e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home చింతన ‘కలుపు మొక్కలు’ తొలగించుకోవాలి!

‘కలుపు మొక్కలు’ తొలగించుకోవాలి!

పలికెడిది భాగవత మట
పలికించెడివాడు రామభద్రుం డట నే
బలికిన భవహర మగునట
పలికెద వేఱొండు గాథ బలుకగ నేలా!

  • శ్రీమద్భాగవతం (ప్రథమస్కంధం: 16)
‘కలుపు మొక్కలు’ తొలగించుకోవాలి!

పోతన భాగవతంలోని ఈ పద్యం అంతరార్థం ఆలోచింపదగ్గది. ‘వేఱొండు గాథ’ (వేరే కథ) దీనికి ఆయువు పట్టు. పోతన చెప్పబోతున్నది భాగవతం. దీనిని 3వ పాదంలోనే చెప్పాడు. ‘భవహరం’ అంటే, సంసార బంధాలు తొలగించి ముక్తినిచ్చే కథ. ‘వేఱొండు గాథ’ ఆ బంధాలను మరింత బిగింపజేసి జన్మ పరంపరలలోకి తోసివేసేది. అది కాలక్షేపానికే కానీ, మన జన్మను తరింపజేసుకోడానికి కాదు. కాలస్వరూపుడు భగవంతుడు కాబట్టి, ఆయన కథ (భాగవతం)వల్ల కాలం సద్వినియోగమవుతుంది. కాలుని (యముని) భయాన్నీ దూరం చేస్తుంది. పరీక్షిత్తు మరణ భయాన్ని పోగొట్టింది కథే. అన్ని భయాల కంటే ‘మరణ భయం’ గొప్పది. ఆ కథ వింటే ఇది తొలగి మనిషి దివ్యమైన శాంతితో తేజరిల్లుతాడు. అంతగొప్ప భాగవత కథను పోతన చెప్పబూనుకున్నాడు. ఆయన ఉద్దేశమెంతో మహోన్నతం. వేరే కథలిటువంటివి కావు. అయితే, అందరిలాగే పోతన తన బుద్ధికి తోచినట్టల్లా చెప్పలేదు. అట్లయితే, అందరు కవుల లాంటివాడే అయ్యేవాడు.

‘నేను పలుకుతున్నా’ అని అనలేదు. ‘పలికెడిది భాగవతము..’ అన్నాడు. ఎంత వినయం! తన పైత్యమేమీ లేదు. ‘పలికించెడివాడు రామభద్రుం డట’ అన్నాడు తడుముకోకుండా. అదీ అసలైన ప్రమాణం. ఉపాధ్యాయుడు చెబుతుంటే పిల్లలంతా గొంతెత్తి పలుకుతుంటారు. ఎవరికి తోచిందివారు పలికితే గోలగోలగా ఉంటుంది. వేదం నేర్పే గురువు ఉదాత్త, అనుదాత్త స్వరాలతో పదే పదే ఉచ్చరిస్తూ సరిగ్గా వచ్చేంతవరకు విద్యార్థులతో పలికిస్తాడు. ఇక, రాముడంటే ఆత్మారాముడు. ఆత్మలో నివాసం ఉండే, ఆత్మస్వరూపుడైన రాముడు. ఆ పేరు ఆయన కొక్కనికే చెల్లింది. అట్లాంటి రాముడే స్వయంగా పోతనచేత పలికిస్తున్నాడు. అదీ ఈ మహాకవి ప్రత్యేకత, విశిష్టత, పరమ ప్రామాణికత. పలికేది భాగవతం, పలికించేది రాముడు. మరి, తాను! సాక్షిమాత్రునిగా ఉండేస్థితికి వచ్చాడు. అంటే, చేసే స్థితినుంచి చూచేస్థితి! దివ్యకవుల లక్షణమే అది.

ఈ దశకు వస్తే ఏమవుతుంది? ‘భవహర’మవుతుంది. ఇక ‘వేఱొండు గాథ’ ప్రసక్తే ఉండదు. అమృతం రుచి మరిగిన వారికి తేనీటి విందెందుకు? మానవుని మనసు సహజంగానే ఎప్పుడూ ‘వేఱొండు గాథ’ల (రకరకాల చరిత్రలున్న లోకాభిరామాయణం) మీదకే పోతుంటుంది. అది నీటిలాగ ప్రవాహగుణం గలది. ‘మనస్సుకిది సహజమే’ అని చూస్తూ ఊరుకోకూడదు. దానిని క్రమంగా లాలించి, బుజ్జగించి ‘ఈ లోకాభిరామాయణం మంచిది కాదు. భగవన్మహిమ వైపు ప్రయాణించు’ అని దారి మళ్లించాలి. అలా నేర్పాలంటే మనిషిలో అసహజమైన కొన్ని గుణాలున్నాయి. వాటిని తొలగించాలి. పొలంలో మంచిమొక్కలు ఎదగాలంటే ‘కలుపు మొక్కలు’ తొలగించాల్సిందే. అవి ఏవి? అంటే, మనకు తెలియకుండానే మనలో పెరిగే అహంకార మమకారాలు, అన్నిటికన్నా మించిన కర్తృత్వ భావన. అంటే ‘నేను చేస్తున్నాను’ అనే భావన. వీటిని తొలగించుకోగలిగితే ‘భగవద్రతి’ అలవాటవుతుంది. ఇక వారికి లోకాభిరామాయణం ఎంతమాత్రం రుచించదు. నీరు ఎగువకు ప్రవహించాలంటే కొంత శ్రమించక తప్పదు.

లోకాభిరామాయణం పోతనకు రుచించదు. ఆయనకు భగవన్మహిమను ప్రకటించే గాథలే ఇష్టం. వాటిని కాకుండా ‘వేరే గాథలు చెప్పడం ఎందుకు?’ అని స్థిరంగా ఎలా అనగలిగాడు? అంటే, అతని మనసులో ‘కలుపు మొక్కలు’ అంతరించాయి. కర్తృత్వభావన అన్నదే లేదు. దృఢంగా ‘పలికించెడివాడు రామభద్రుం డట’ అన్నాడు. మనమూ భగవద్భక్తి పట్ల అంత దృఢ విశ్వాసానికి వచ్చినప్పుడే ‘భవహరం’ సాధ్యమవుతుంది. ఈ సంసార సాగరం నుంచొ గట్టెక్కి, తరించిపోయే మార్గం అప్పుడు పోతనలాగా మనకూ చాలా తేలికవుతుంది.

డా॥ వెలుదండ
సత్యనారాయణ
94411 62863

Advertisement
‘కలుపు మొక్కలు’ తొలగించుకోవాలి!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement