e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home చింతన సాతికులే శ్రేష్ఠులు!

సాతికులే శ్రేష్ఠులు!

సాతికులే శ్రేష్ఠులు!

మనం సాధారణంగా ‘ఇష్టకాలమని, కష్టకాలమని’ కాలాన్ని రెండు విధాలుగా లెక్కిస్తాం. కానీ, ఇవి యోగులకు వర్తించవు. నిజానికి కాలానికి ఇష్టానిష్టాలుండవు. మనిషి రాగద్వేషాలకు లోనై వాటిని కాలానికి, వస్తువులకు అనువర్తింపజేస్తాడు. ఒక వస్తువు ఒకరికి సుఖకారణమైతే, మరొకరికి దుఃఖదాయకం కావచ్చు. కనుక, మంచిచెడ్డలు వస్తువుల్లో లేవు. మన మనసుల్లో ఉంటాయి. సృష్టి అంతా ఒక్కటే. మన దృష్టియే వేరు. ‘సత్తగుణ’ సంపన్నులు ఇతరులను తమలాగానే చూస్తారు. వీరిది ‘సాత్తిక దృష్టి’. ‘రజోగుణ’ స్వభావులు స్వార్థచిత్తులై, తమనూ ఇతరులనూ వేర్వేరుగా చూస్తారు. ఇది ‘రాజస దృష్టి’. ‘తమోగుణం’ కల్గినవారు తమ లాభం కోసం ఇతరులకు నష్టం కలిగించాలనుకుంటారు. దీన్ని ‘తామస దృష్టి’ అంటారు. ఈ ముగ్గురిలో ‘సాత్తికులే’ శ్రేష్ఠులు. వారు ఇతరులను తమలాగా చూడటమంటే, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటారు. పరమాత్మలోగల సర్వజీవులను తమలాగే చూసేవారు యోగులు. వారికి ‘కష్ట-ఇష్ట కాలాలు’ ఉండవు. వారు సుఖాలకు పొంగిపోరు. దుఃఖాలకు క్రుంగిపోరు. ‘అసలు వారికి దుఃఖమే ఉండదని’ సాక్షాత్తు వేదమే చెప్తున్నది.
‘యస్మిన్‌ సర్వాణి భూతాని ఆత్మైవాభూత్‌ విజానతః
తత్రకో మోహః కఃశోకః? ఏకత్వ మనుపశ్యతః

  • యజుర్వేదం (40-7)

కర్మఫలాలు ద్వివిధాలు. ఒకటి దుఃఖదాయకం, మరొకటి సుఖదాయకం. ఇవి మన చేతిలో ఉండవు. అనుభవింపదగిన వాళ్లం మనమే అయినా ఇచ్చేవాడు పరమాత్మ. ఆయనలోనే మనమంతా ఉండి పనులు చేస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరికీ సుఖదుఃఖాలుంటాయి. ఎవరూ అతీతులు కారు. ఇది తెలిసినవారు తోటిప్రాణులు కష్టపడుతుంటే చూస్తూ ఊరుకోరు. వారి కష్టాల్లో పాలుపంచుకుంటారు. వారు సుఖపడే వేళ తాము ఇబ్బందిపడరు. వారూ తమలాంటి వారే కనుక, ‘తామే సుఖపడుతున్నట్లు’ భావిస్తారు. అన్ని ప్రాణులను తమతో సమానంగా చూడటమంటే ఇదే. సహానుభూతిని మించిన సంస్కృతి లేదు. తాము ఇతరుల వంటివారమూ, ఇతరులూ తమవంటివారే అన్న భావన మనిషికి విధిగా ఉండదగిన సుగుణం. దీన్ని అలవర్చుకున్నవారే యోగులు.

- Advertisement -

పరమేశ్వరుని కృపకు పాత్రులు కావాలనుకునేవారు ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి. ఇష్టానిష్టాలను లెక్కచేయకూడదు. సుఖదుఃఖాలను పట్టించుకోరాదు. లాభనష్టాలను చూడరాదు. ఆత్మీయతను అలవర్చుకోవాలి. ఏ కాలమైనా చెప్పి కష్టాలు రావు. అలాగే, సుఖాలు కూడా. నిజానికి కాలం జడం. దానికి తెలివి లేదు. తెలివున్నది మనకే. మనమే కాలానుగుణంగా నడవాలి. కష్టం వచ్చినప్పుడు క్రుంగిపోకుండా ఉండటమే కాదు, తమలాంటి ఇతరులకూ ధైర్యం చెప్పాలి. ఎల్లకాలం ఒకేతీరుగా ఉండదు. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం దినరాత్రాల్లాగా వస్తూనే ఉంటాయి. అందుకే, మనం కాలజ్ఞులం కావాలి. కష్టాలను, సుఖాలను సమానంగా చూసే దృష్టిని అలవర్చుకోవాలి. మనం పరమాత్మలో ఉన్నామన్న విషయం విస్మరించరాదు. పరమాత్మ సర్వసాక్షి కనుక అందరి బాగోగులూ చూస్తాడు. అతని మీద పూర్ణవిశ్వాసం ఉంచి, మన జీవితాన్ని సక్రమ పద్ధతిలో కొనసాగించాలి. అంతేకానీ, కష్టంలో ఉన్నవారిని పట్టించుకోకుండా ఉండటం, సుఖంగా ఉన్నవాళ్లను చూసి అసహనానికి గురవడం మానవత్వం కాదు.

సృష్టిలో పశుపక్ష్యాదులు, క్రిమికీటకాదుల్లో సహజీవనం కనిపిస్తుంది. ‘బతుకు, బతికించు’ అనే సిద్ధాంతాన్ని అవి పాటిస్తాయి. మనిషి సంఘజీవి కనుక, తప్పకుండా ‘అందరూ తమ వంటివారే’ అన్న సమదృష్టిని అలవర్చుకోవాలి. ఎటువంటి కష్టకాలమైనా సామూహికంగా ఎదుర్కొనడానికి సిద్ధం కావాలి. అటువంటి వారికే ‘కః మోహః? కః శోకం? మోహం ఉండదు, శోకం ఉండదని’ వేదం గట్టిగా చెప్తున్నది.

ఆచార్య మసన చెన్నప్ప 98856 54381

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సాతికులే శ్రేష్ఠులు!
సాతికులే శ్రేష్ఠులు!
సాతికులే శ్రేష్ఠులు!

ట్రెండింగ్‌

Advertisement