పగించింది. పశువులను కాచే నిమిత్తం రవ్వలకొండ చేరిన ఆయన అక్కడ ప్రశాంత వాతావరణం చేత ఆకర్షితుడై అక్కడే ఉన్న ఒక గుహను నివాసయోగ్యం చేసుకొని ‘కాలజ్ఞానం’ రాయడం మొదలుపెట్టాడు. గోవులు ఆయన గీచిన గీత దాటకపోయేవి.

అచ్చమాంబ ఆయనను జ్ఞానిగానే భావించింది. తనకు ఆత్మజ్ఞానం కోసం వేడుకొన్నది. అచ్చమ్మకు జ్ఞానబోధ చేసిన ప్రదేశమే ‘ముచ్చట్ల గుట్ట’. పరమాత్మ అన్ని జీవరాశులలోనూ ఉంటాడని, ఆయనను తెలుసుకోవడానికి భక్తిధ్యాన మార్గాలు శ్రేష్ఠమైనవనీ, ఆయన నిరాకారుడు, నిర్గుణుడు, వర్ణనాతీతుడు అని, ఏకాగ్రతతో ధ్యానించాలని చెప్పాడు. భక్తిమార్గమంటే పరమాత్మను తలచుకుంటూ గడపడమనీ, ధ్యానమార్గంలో యోగ, ప్రాణాయామాల ద్వారా భగవంతుని సాన్నిధ్యం సాధించాలని తెలిపాడు. వీరబ్రహ్మేంద్రులు భవిష్యత్తులో జరుగబోయే ఎన్నో అంశాలను తన దివ్యదృష్టితో గమనించి బోధించిన అంశాలనే ‘కాలజ్ఞాన తత్త్వాలు’ అంటారు. వాటిని తనదైన చక్కని సులభశైలిలో చెప్పారాయన.

భగవంతుని లక్షణాన్ని తెలియజేసేదే తత్త్వం. భగవంతుడంటే అణుస్వరూపం, కాలస్వరూపం. అణుస్వరూపానికి మారినవాడు కాలాతీతుడవుతాడు. అప్పుడతనికి అన్ని కాలాలలోని అంశాలూ పూర్ణంగా విదితమవుతాయి. అలా పరమాత్మ సాన్నిధ్యాన్ని నిరంతరం ఉపాసించిన వీరబ్రహ్మేంద్రులు ఎన్నో కాలజ్ఞాన అంశాలను లోకానికి తెలిపాడు. వీరబ్రహ్మేంద్రుల గొప్పతనాన్ని తెలుసుకొని బనగానపల్లె నవాబు పరీక్షలు పెట్టాడు. మాంసాహారం పుష్పాలుగా మారిపోయేసరికి నమస్కరించి కందిమల్లయ పల్లె ప్రాంతంలో 70 ఎకరాల భూమిని దానం చేస్తూ మఠం నిర్వహణకు వినియోగించాల్సిందిగా కోరాడు. నవాబుకు కూడా కాలజ్ఞానాన్ని బోధించాడు. తర్వాత కొంతకాలం దేశాటన చేస్తూ వేర్వేరు ప్రదేశాల్లో ఎన్నో మహిమలను చూపిస్తూ వచ్చారు.

శివకోటయాచార్యుల కుమార్తెను వివాహం చేసుకొని కొంతకాలం భార్యతో కలిసి జీవిస్తూ, జ్ఞానబోధ చేసి మళ్ళీ దేశాటనకు బయలుదేరారు వీరబ్రహ్మేంద్రులు. దూదేకుల కులానికి చెందిన సైదులును తన శిష్యునిగా చేసుకొని అతనికి అనేక ఉన్నత బోధనలు చేశాడు. జ్ఞానం సిద్ధించిన సైదులుకు ‘సిద్ధయ్య’గా నామకరణం చేసి ‘సిద్ధా’ అనే మకుటంతో కొన్ని పద్యాలను ఆశువుగా చెప్పాడు. తనకు అజ్ఞానంపైన తప్ప ఎవరిమీద కోపం లేదన్నారు వీరబ్రహ్మంగారు. వారి కాలజ్ఞాన భావాలను అర్థం చేసుకుంటే వారి ప్రచార తత్త్వం, ఆత్మజ్ఞాన విధానం మనకు పూర్ణంగా అవగతమవుతాయి.

‘శరీరం, మనసు, ఆత్మ’ అనే మూడూ అందరికీ సమానం. శరీరం జడం, ఆత్మ నిత్య చైతన్యం. ఆత్మ ఏ పనీ చేయదు. అది ద్రష్ట మాత్రమే. శరీరానికి ఏ పనీ చేతకాదు. మధ్యలో ఉండే మనసు మాత్రమే అన్నిటినీ పట్టుకొని కర్మలను పెంచుకుంటూ ఉండే మాయతో కూడుకున్నది. నడిపించే బుద్ధిలో పరమాత్మను కేంద్రీకరిస్తే మనిషి మనీషిగా మారుతాడని, మానవుడు మహనీయుడవుతాడని స్పష్టంగా అతిచిన్న మాటలలో, తేట తెలుగు పదాలలో చెప్పిన తెలుగువారి దేవతా స్వరూపుడు వీరబ్రహ్మేంద్రులు. గురువుగా, దైవంగా, మహిమాన్వితుడుగా ఆయన మాటలు, చేతలలో లోకంలోని అజ్ఞానంపై పోరాటమే ప్రత్యేకంగా కనిపిస్తుంది.

సాగి
కమలాకరశర్మ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘వీరబ్రహ్మం వారి ఆరాధన’ సందర్భంగా..కాల జ్ఞానాన్వేషి!

ట్రెండింగ్‌

Advertisement