e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 29, 2021
Home ఎడిట్‌ పేజీ సకల ప్రదాయిని.. సిద్ధిదాయినీ..

సకల ప్రదాయిని.. సిద్ధిదాయినీ..

సిద్ధగంధర్వ యక్షాద్యైః అసురైరమరైరపి
సేవ్యమానా సదా భూయాత్‌ సిద్ధ్ధిదా సిద్ధిదాయినీ॥

‘శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనం’ అని సాక్షాత్తూ దుర్గాదేవి పేర్కొన్నది. కలియుగంలో తనను పూజించిన వారికి అన్నిరకాల కోరికలను తీరుస్తానని తెలియజేసింది. అందుకే ‘కలౌ చండీ వినాయకౌ’అని కలియుగంలో దుర్గాదేవి, వినాయకుల ఆరాధన శీఘ్ర ఫలదాయకమని చెప్తారు. దుర్గా శబ్దంలో దుర్గ, ఆ అని రెండు పదాలున్నాయి. దుర్గా పదానికి బ్రహ్మవైవర్త పురాణంలో..
‘దుర్గోదైత్యే మహావిఘ్నే భవబంధే చ కర్మణి
శోకే దుఃఖే చ నరకే యమదండే చ జన్మని॥
మహాభయేతి రోగే చాప్యాశబ్దో
హంతృవాచకః ఏతాన్‌
హంత్యేవ యా దేవీ సా దుర్గా ప్రతిపాదితా॥’

అని పేర్కొన్నారు. దుర్గ అంటే రాక్షసుడు, అన్నిటా భయంకరమైన విఘ్నం, సంసార బంధం, శోకం, దుఃఖం, పాప సంపాదితమైన నరకం, మహాభయం, రోగం. ‘ఆ’ అంటే వీటన్నింటినీ నశింపజేసేది దుర్గాదేవి. మనిషి సమస్త బాధలనూ తొలగించే తల్లి ఆమె.

మహిషాసురాది రాక్షసుల బాధలను భరించలేని దేవతలు ఆ జగన్మాతను ప్రార్థిస్తారు. అప్పుడా పరమేశ్వరి శైలపుత్రి, బ్రహ్మచారిణీ, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయనీ, కాళరాత్రి, మహాగౌరీ, సిద్ధిదాత్రి ఇలా తొమ్మిది రూపాల్లో నవదుర్గలుగా అవతరించి అసుర సంహారం చేసింది. శైలపుత్రి మొదలుకొని సిద్ధదాత్రిగా పేర్కొన్న నవదుర్గలు వేర్వేరు కాదు. దుర్గాదేవి అవతార విశేషాలే ఈ తొమ్మిది రూపాలు. శైలపుత్రి నుంచి మహాగౌరి వరకు పేర్కొన్న 8 రూపాలతో దుర్గాదేవిని ఆరాధించి, లౌకికమైన, ఐహికమైన సమస్త సుఖాలను పొంది, చివరగా పరమపురుషార్థ స్వరూపమైన మోక్షాన్ని ప్రసాదించే సిద్ధిదాత్రిని తొమ్మిదో రోజున పూజిస్తారు. ఎవరైతే ఈ తల్లిని ఆరాధిస్తారో వారు అణిమ, మహిమ, గరిమ మొదలైన అష్టసిద్ధులు పొందుతారని మార్కండేయ పురాణం చెప్తున్నది. అలాగే, సిద్ధిదాయిని అనుగ్రహం పొందినవారికి అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య మొదలైన పద్దెనిమిది సిద్ధులూ కరతలామలకం అవుతాయని బ్రహ్మవైవర్త పురాణం చెప్తున్నది. పరమేశ్వరుడు సైతం ఈ సిద్ధిదాత్రి అనుగ్రహంతో సర్వ సిద్ధులను పొందాడట. అమ్మవారి ఆరాధన వల్ల వచ్చే ఫలితాలు అణిమాది సిద్ధులుగా, శాశ్వతమైన బ్రహ్మానందంగా సాధకుడికి సార్థకత చేకూరుస్తాయి. అందుకే సాధారణ మనుషులు, సిద్ధులు, గంధర్వులు, యక్షులు, దేవతలు చివరికి రాక్షసులు కూడా సిద్ధిదాత్రి అమ్మవారిని ఆరాధించారని పురాణాల ద్వారా తెలుస్తున్నది.

- Advertisement -

‘ఆరాధ్యా పరమాశక్తిః సర్వైరపి సురాసురైః, నాతః పరతరం కించిత్‌ అధికం భువనత్రయే’ అని పేర్కొంది దేవీ భాగవతం. జగన్మాతను మించిన దైవం లేదు. నిష్ఠతో తొమ్మిది రోజుల పాటు అమ్మను కొలిచిన వారికి సిద్ధిదాత్రి ఆరాధనతో పరిపూర్ణమైన ఆనందం చేకూరుతుంది. సిద్ధిదాత్రి చతుర్భుజాలతో, పద్మంలో ఆసీనురాలై ఉంటుంది. రెండు కుడిచేతుల్లో చక్రం, గద, రెండు ఎడమ చేతుల్లో శంఖం, పద్మం ధరించి కరుణామృత ధారలను కురిపిస్తుంటుంది. ఈమె వాహనం సింహం. సకల అభీష్టాలనూ నెరవేర్చే దేవత ఈ తల్లి. సాక్షాత్తూ శివుడికే సర్వసిద్ధులను ప్రసాదించిన పరాశక్తి. ఆమెను కొలిచినవారికి ఇహంలో సుఖాలను ఇస్తూనే జ్ఞానాన్నీ, మోక్షాన్నీ అనుగ్రహిస్తుంది.

శాస్ర్తుల వేంకటేశ్వరశర్మ
98499 09165

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement