e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home చింతన అభయానికి ఆరు మెట్లు!

అభయానికి ఆరు మెట్లు!

తగు నిది తగదని యెదలో
వగవక సాధులకు బేదవారల కెగ్గుల్‌
మొగి జేయు దుర్వినీతుల
కగు ననిమిత్తాగమంబు లయిన భయంబుల్‌.

నన్నయ (మహాభారతం: 1-1-85)

- Advertisement -

‘మహాభారతం’లోని ఒకానొక ‘సూక్తి రత్నం’ ఇది. జనమేజయ మహారాజు దీర్ఘ సర్పయాగం చేస్తుంటే ఒక సారమేయం (దేవశునీ= దేవతల కుక్క) వచ్చి, అటు ఇటూ తచ్చాడుతుండగా, పర్యవేక్షిస్తున్న రాజసోదరులు తరిమికొట్టారు. అది వెళ్లి చెప్పగా తల్లి కుక్క (సరమ) వచ్చి, ‘మహారాజా! అవివేకులైన నీ తమ్ముళ్లు నిరపరాధి అయిన నా కొడుకును తరిమికొట్టారు. మంచీ చెడ్డా చూడకుండా సాధువులకూ, పేదలకూ హాని కలిగించే దుర్వినీతులకు నిష్కారణంగా భయాలే కలుగుతాయి’ అని హెచ్చరించింది. ఇది ఒక కుక్క చెప్పిన నీతి.
ఇందులో కొన్ని పరిశీలనాంశాలు ఉన్నాయి. మానవుడు లోకానికి ఏది పంచితే అదే తిరిగి అతని వద్దకు వస్తుంది. భయాన్ని పంచితే భయమే అతణ్ణి వరిస్తుంది. ప్రేమను పంచితే ప్రేమే అనంతకాలంలో వరిస్తుంది. దుర్మార్గులు భయాన్ని పంచిపెడతారు. ‘అందరూ తమకు భయపడాలని కదా’ వారి కోరిక. అందువల్ల, వారికీ ఎప్పుడో ఒకప్పుడు భయమే తిరిగి వచ్చేస్తుంది. అప్పుడు వారిని దేవుడూ రక్షించడు. రక్షిస్తే ధర్మానికి గ్లాని కలుగుతుంది. సన్మార్గులు ఎవరినీ భయపెట్టరు. వారిది ప్రేమభావన కనుక. వారికి లోకం తిరిగి ప్రేమనే అందిస్తుంది. దుర్మార్గులు వాళ్లను అప్పుడప్పుడు భయపెడుతూ ఉంటారు. కానీ, సజ్జనులు శరణాగతి ద్వారా భగవంతుని నుంచి అభయాన్ని, రక్షణను పొందగలుగుతారు. వారిని రక్షిస్తే ధర్మం జయిస్తుంది కదా. ధర్మం జయించడం కోసం దేవతలు సజ్జనులకు అభయం ఇయ్యవలసి ఉంది. అభయం భగవంతుని నుంచి సుజనులకే అయినా ఆషామాషీగా లభించేదేమీ కాదు. అదొక సాటిలేని రక్షణ. విభీషణునిలా ‘తిట్లూ, కొట్లూ’ భరించాలి. భగవద్విశ్వాసాన్ని అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎంత కాపాడుకోగలిగితే, అంత శీఘ్రంగా భగవంతుని నుంచి అభయం, రక్షణ పొందగలుగుతాడు సాధకుడు. దీనికి అతడు కొన్ని సోపానాలు అధిరోహించవలసి ఉన్నది. సంసార జీవితమంతా సుఖమయంగా గడచిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం సహజమే. కానీ, ప్రతివాడూ ఆశాభంగం పొంది తీరుతూనే ఉంటాడు. అయినా, పెండ్లి చేసుకొని ప్రతి ఒక్కరూ సంసారంలోకి ప్రవేశిస్తూనే ఉంటారు. సంస్కారవంతుడు, జిజ్ఞాసువు, దీక్షాపరుడూ అయిన వ్యక్తి ఆగకుండా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగిపోగలుగుతాడు. అతడు మాత్రం అంతర్మథనంలో అంచెలంచెలుగా ఈ కింది ఆరు ధర్మసూక్ష్మాలను గ్రహిస్తాడు.

మొట్టమొదటి దశ: ‘నేను సుఖంగా లేను’. కొన్నాళ్లకు రెండవ దశ: ‘నేను సుఖమనే భ్రాంతిలో ఉన్నాను’. మరి కొన్నాళ్లకు మూడవ దశ: ‘లోకులంతా నాలాగే సుఖభ్రాంతిలో ఉన్నారు’. ఇంకొన్నాళ్లకు నాల్గవ దశ: ‘దీనికంతకూ మాయయే కారణం’. మరికొన్నాళ్లకు ఐదవ దశ: ‘ఈ మాయకు చిక్కకుండా ఉండాలి’. మరి ఇంకొన్నాళ్లకు ఆరవ దశ: ‘మాయకు చిక్కరాదంటే భగవంతుని శరణు వేడటం మినహా మరే మార్గమూ లేదు’. ఈ ఆరు సోపానాలు అధిరోహించిన తర్వాతే ఆధ్యాత్మిక మార్గం బాగా సుగమమవుతుంది. సాధకుడు శరణు వేడటం, భగవంతుడు అభయం ఇయ్యడం, సాధకుడు భక్తుడై రక్షింపబడటం వెంటవెంటనే సంభవిస్తాయి. నేడు మనిషిగా పుట్టిన ప్రతి మనిషీ ‘మానవుడు’ కాడు. తాను ‘మనిషి’ అన్నది గుర్తుంచుకొని, మనిషనేవాడు ఎలా ప్రవర్తించాలో గ్రహించి ఆ ఉత్తమ ‘మానవ గుణాన్ని’ అలవరచుకొన్నవాడే నిజమైన మానవుడు. ముందుగా సృష్టిలో ఈ మార్పు జరుగాల్సి ఉన్నది. అప్పుడు మానవుడు, అహాన్ని తొక్కిపెట్టి దైవీగుణాలను పొదివి పట్టుకొని, అనంత శక్తియుక్తుడైన భగవంతుని రక్షణలోకి చేరుకోగలుగుతాడు. ఇదే మన అంతిమ లక్ష్యం!

-డాక్టర్‌ వెలుదండ సత్యనారాయణ
94411 62863

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana