e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home చింతన నేడు జగద్గురువులు ఆదిశంకరాచార్యుల జయంతి ధర్మావతారం!

నేడు జగద్గురువులు ఆదిశంకరాచార్యుల జయంతి ధర్మావతారం!

అదిశంకరులు వైదిక మతోద్ధారకులు. దాని పేరే ‘అద్వైత సిద్ధాంతం’. ఆయన ప్రబోధించినటువంటి జ్ఞానమార్గాన్ని సూర్యచంద్రులు ఉన్నంతవరకు ప్రసరింపచేయాలనే ఉద్దేశ్యంతో దేశానికి నాలుగు దిక్కుల నాలుగు పీఠాలను స్థాపించారు. అలాంటి మహోన్నతమైన శ్రీశంకరాచార్యులవారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించడం మహద్భాగ్యం.

నేడు జగద్గురువులు ఆదిశంకరాచార్యుల జయంతి ధర్మావతారం!

ధర్మానికి ‘గ్లాని’ ఏర్పడినప్పుడు ‘శిష్టరక్షణ-దుష్టశిక్షణ’కై భగవంతుడు అవతరిస్తాడని ‘భగవద్గీత’లో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. ‘సంభవామి యుగేయుగే’. ‘ధర్మగ్లాని’ అంటే, జనులకు స్వధర్మాచరణపట్ల శ్రద్ధాభక్తులు లోపించడం. ధర్మాచరణను కించిత్తుకూడా ఆచరించకుండా ఉండటం. అలాగే, వేదశాస్ర్తాలలో చెప్పినటువంటి ధర్మానికి విరుద్ధంగా ధర్మాన్ని ప్రబోధించి జనులను పక్కతోవ పట్టించడం వల్ల ‘అవైదిక ధర్మ ప్రాబల్యం’ పెరగడం. అలాంటి సమయంలో పునఃధర్మప్రతిష్ఠాపన చేయడానికి ‘భగవదవతారం’ జరుగుతుంది. అది త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిగా, ద్వాపరలో శ్రీకృష్ణ పరమాత్మగా అవతారాలు దాల్చి, ఆ యుగాలలో భగవంతుడు రాక్షస సంహారం చేసి జనులను కాపాడాడు. మరి, ఈ కలియుగం వచ్చేసరికి ఇక్కడ రాక్షస సంహారం చేయడం కాదు, జనులలోని ‘రాక్షస ప్రవృత్తి’ని తీసివేయాలి. అంటే, అధర్మమార్గం పట్టినవారి బుద్ధిని ధర్మమార్గం వైపు మళ్లేలా ప్రబోధిస్తూ, జ్ఞానభిక్ష పెట్టాలి. దీనిని నెరవేర్చడానికే సాక్షాత్‌ పరమేశ్వరుడు ఆదిశంకరాచార్యుల రూపంలో అవతరించారు.
దుష్టాచార వినాశాయ ప్రాదుర్భూతో మహీతత స ఏవ శంకరాచార్యః సాక్షాత్‌ కైవల్య నాయకః

దుష్టాచారాలను నశింపజేయడానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆదిశంకరాచార్యులవారి రూపంలో ఈ భూమిమీద అవతరించారు. శంకరులు బాల్యంలోనే అత్యంత ప్రజ్ఞాశాలిగా ఉండేవారు. ఆయన ఐదవ సంవత్సరంలో ఉపనయనం చేసుకొని, అతి తక్కువ సమయంలోనే ఏ మానవ మాత్రునికికూడా సాధ్యం కాని ‘అష్టవర్షే చతుర్వేదీ ద్వాదశే సర్వశాస్త్రవిత్‌’ 8వ సంవత్సరంలో చతుర్వేదాలు, 12 ఏండ్ల వయసులోపు సర్వశాస్ర్తాలను అధ్యయనం చేశారు. వేదాధ్యయన సమయంలో భిక్షాటనకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి యాచించగా, ఆమె ఒక ఉసిరికాయను ఇచ్చింది. ఆమె దారిద్య్ర పరిస్థితిని చూసి చలించిన శంకరులు లక్ష్మీదేవిని స్తుతిస్తూ, ‘కనకధారా స్తోత్రం’ అశువుగా స్తుతించారు. దానికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది. పిమ్మట సన్యాసాశ్రమం కూడా చాలా విచిత్రంగా జరిగింది. సన్యాస స్వీకార వేళ ఆసన్నమవడంతో శంకరులు తల్లిని అనుమతి కోరారు. ‘తాను ఒంటరిని అవుతానన్న’ కారణంతో ఆమె అందుకు నిరాకరించింది.

ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ఆయన కాలు పట్టుకుంది. ‘తనను సన్యసించడానికి అనుమతిస్తే మొసలి వదిలేస్తుందని’ చెప్పారు. ‘ఈ సంసార బంధాలు తనను మొసలివలె పట్టుకున్నాయని, వాటినుంచి తనను తప్పించమని’ కోరారు. దీనిని ‘ఆతుర సన్యాసం’ అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తుండగానే ఆశ్చర్యంగా మొసలి శంకరుల కాలును విడిచి వెళ్లిపోయింది. తరువాత గురువుకోసం అన్వేషిస్తూ నర్మదా నదీతీరంలో ఉన్న శ్రీశ్రీ గోవింద భగవత్పాదులను దర్శించి ఆయననే తన గురువుగా తెలుసుకొని, ‘తనను శిష్యుడిగా స్వీకరించమని’ ప్రార్థించారు. అనేక రకాలుగా పరీక్షించి శిష్యునిగా స్వీకరించారు. ‘షోడశే కృతవాన్‌ భాష్యం’. తరువాత మహోత్కృష్టమైన ‘బ్రహ్మసూత్రాది’ గ్రంథాలకు భాష్యాన్ని రచించారు.

మహామహా పండితులకుకూడా మళ్లీమళ్లీ చదువుకుంటేగాని అర్థం కాని ఎన్నో గ్రంథాలు రచించారు. కనీసం శబ్దజ్ఞానం కూడా లేనటువంటి సామాన్య వ్యక్తికికూడా వేదాంతాది విషయాలను ‘భజగోవిందా’ ఆదిస్తోత్రాలద్వారా జ్ఞానమార్గాన్ని ప్రబోధించారు. ‘భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిపాదించాలన్నా, సమైక్యవాదాన్ని స్థాపించాలన్నా ఆదిశంకరుల సిద్ధాంతం తప్ప మరొకటి లేదు’ అని నిరూపించినవే వారి రచనలు. ‘శిష్య హితాయ ఉద్యతః సతతం’. ఆయన కాలినడకన దేశాద్యంతం పర్యటించి అవైదికమైన బౌద్ధాది 72 మతాలను సప్రమాణంగా ఖండిస్తూ వేదప్రతిపాదితమైన అద్వైత సిద్ధాంతాన్ని పునఃప్రతిష్ఠాపన చేశారు.

వ్యాసోఝుల
గోపీకృష్ణ శర్మ
90000 04474

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నేడు జగద్గురువులు ఆదిశంకరాచార్యుల జయంతి ధర్మావతారం!

ట్రెండింగ్‌

Advertisement