ప్రతి వ్యక్తి లోపలా ‘సృష్టికర్త బీజం’ ఉంటుంది. అది పెరగడానికి మూడు సూత్రాలు ఉంటాయి. కొన్నాళ్ల కిందట ఒక సత్సంగంలో నన్ను ఎవరో ఒకరు ఇలా అడిగారు, ‘నేనెందరో ఆధ్యాత్మిక గురువుల్ని చూశాను. కానీ, మీలా నన్నెవరూ ఆకర్షించలేదు. ఏముంది మీలో?’. దానికి నేను, ‘మీలో లేనిది, నాలో ప్రత్యేకంగా ఏమీ లేదు. అనంతమైన సంభావ్యత ఉన్న ఒక బీజాన్ని మనందరికీ భగవంతుడు ఇచ్చాడు. మీరు చాలా మంచివాళ్లు, జాగ్రత్తపరులు. ఆ బీజాన్ని భద్రంగా దాచుకున్నారు. నేను ఆ బీజాన్ని ఓ చెట్టుగా మలచుకున్నాను. అంతే.’ చెట్టుగా మారాక, విత్తనం విత్తనంలా ఉండదు. విత్తనాన్ని విత్తనంగానే ఉంచడం మూర్ఖత్వం. మనందరం ఒకే విత్తనంతో వచ్చాం. అంటే, ప్రతి విత్తనానికీ ఒకే విధమైన సంభావ్యత ఉంది. కాకపోతే, అది చెట్టుగా మారడానికి ఒక ‘ప్రయాణం’ కావాలి. విత్తనం చెట్టుగా తయ్యారవ్వాలనుకుంటే మీరు దాన్ని పోషిస్తూ, రక్షించాలి. కలుపుమొక్కలనూ తొలగించాలి.
లక్షలాది ఏండ్లుగా ఈ కలుపు మొక్కలే మానవజాతిని తెగ ఇబ్బంది పెడుతున్నాయి. వాటినెలా తొలగించుకోవాలో తెలిస్తే పని తేలికవుతుంది. ఆ పిచ్చి ‘కలుపు మొక్కలే’ క్రోధం, అసహ్యం, అసూయ, భయం, సందేహం వంటివి. ఒక పవిత్ర బీజం మొలకెత్తి, వృద్ధి చెందాలంటే విధిగా కలుపు తీయాల్సిందే. దాంతోపాటు నీళ్లు పట్టాలి, ఎరువు వేయాలి. తగినంతగా సూర్యకిరణాలు తగిలే ఏర్పాటుచేయాలి. ‘ఎండ వేడిమికి కంది పోతామేమో’ అని సూర్యకిరణాలను తప్పించుకోవాలనుకుంటే, జీవితానికి ఆధారభూతమైన ‘వెచ్చదనాన్ని’ కూడా కోల్పోతారు. ప్రాణానికి ఏది ఆధారమో ఒక్కోసారి అది లేకపోవడం ప్రాణాంతకమే అవుతుంది. ఆధ్యాత్మిక ప్రక్రియ కూడా ఇంతే. మీరు ఈ ప్రక్రియకు అనుకూలంగా ఉంటే ఇది పని చేసేటట్లు చేయడం చాలా తేలిక. కానీ, ఈ సాధారణ ప్రక్రియకు మీరు అడ్డుపడుతూ, సంఘర్షిస్తూ ఉంటే మాత్రం అది చాలా కష్టం.
అమెరికాలో ‘ఈశా ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్నర్ సైన్సెస్’ (ఐఐఐ) ఉంది. ఈ మూడు ‘ఐ’లు మూడు విషయాల్ని సూచిస్తాయి. ‘ఇన్స్ట్రక్షన్’: బోధన, ‘ఇంటెగ్రిటి’: సమగ్రత, ‘ఇంటెన్సిటీ అఫ్ పర్పస్’: ప్రయోజన గాఢత. ‘బోధన’ను కచ్చితంగా పాటించాలి. బోధిస్తున్న ఆధ్యాత్మిక ప్రక్రియలన్నిటినీ ‘సమగ్రం’గా ఐక్యతతో చూడాలి. ఈ క్రమంలో మీకు మీరు ప్రత్యేకమైనవారిగా అనుకుంటే మాత్రం ప్రమాదం. దీనివల్ల మీలో ‘కలుపుకొనే లేదా కలిసిపోయే లక్షణం’ లేకుండా పోతుంది. అందరూ వదలుతున్న గాలినే మీరూ పీల్చుకుంటున్నారు కదా. మరి, ‘ఇది నాకిష్టం లేదు. ఈ భూగోళం మీద మరో ప్రాణి పీల్చుకున్న గాలిని నేను పీల్చను’ అంటే ఎలా? ఇలాగైతే జీవితం అక్కడితో ముగుస్తుంది. ఈ భూమ్మీద జీవించాలనుకుంటే అన్నిటితో ‘సమగ్రభావం’ ఉండాలి. నిజానికి భౌతికంగా మీరు అన్నిటితోనూ ఎల్లప్పుడూ సమగ్రంగానే ఉంటారు. కేవలం, మానసికంగా మాత్రమే మీకు మీరు ‘ప్రత్యేకమైన వ్యక్తి’ అనుకుంటున్నారు. ఇదే ‘సమగ్రత లేకపోవడం’ అంటే. తర్వాతిదే ‘ప్రయోజన గాఢత’.
ఈ ప్రక్రియంతా మిమ్మల్ని పెద్ద, గొప్ప మనిషిగా చేయడానికి కాదు. మిమ్మల్ని శూన్యంలో కరిగిపోయేట్టు చేయడానికి! ‘మీరు కోరుతున్నది హద్దులు లేని అనంతత్వమే తప్ప, పెద్దరికం కాదు’ అని తెలుసుకోండి. ‘పెద్ద’ అన్నంత మాత్రాన హద్దులు చెరిగిపోవు. మీరు శూన్యమైనప్పుడు మాత్రమే హద్దులు లేని వారవుతారు. దీన్ని మీరు గొప్పవారు కావడానికి వినియోగించుకోవద్దు. భగవంతుని సృష్టిలో లయమవడానికి ఒక ప్రక్రియగా మాత్రమే దీన్ని ఉపయోగించండి, అంతే. పై మూడు ‘ఐ’లు ఆధ్యాత్మిక ప్రక్రియను అద్భుతంగా పనిచేయిస్తాయి.
-సద్గురు జగ్గీ వాసుదేవ్