e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home చింతన అపర శివావతారం!

అపర శివావతారం!

అపర శివావతారం!


ఆదిశంకరుల కాలం నాటికి వివిధ మతాలు వికృతరూపం దాల్చి అస్తవ్యస్థమై వేదబోధిత కర్మకాండకు విపరీత భాష్యాలు చెప్తూ, సమాజాన్ని అయోమయ స్థితికి తెచ్చాయి. దాంతో విలువలు తగ్గిపోవడం వల్ల సామాజిక క్రాంతిని నింపాల్సిన ఆవశ్యకతను గుర్తెరిగిన మహానుభావుడు ఆది శంకరులు! అవి సృష్టించిన అల్లకల్లోలాలను ఖండిస్తూ, సిద్ధాంతాలన్నిటినీ సమన్వయపరుస్తూ ‘అద్వైతమతాన్ని’ స్థాపించి, ఉపనిషత్తుల అంతరంగాన్ని ఆవిష్కరించారు. అందుకే, వారు భువికి దిగివచ్చిన ‘జ్ఞానామృత గంగాస్వరూపం’. చైతన్యజ్ఞానానికి, యోగశాస్ర్తానికి, భక్తి కర్మజ్ఞాన ధ్యానధారలకు ఆలవాలమైన భారతీయ సమాజం అసంఘటితమై, వేదబాహ్య కర్మలకు దగ్గరైన వేళ అన్నిటినీ సమన్వయపరచిన శంకరుల ప్రతిభ అసామాన్యం.

శంకరులు చిన్ననాటి నుంచే అసాధారణ ప్రతిభను కనబరచి సన్యసించి దేశాటన చేశారు. వారిలో చైతన్య ప్రభను వెలిగింపజేసిన గురువు గోవింద భగవత్పాదాచార్యులు. ఆయన ఆదేశానుసారం మొదటగా విష్ణు సహస్ర నామాలకు శంకరులు భాష్యం రాశారు. శివజటాజూటం నుంచి ప్రవహించిన గంగాప్రవాహం వలె సాగిన ‘శివానందలహరి’ని, ఆదిశక్తి స్వరూప స్వభావాలను ప్రత్యక్షం చేసేలా ‘సౌందర్యలహరి’ని ప్రకటించారు. వారు వెలువరించిన ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు జిజ్ఞాసువుల పిపాసను తీర్చాయి. పద్మపాదులు, హస్తామలకులు, తోటకాచార్యులు వంటివారంతా ఆయనకు శిష్యులుగా చేరి అద్వైతాన్ని విస్తరింపజేయడంలో విశేష కృషి సలిపారు. ‘అద్వైతం’ అంటే రెండవది లేనిది. ఉన్నది ఒక్కటే, అదే బ్రహ్మం! ‘కనిపించే ప్రపంచమంతా బ్రహ్మమునకు భిన్నం కాదు. సత్‌ చిత్‌ ఆనందం, అనంతం, ప్రజ్ఞాన ఘనమునైన ఆ బ్రహ్మమును ‘నేనే’ అంటే జీవుడు!’ అన్నది దీనిలోని సారం. అంతా ఏకత్వమని చెప్పినా సాధారణ జనాలకు అనుమానం కలుగుతుంది. ప్రపంచం సుఖదుఃఖాలతో నానావిధాలుగా కనబడుతున్నది. ‘దుఃఖితుడైన జీవి’ సచ్చిదానందమూర్తియైన బ్రహ్మంతో సమానమని చెప్పడం ఎలా పొసగుతుంది?’ అనే అనుమానానికి సమాధానంగా, ‘ఈ బ్రహ్మాన్ని ఆశ్రయించి ఆవరించిన మాయాశక్తి ఉండటం వల్లే వివిధాలుగా కనిపించినా అంతా ఒక్కటే’ అని సూత్రీకరించారు. దీన్నే ‘అభాస’ అన్నారు. నామరూపాత్మకమైన ఈ జగత్తు అంతాకూడా ‘మిథ్య’ అన్నారు శంకరులు. దీన్నే ‘బ్రహ్మ సత్యం జగన్మిథ్య. దీన్నే‘అద్వైత సిద్ధాంతం’గా వారు ఆవిష్కరించారు. అనేక మతాలను ఖండిస్తూ, ‘బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత’ (ప్రస్థాన త్రయం)లకు అద్వైతపరంగా వ్యాఖ్యానాలు రాశారు. ఉన్నదానికి భిన్నంగా మరొకటి ఉంటే భయం ఉంటుంది (ద్వితీయాద్వై భయం భవతి). భయం ఉంటే నిరతిశయానందాన్ని పొందడం కుదరదు. కాబట్టి, అద్వైతం తప్ప మరొక దానితో మోక్షం లభించదనివారు ఘంటాపథంగా చెప్పారు.

‘అభయం ప్రతిష్ఠాం విందతే’, ‘ఏ తస్మిన్నుదరమంతరం కురుతే’, ‘అధతస్య భయంభవతి’ అంటున్నది తైత్తిరీయానంద వల్లి. అంటే, శాశ్వతమైన సుఖదుఃఖాలు వేరుగా ఉంటే దుఃఖం ఉన్నచోట అదే శాశ్వతమవుతుంది. కాబట్టి, నిత్యానందకరమైన మోక్షాన్ని పొందడం అసంభవం. ఎందుకంటే, రెండు సత్యపదార్థాలు ఉండటానికి వీల్లేదు. కనిపించే ఈ సుఖదుఃఖాలన్నీ ఏమిటన్న ప్రశ్నకు ‘అన్నీ మిథ్య’ అని శంకరులు తేల్చారు. ముక్కు, చెవులు, నోరు లాంటి వివిధ అవయవాలు ప్రత్యేకంగా గుర్తించబడినా అన్నీ కలిసి శరీరం అనే సమష్టిలో ఎలా భాగంగా పరిగణించబడతాయో, అలాగే నామరూప భేదాలు ఎన్నున్నా అన్నీ ఆ పరబ్రహ్మ తత్త్వాన్ని ఆశ్రయించి, సమష్టి చైతన్యానికి ప్రతీకలుగానే ఉంటాయి’ అన్నది అద్వైతం. దీన్ని సాధించేందుకు ‘సాధనా పంచకాన్ని’ (అనుష్ఠాన, అధ్యయన, అభ్యాస, ఆధ్యాత్మ, అనుభూతులు) పేర్కొన్నారు. ఇలా తాను జీవించిన కొద్దికాలంలోనే అజ్ఞానంతో చీలిపోయిన సమాజాన్ని సన్మార్గంలో ప్రయాణింపజేసిన అపర శివావతారం ఆది శంకరాచార్యులు. వారి ఆధ్యాత్మిక జ్ఞాన సాహిత్యం ముముక్షువులకు దారి చూపడం వల్ల విశేషమైన ప్రజాదరణ పొందింది.

పాలకుర్తి రామమూర్తి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అపర శివావతారం!

ట్రెండింగ్‌

Advertisement