e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home చింతన ఆత్మ చేతనతోనే విపత్తు ఆటకట్టు!

ఆత్మ చేతనతోనే విపత్తు ఆటకట్టు!

ఆత్మ చేతనతోనే విపత్తు ఆటకట్టు!


ఒకనాడు శ్రీరామకృష్ణ పరమహంస తన అనుంగు శిష్యుడైన రామచంద్ర దత్త ఇంటికి వెళ్లారు. ‘భాగవత’ శ్రవణం అయ్యాక భక్తులు అడిగిన ప్రశ్నలకు రామకృష్ణులు సమాధానాలతోపాటు ఒక కథ చెప్పారు. ‘ఒకసారి ముగ్గురు స్నేహితులు కలిసి ఒక అడవిలోంచి వెళ్తున్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్దపులి ఎదురొచ్చింది. దాన్ని చూసి వారిలోని ఒకతను, ‘మిత్రులారా! మనకు కాలం తీరిపోయింది. మనమిక బతకం’ అన్నాడు భయంగా. వెంటనే రెండవ వ్యక్తి, ‘ఏం పర్వాలేదు, ఏమీ కాదు. వెంటనే మనమంతా భగవంతుణ్ణి ప్రార్థిద్దాం’ అన్నాడు. ఇంతలో మూడవవాడు అందుకొని, ‘మిత్రులారా! భగవంతుని పేరుతో సమయం వృథా చేయడమెందుకు? ఆయన మనలోనూ ఉన్నాడు కదా! అది కూృరజంతువు. ఆలస్యం చేయకుండా ముందు ఈ చెట్టు ఎక్కేసి, మన ప్రాణాలు రక్షించుకుందాం!’ అన్నాడు. ముగ్గురూ తక్షణం చెట్టు ఎక్కేశారు. ‘మన కాలం తీరిపోయింది’ అని గగ్గోలు పెట్టిన మొదటి వ్యక్తికి ‘భగవంతుడనే వాడున్నాడు, అతను మనల్ని రక్షిస్తాడు’ అన్నదే తెలియదు. ‘భగవంతుణ్ని ప్రార్థిద్దాం’ అన్న రెండవ వ్యక్తికి ‘భగవంతుడు ఉన్నాడని, తానే ఈ ప్రపంచాన్ని, మనల్ని సృష్టించి పోషిస్తాడని’ తెలుసు. కనుకే, అతనిపైనే భారం వేసి ప్రార్థనలు చేద్దామన్నాడు. మూడవ వ్యక్తికి భగవంతుని గురించిన ‘సంపూర్ణ జ్ఞానం’ ఉంది. ‘భగవంతుడు సర్వవ్యాపి’ అన్న ప్రగాఢమైన నమ్మకమూ ఉంది. భగవంతునికి, జీవికి అభేదాన్నీ అవగాహన పరచుకున్నాడు. తాము నేర్చుకున్న జ్ఞానానికి సరైన అర్థాన్ని అతను ఆచరణలోకి తెచ్చుకున్నాడు. ఫలితంగానే ‘మానవ ప్రయత్నాని’కి ఉపక్రమించి తనతోపాటు తోటి మిత్రుల ప్రాణాలనూ రక్షించగలిగాడు.

ఆ మూడవ వ్యక్తి ‘అహం బ్రహ్మాస్మి’, ‘తత్త్వమసి’ మూలార్థాలను ఔపోసన పట్టాడు. ఒకవేళ గుడ్డిగా ‘తాము నిరాయుధ మానవులమని, పులి కూృరజంతువని నమ్మితే’ పరిస్థితి వేరుగా ఉండేది. లోకంలోని ప్రతి జీవి ఆ అనంతశక్తి నుంచే తయారైనప్పటికీ పదార్థాన్ని బట్టి లక్షణాలు వస్తాయి. ఆయా లక్షణాలకు అనుగుణంగానే అవి ప్రవర్తిస్తాయన్న దాన్ని గుర్తెరగాలి. సమస్య ఎదురైనప్పుడు మనోనిబ్బరాన్ని అమాంతం పెంచుకోవాలి. ఇదే ‘అహం బ్రహ్మాస్మి’ పరమార్థం. ప్రస్తుత ఆపత్కాలంలో ప్రతి ఒక్కరూ ఈ స్ఫూర్తితో మెలగాలి. ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా పరిపూర్ణ ఆత్మవిశ్వాసం తప్పనిసరి. అప్పుడే జీవన పోరాటంలో పట్టుదలతో శ్రమించి, గెలువగలం. ప్రతి వ్యక్తి ‘ఈ సమస్య నాది, దీన్ని గెలిచే సత్తా నాలోనూ ఉంది’ అని మనసును స్థిరపరచుకోవడం ద్వారానే ఎంతటి విపత్కరాన్నయినా ఎదుర్కోగలిగే సత్తువను సమకూర్చుకోగలడు. ‘నాకు భగవంతుని తోడ్పాటు ఉంది’ అని అనుకున్నప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం కన్నా ‘నేనే బ్రహ్మను’ అన్న దృఢచిత్తానికి వచ్చినప్పుడు ఒనగూడే మనోశక్తి మరెన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే, దీనికంతటికీ పునాది ఆత్మజ్ఞానం. అర్జునుడు పొందగలిగిన స్థితప్రజ్ఞతను ప్రస్తుత పరిస్థితుల్లో మనమూ గుర్తుచేసుకోవాలి. ఆత్మజ్ఞాన సారాన్ని బోధించడం ద్వారానే శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అతనిని గొప్పవిజేతగా నిలబెట్టాడన్నది ఇక్కడ ప్రధానం.

ఈ గొప్ప సత్యాన్ని అందరం గ్రహించి ‘కరోనా విపత్కర’ పరిస్థితుల నుంచి గట్టెక్కుదాం. ఏ హృదయంలోనైతే తన మీద తనకు అపనమ్మకం, భయబాధలకు చోటుంటుందో, ఆ గుండె బలహీనమయ్యే ప్రమాదం ఉంటుంది. ఎవరి హృదయమైతే ఆత్మవిశ్వాసం, ధైర్యైస్థెర్యాలతో నిండిపోతుందో వారు ఎంతటి ప్రతికూల శక్తినైనా ఎదిరించి నిలుస్తారు. ఇదే ఏ ఘన విజయానికైనా తొలిమెట్టు అవుతుంది. ఈ క్లిష్ట పరిస్థితిలో ‘రోగ నిరోధక శక్తి’ని ఇనుమడింపజేసుకోవడానికి అర్జునుని వలె మనమంతా ‘ఆత్మజ్ఞాన’ చైతన్యాన్ని సమకూర్చుకుందాం.

రావుల నిరంజనాచారి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆత్మ చేతనతోనే విపత్తు ఆటకట్టు!

ట్రెండింగ్‌

Advertisement