e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home చింతన ఆత్యంతిక భక్తియోగం

ఆత్యంతిక భక్తియోగం

మైత్రేయ మహర్షి మహాత్ముడైన విదురునికి ఎదురులేని ‘కపిల-దేవహూతి’ సాంఖ్యశాస్త్ర, సంవాదాన్ని కుదురుగా వినిపిస్తున్నాడు. శుద్ధ ఆత్మతత్త విజ్ఞానమే సాంఖ్యమంటే. కపిలుడు కృతయుగంలోనే కాలక్రమంలో కనుమరుగైన ఆత్మధర్మాన్ని- ఆధ్యాత్మిక యోగాన్ని ఉద్ధరించి,ఉజ్జీవింపజేయడానికి ఆవిర్భవించిన జ్ఞానావతారం.

చ.‘అనుపమ పాపకర్మ పరిహారముకై భజనీయుడైన శో
భన చరితుం డితం డనుచు భావమునం దలపోసి భక్తి చే
ననితర యోగ్యతన్‌ భగవ దర్పణ బుద్ధి నొనర్చి కర్మముల్‌
జనహిత కారియై నెగడ సాత్తిక యోగ మనంగ జొప్పడున్‌.’

చ‘మనుసుత! మద్గుణ శ్రవణ మాత్ర లభించిన యట్టి భక్తి చే
ననఘుడ సర్వశోభన గుణాశ్రయుడం బరమేశ్వరుండనై
తనరిన నన్ను జెందిన యుదాత్త మనోగతు లవ్యయంబులై
వననిధి గామి యైన సురవాహిని బోలె ఫలించు నిమ్ములన్‌.’

ఆత్యంతిక భక్తియోగం

ఈనాడు ధార్మికులైన ప్రజల జీవనంలో కర్మ, ఉపాసనలదే పైచేయిగా కన్పిస్తోంది. కర్మ, ఉపాసనలు రెండిటికీ అంతిమ ఫలమైన ఆత్మవిచారణ- అంతర్ముఖత్వం పట్ల ఆసక్తి- అభిరుచి, ఆదరణ నానాటికి తీసికట్టుగా ఉంది. ఈ ప్రవృత్తి- ధోరణి, సమష్టిగా సనాతన ధర్మానికి, వ్యష్టిగా సాధక ధర్మానికి- మోక్షప్రాప్తికి, ఎనలేని చేటు వాటిల్ల చేసే గొడ్డలి వేటు! జ్ఞాన హీనమైన కర్మ కర్తని బంధిస్తుంది. ‘జ్ఞాత్వా కర్మాణి కుర్వీత’- జ్ఞానపూర్వక కర్మాచరణాన్నే శాస్త్రం ప్రోత్సహిస్తుంది. వృక్షంలో ఫలం ఏర్పడటానికి పుష్పమే కారణం. కాని, ఆ ఫలం పుట్టి పుష్పాన్ని నశింపజేస్తుంది. అలాగే, కర్మలు జ్ఞానోత్పత్తికి కారణమైనప్పటికీ, కర్మలవల్ల కలిగిన ఆ జ్ఞానమే కర్మలను నశింపజేస్తుంది- ‘సర్వం కర్మాఖిలం పార్థజ్ఞానే పరిసమాప్యతే’- కర్మలన్నీ జ్ఞానమునందే విలయమై- లయించిపోతాయి అని గీతాఘోష. జ్ఞాన విహీనమైన ఉపాసన కూడా రాజసంగా పరిణమించి బంధించే ప్రమాదం పొంచి ఉన్నదన్నారు స్వామి తత్త విదానంద. ఇట్టి విపరీత, విషమ పరిస్థితిని సంస్కరించి, పరిష్కరించి ‘జ్ఞానపూర్వక భక్తి’కి పట్టం కట్టడానికి ఉద్భవించి, ఉద్యమించిన అవతారమే కపిలుడు.

పుత్త్ర రూపంలో ఉన్న పురుషోత్తముడు తన జనయిత్రి అయిన మనుపుత్త్రి దేవహూతికి ఇలా ప్రవచించాడు- మాతా! సత్కులజాతా! యోగలక్షణ సమేతా! జీవుల విభిన్న స్వభావాలను, సంకల్పాలనుబట్టి ఆశలు, ఆశయాలను అనుసరించి భక్తియోగం బహు భంగులు (విధాలు)గా భాసిస్తోంది. త్రిగుణాలనుబట్టి భక్తి తామసం, రాజసం, సాత్తికమని మూడు విధాలు. దీనికే ‘గౌణీభక్తి’ అని పేరు. పగవారనే వగ, శెగలతో పరులను పలు రకాలుగా హింసిస్తూ ఆడంబరం, అసూయ, అజ్ఞానం, రోషం, ద్వేషంతో కూడిన భేదబుద్ధితో భజించువాడు తామసభక్తుడు. ఐష్టెశ్వర్యాల కొరకో, అధిక పేరు ప్రతిష్ఠలను కోరో లక్షలు వెచ్చించి అట్టహాస పూర్వక పూజాద్రవ్యాలతో అక్షరుడనైన నన్ను అర్చించుట రాజసభక్తి.

సౌజన్యఖనీ! జననీ! పూర్వజన్మలలో చేసిన పాపాలను భంజించేది- నశింపజేసేది భగవద్భక్తే- అనే దృఢ విశ్వాసంతో జనహితకరమైన విహిత (శాస్త్రీయ) కర్మలనుకూడా పరమేశ్వర అర్పణంగా ఆచరించుట సాత్తికభక్తి. ఇదంతా ‘సగుణ’భక్తే. తల్లీ! ఈ ఎల్లవిధాల భక్తులలో నిర్గుణభక్తి నిరుపమానం, నిరపాయం. ఇక్కడ ‘నిర్గుణం’ అంటే, సత్తరజస్తమో గుణ రహితమని అర్థం. ‘గుణేభ్యో నిష్క్రాన్తః నిర్గుణో భక్తియోగః’- ఈ భక్తియోగం గుణాతీతమైనదని పరమార్థం. కాని, ఆశ్చర్యమేమంటే భగవంతుని కళ్యాణ గుణగణ వైభవ శ్రవణం వల్లనే ఇట్టి భక్తి కలుగుతుంది. ఇందు కర్మకాండ ప్రసక్తి కించిత్తుకూడా కానరాదు. సమాధితోకాని, ఆసన, ఉపాసనలతోకాని, అర్చన ఆరాధన నిబంధనలతోకాని నిమిత్తం లేదు.

మూలంలోని ‘మద్గుణ శ్రుతి మాత్రేణ’ అన్న శ్లోకానికి భక్త కవి సుధీమణి బమ్మెరవారి విధేయమైన, భక్తసాధక లోకపాథేయ- దారి బత్తెమైన సుశ్లోక చంపకమాలా వృత్తమిది. దేవదేవుని దివ్య, భవ్య, గుణ శ్రవణ మాత్రం చేతనే మనోగతి- మనస్సు యొక్క ప్రవృత్తి భగవదభిముఖంగా, అవిచ్ఛిన్నంగా ప్రవహించడం, పరుగులు పెట్టడం ఆరంభిస్తుంది. ఎట్టి భగవంతునికి అభిముఖంగా? అంటే, బాహ్యంలో ఉన్న ప్రతీక అనగా ప్రతిమా, విగ్రహరూప భగవంతునివైపు కాదట! ‘మయి సర్వ గుహాశయే’- తన హృదయపద్మంలోనే కొలువై ఉన్న పరమాత్మవైపు. నిజమైన, నిశ్చలమైన ప్రేమాభక్తి ఉదయించగానే అది హృదయంలో ధారావాహికంగా పడుతూ భగవచ్చరణార విందాలను అభిషేకిస్తూ ఉంటుంది. ఎలా? చిత్తం ద్రవించి, సంసారాసక్తి సన్నగిలుతూ, శిథిలం కాగా గంగా ప్రవాహపు ప్రతి తరంగం సాగరాముఖంగా సాగి పోవునట్లు, అంతరంగమనే భక్తి భాగీరథి యొక్క ప్రతి భావ భంగం (తరంగం) భగవానుని విషయీకరించాలి. ఇదీ గుణాతీత భక్తి. ఇందులో రెండు విశేషాలు- అహైతుకీ, అవ్యవహితా. అహైతుకీ అంటే, రెండర్థాలు- ఎవరో ఎప్పుడో ప్రవచించగా, ప్రోత్సహించగా, ప్రేరేపించగా భక్తి సలుపుట కాదు. ఏదో ఒక ఫలం- ప్రయోజనం కోరికూడా కాదు. అహైతుకం అనగా, హేతురహితం- కారణ విరహితం. అనగా ఫలాకాంక్ష లేని నిష్కామభక్తి. అదికూడా ‘అవ్యవహితా’- వ్యవధాన రహితం. అనగా తైలధారవలె ఎడ తెగకుండా ధారావాహికంగా ఉండాలి. స్మరణం యొక్క అవిచ్ఛిన్నత్వమే నిర్గుణభక్తి. ఇట్టి భక్తి అత్యంత దుర్లభం. ‘ప్రకాశతే క్వాపి పాత్రే’- ఏ ఒకానొక మహాభక్తునిలోనో వ్యక్తమవుతుంది.

జననీ! కోరికలు కోరకుండా నన్ను మాత్రమే కాంక్షించే నా ఏకాంతభక్తులకు ఇట్టి భక్తియోగం వలన అన్ని ఫలాలు అప్రయత్నంగానే అనూనంగా (సమగ్రంగా) అందుతాయి. అయినా నా భక్తులు నా నిత్య, నిరంతర సేవాభాగ్యం తప్ప సేవాఫల (పెన్షన్‌) రూపంగా సాలోక్య (నా లోకంలో ఉండుట), సామీప్య (నా సన్నిధిలో ఉండుట), సారూప్య (నావంటి రూపంతో రాజిల్లుట), సార్షి (నాతో సమాన ఐశ్వర్యం కలిగి ఉండుట), సాయుజ్య (నాతో ఏకత్వాన్ని పొందుట) అనే ముక్తులను ఇస్తానన్నా ఇచ్చిగించరు, పుచ్చుకోరు. కోర్కెలు తీర్చేవే అయినా నా ఆరాధనకు అవరోధా (ఆటంకా)లైన ఏ సాధనలు సాగించరు. దీనికే ‘ఆత్యంతిక భక్తియోగం’ అని పేరు.
(సశేషం)

‘నేనెవరిని?’ అన్న ప్రశ్నకు మనకు సమాధానం దొరుకుతుంది.
ఉదా॥కు ఒక చెట్టును చూడండి. ఒకే విత్తునుంచి భారీవృక్షం ఎదుగుతుంది. మళ్లీ దానినుండి అసంఖ్యాకమైన విత్తనాలు వస్తాయి. వాటిలోనూ ప్రతీ ఒక్కటీ ఒక్కో చెట్టుగా ఎదగ గలుగుతుంది. ఏ రెండు ఫలాలూ ఒక్కలా వుండవు. అయినప్పటికీ, చెట్టులోని ప్రతీ కణంలోనూ ఒకే జీవం తొణికిస లాడుతూ ఉంటుంది. ఇదే విధంగా, ఆత్మకూడా మన శరీరంలోని అణువణువులోనూ కొలువై ఉంటుంది.
మాతా ఆనందమయి (నిర్మల సుందరి)
జయంతి: ఏప్రిల్‌ 30
(జీవితకాలం: 1896-1982)

తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006

Advertisement
ఆత్యంతిక భక్తియోగం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement