e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home చింతన వాసవీ స్వరూపిణి

వాసవీ స్వరూపిణి

వలచి వచ్చిన సాక్షాత్తు రాజునే తృణప్రాయం చేసి, అగ్నిప్రవేశంతో తనువు చాలించిన అద్భుత యువతి అలౌకిక భక్తిగాథ.

వాసవీ స్వరూపిణి

ఇదొక యథార్థ కథ. అది 10, 11వ శతాబ్దాల కాలం. సుమారు 18 పట్టణ ప్రాంతాల (పరగణాలు) భూభాగాన్ని పెనుగొండ (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ గోదావరి జిల్లా)ను ముఖ్యనగరంగా చేసుకొని ‘కుసుమశ్రేష్ఠి’ అనే వైశ్యుడు పరిపాలించేవాడు. ఆయన కూతురే సాక్షాత్తు జగన్మాత స్వరూపిణి వాసవీ కన్యకా పరమేశ్వరి. రాజమహేంద్రవరం రాజధానిగా వేంగిదేశాన్ని పాలిస్తున్న రాజు విష్ణువర్ధనుడు. అప్పట్లో వైశ్యులు గోరక్షణతో సనాతన ధర్మాన్ని ఆచరించేవారు. వ్యాపారాలలోనూ మానవీయ విలువలు పాటిస్తూ, పవిత్ర భక్తిప్రపత్తులతో జీవించేవారు. కుసుమశ్రేష్ఠి- కౌసుంబీదేవి దంపతులకు సంతానం లేనందున వేదవిహిత ‘పుత్రకామేష్టి’ యాగం చేశారు. ఫలితంగానే వారికి వైశాఖశుద్ధ దశమి శుక్రవారం నాడు ఉత్తరా నక్షత్రం, కన్యారాశిలో ఒక అబ్బాయి, ఓ అమ్మాయి కవలలుగా జన్మించారు. ‘వేదవిహిత కర్మలను ఆచరించడం వల్ల మనం కోరిన దానికన్నా భగవంతుడు అధికఫలాన్నే ఇస్తాడన్న దానికి ఇదే నిదర్శనం.

అబ్బాయికి ‘విరూపాక్షుడు’, అమ్మాయికి ‘వాసవి’ అని పేర్లు పెట్టారు. అమ్మవారు అంశగా, అదీ కన్యారాశిలో జన్మించిన కారణంగా ఆమె ‘వాసవీ కన్యక’ అయ్యింది. యుక్తవయసుకు వచ్చిన విరూపాక్షునకు రత్నావతి అనే కన్యను ఇచ్చి వివాహం జరిపించారు. ఇక, జగన్మాత వాసవీ కన్యక నిరంతరం అలౌకిక భక్తితో వుంటూ అందరికీ ఆశ్చర్యానందాలను కలుగజేయసాగింది. ఈశ్వరారాధనలోనే ఆమె జీవితాన్ని గడుపుతున్నది. ఒకనాడు రాజు విష్ణువర్ధనుడు విజయయాత్రలో భాగంగా పెనుగొండకు వచ్చాడు. కుసుమశ్రేష్ఠి తమ రాజుకు అద్భుతంగా స్వాగత సత్కారాలు చేశాడు. చెలికత్తెలతో కలిసి ‘పరమేశ్వర చింతన’లో ఉన్న ‘వాసవీ కన్యక’ అతని దృష్టిలో పడింది. మోహంతో వశం తప్పిపోయాడు. ‘ఆ అమ్మాయిని తనకిచ్చి వివాహం చేయమని’ కుసుమశ్రేష్ఠిని ఆదేశించాడు.

రాజు వయసులో చాలా పెద్దవాడు, క్షత్రియుడు. అందులో అత్యంత దుర్మార్గుడుకూడా. తన కూతురిని ఇవ్వడం ఇష్టం లేని కుసుమశ్రేష్ఠి, ‘ఆమె నిరంతరం దైవచింతనలోనే ఉంటుందనీ, వివాహం చేయడం కుదరదని’ చెప్పాడు. ‘రాజుగారు మనపై దండెత్తి రాకముందే ఏదో ఒకటి చేయాలి? ఏం చేయాలి?’ అన్నదే వారికి పెద్ద సమస్యయింది. ‘అగ్నిప్రవేశం చేస్తానని, అందుకు ఏర్పాట్లు చేయమని’ చెప్పిన కూతురు కేసి నిశ్చేష్టుడై చూశాడు తండ్రి.

వాసవి సాక్షాత్తు జగన్మాత అంశ. అందులో ఎవరికీ ఏ సందేహమూ లేదు. కానీ, తన బిడ్డ అగ్నిపాలు కావడాన్నే తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. ‘దుర్మార్గుడైన రాజుకిచ్చేకన్నా కన్యగా అలా తనువు చాలించడమే మేలని’ పెద్దలంతా సలహా ఇచ్చారు. ఆ రోజు రానే వచ్చింది. రాజు దండెత్తి వచ్చేలోగానే వాసవి అగ్నిగుండంలోకి దూకింది. ఆమెతోపాటు అనేకమంది ప్రజలు, వైశ్యులూ అగ్నిప్రవేశం చేసినట్లు చరిత్ర చెబుతున్నది. అనంతరం అగ్నిదేవుడు మహోగ్రరూపం దాల్చి విష్ణువర్ధనుడిని భస్మీభూతం చేసినట్లు కథనం. నాటినుంచీ వారంతా ‘వాసవీ కన్యక’ను పరమేశ్వరీ స్వరూపంగానే విశ్వసిస్తూ, ఆరాధిస్తున్నారు. ఆర్యవైశ్యులకు వాసవి ఒక కులదేవతైంది. ఆత్మాభిమానం, అలౌకిక భక్తి ముందు అధికారం గడ్డిపోచతో సమానమని నిరూపించిన ఈ తెలుగు బిడ్డ ఎందరికో నేటికీ పూజ్యురాలు.

శాస్ర్తుల ,వేంకటేశ్వరశర్మ
98499 09165

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వాసవీ స్వరూపిణి

ట్రెండింగ్‌

Advertisement