e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home చింతన భక్తి ఒక్కటే ప్రధానం!

భక్తి ఒక్కటే ప్రధానం!


అకామః సర్వకామోవా మోక్షకామ ఉదారధీః
తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరమ్‌
-శ్రీమద్భాగవతమ్‌

భక్తి ఒక్కటే ప్రధానం!


‘బుద్ధిమంతుడైన వాడు.. కోరికలు లేనివాడైనా, అన్ని కోరికలు కలవాడైనా లేదా మోక్షాన్ని కోరుకొనేవాడైనా తీవ్రమైన భక్తియోగంతో పరమ పురుషుని (పరమాత్మ) ఆరాధించాలి’ అన్నది ‘భాగవత పురాణం’. గత యుగాల (కృత, త్రేత, ద్వాపర)లో మోక్షానికి జ్ఞాన, వైరాగ్యాలు సాధనాలుగా చెప్పబడినా, కలియుగంలో మాత్రం ‘కేవల భక్తియే’ మోక్షానికి ప్రధానమని చెప్పబడింది. ‘మోక్షసాధన సామగ్య్రాం భక్తిరేవ గరీయసి’, ‘సాతు అస్మిన్‌ పరమ ప్రేమరూపా’. మోక్షసాధనా సామగ్రులలో భక్తియే శ్రేష్ఠమైంది. ‘పరమాత్మపైగల పరమ ప్రేమయే భక్తి’ అన్నాయి ‘నారద భక్తి సూత్రాలు’. ‘ఈ జగత్తు అంతా భగవంతుని అధీనంలో ఉంది. జీవుడు భగవంతునిచేత ఆడించబడే ఒక ఆటబొమ్మ. భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి అతని లీలలు, గుణాలు, కథలను వింటూ, కీర్తిస్తూ, పరమాత్మ కోసమే కర్మలు చేస్తూ, సాధువులు, సత్పురుషులను సేవిస్తూ, పరమాత్మపట్లనే అనురాగాన్ని కలిగి ఉండటమే భక్తి’.

భౌతిక సుఖాలతోపాటు అనేక వికారాలను పొందే ఈ శరీరం, సంపదలు అన్నీ ఎప్పటికైనా నశించిపోయేవే. ఒక్క పరమాత్మ మాత్రమే శాశ్వతం. ‘పరమాత్మ కూడా తానే’ అన్న సత్యాన్ని తెలుసుకొనే గొప్ప అవకాశం మానవజన్మలోనే సాధ్యం. దీన్ని గ్రహించి, ప్రతి ఒక్కరూ పరమాత్మ పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. తన క్షేమం (మోక్షం) కోసం శరీరం నశించేలోపే ప్రయత్నించాలి. అందుకోసమే భగవంతుడిని ఆశ్రయించాలి. పరమాత్మను చేరడానికి భక్తి ఒక్కటే సులభ సాధనం. లభించిన సంపదలు భగవంతుని అనుగ్రహంగా భావించి వాటిని లోకోపకారానికి వినియోగించాలి. పరమాత్మపైనే భక్తి విశ్వాసాలను ఎల్లవేళలా కలిగి ఉండాలి. సంకల్పాలు లేకుండటం వల్ల కోరికలను, కోరికలను వదిలిపెట్టడం ద్వారా కోపాన్ని, ‘ధనమే అన్ని అనర్థాలకు కారణమని’ తెలుసుకోవడం వల్ల లోభాన్ని, ఆత్మ- అనాత్మ విచారంతో శోకమోహాలను, దయను కలిగి ఉండటం వల్ల దుఃఖాన్ని, సాత్విక ఆహారంతో నిద్రను, తత్త విచారంతో భయాన్ని, ప్రాణాయామాదులతో శరీర దుఃఖాలను జయించాలి. సత్సాంగత్యంతో జ్ఞానాన్ని పొంది, వైరాగ్యాన్ని అలవర్చుకోవాలి. దీన్ని ‘భాగవత ధర్మం’ ప్రబోధిస్తున్నది.

విషయ వాసనల పట్ల ఆసక్తిగలవారు వాటిలోనే చిక్కుపడతారు. పరమాత్మపట్లనే లగ్నమైన మనస్సు గలవారు ఆయననే చేరుకుంటారు. ఇలా అన్నిటిపట్లా ‘ఏకాత్మ భావన’ను కలిగి ఉండటమే జ్ఞానం. విషయ సుఖాలను త్యజించడమే వైరాగ్యం. భగవంతుని పట్ల భక్తిని కలిగించేదే ధర్మం. ‘మరొక భావన లేకుండా ఎప్పుడూ నాపైనే చిత్తం నిలిపి, నన్నే స్మరించేవారికి నేను సులభంగా లభిస్తాను. అలాంటివారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను’ అని ‘భగవద్గీత’లో పరమాత్మనే స్వయంగా ప్రకటించాడు. ఇంతటి అనన్య భక్తి భావనయే మనలను పరమాత్మ అనుగ్రహం పొందేలా చేస్తుంది. ప్రహ్లాదుడు, ధృవుడు, అంబరీషుడు వంటి మహా భక్తులెందరో మనకు ఆదర్శం. మనలోనే కాదు, సర్వజీవులలోనూ భగవంతుడినే దర్శిస్తూ, సమస్త జీవులను భగవంతునిలోనే చూడగలవారే నిజమైన భక్తులు. ‘అహంకార మమకారాలు, రాగద్వేషాలు లేనివారు, ప్రేమ, కరుణ, సమభావం వంటి సద్గుణాలు, పరమాత్మపట్ల దృఢ నిశ్చయం గలవారే ఆయనకు అత్యంత ప్రీతిపాత్రులవుతారు’ అని ‘భగవద్గీత’ ఉద్ఘాటించింది. ‘అగ్నిలో కరిగే బంగారం మాలిన్యాలన్నిటినీ తొలగించుకొని తన నిజ స్వరూపాన్ని పొందినట్లు’ జీవుడు కూడా పరమాత్మపట్ల అనన్య భక్తితో కర్మ వాసనలను తొలగించుకోవడం ద్వారా పరమాత్మను చేరగలడు. అందువల్ల అనన్య భక్తియే సర్వశ్రేయస్కరం.

దోర్బల కుమారస్వామి
94400 49608

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భక్తి ఒక్కటే ప్రధానం!

ట్రెండింగ్‌

Advertisement