e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home ఎడిట్‌ పేజీ కాళరాత్రి దేవీ నమోస్తుతే!

కాళరాత్రి దేవీ నమోస్తుతే!

కరాళ వదనాం గౌరీం ముక్తకేశీ చతుర్భుజామ్‌
కాళరాత్రిం కరాళికాం దివ్యాం విద్యుత్‌ మాలావిభూషితామ్‌॥

ఇది కాళరాత్రి అమ్మవారి ధ్యానశ్లోకం. సంస్కృతంలో ‘ళ’ అనే అక్షరం లేనందున ఆమెను కాలరాత్రిగా పిలుస్తారు. రాత్రి కాలానికి అధికారిణిగా నిలిచిన అమ్మవారు కాలరాత్రి. ఈమెను మృత్యుదేవతగానూ భావిస్తారు.
దేవీ నవరాత్రుల్లో అమ్మవారి తొమ్మిది రూపాలను పూజించడం ఉన్నా.. ప్రాంతీయ భేదాన్ని అనుసరించి అమ్మవారి పేర్లు, అలంకరణల్లో వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. కాగా, మూలా నక్షత్రం ఉన్న రోజు మహా సరస్వతి, అష్టమి నాడు మహాదుర్గ, మహర్నవమి నాడు మహిషాసుర మర్దని అలంకారాలు స్థిరంగా ఉంటాయి. విజయదశమి నాడు అమ్మవారిని శ్రీరాజరాజేశ్వరిగా కొలుస్తారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అన్నవి దుర్గాదేవి ధరించిన తొమ్మిది అవతారాల పేర్లు. ఉమ్మడిగా ఈ అవతారాలను ‘నవ దుర్గలు’ అని పిలుస్తారు. వీటిలో ఏడోది కాళరాత్రి.
కాళి, కాళరాత్రి వేర్వేరు అవతారాలు అని కొందరి భావన. కాళి, కాళిక, కాళరాత్రి అన్నీ ఒకే అవతారానికి చెందిన పేర్లని భావించేవాళ్లూ ఉన్నారు. కాశీ క్షేత్రంలోని కాళి వీధిలో ఉన్న ‘కాళర్రాతి’ ఆలయం అత్యంత ప్రశస్తమైనది. దశమహా విద్యల్లో ‘ధూమ్ర’.. నవదుర్గల్లోని ‘కాళరాత్రి’ ఒకరేనని సాధకులు నమ్ముతారు. కాళరాత్రి ఆరాధనలో వామాచార ప్రాధాన్యం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచానికి వాటిల్లిన ఉపద్రవం నుంచి మానవాళిని ఉద్ధరించడానికి అవతరించిన దేవిగా కాళరాత్రిని భావిస్తారు. నల్లనిరంగులో అభయహస్తంతో గార్దభ (గాడిద) వాహనంపై లోకభీకర రూపంలో ఉంటుంది కాళరాత్రి. ఆమె వాహనం కూడా కాలమేఘంలా దర్శనమిస్తుంది.
ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ
వామపాదోల్ల సల్లోహలతా కంటక భూషణా
వర్ధనమూర్ధజా కృష్ణా కాళరాత్రి ర్భయంకరీ॥

గాఢాంధకారంతో సమానంగా ప్రకాశించే నల్లని దేహం, విరబోసుకున్న ఒత్తయిన నల్లని జుత్తు, ప్రకాశవంతమైన మూడు కన్నులు, విద్యుత్కాంతితో సమానంగా ప్రకాశించే కంఠహారంతో కాళరాత్రి అమ్మవారు దర్శనమిస్తుంది. ఉచ్ఛాస నిశ్వాసల కారణంగా అమ్మ ముక్కుపుటాల నుంచి అగ్నిజ్వాలలు రేగుతుంటాయి. కాళరాత్రి చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. పై ఎడమ చేతిలో వడి తిరిగిన ఖడ్గాన్ని, కింది ఎడమ చేతిలో కంటకాల వంటి కత్తులతో కూడిన మరొక ఆయుధాన్ని ధరించి శత్రు భయంకరిగా నిలిచిన అమ్మవారు, తన కుడి చేతులతో అభయ, వరద ముద్రలను ప్రదర్శిస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా సాక్షాత్కరిస్తుంది. గార్దభ వాహనంపై కుడికాలును ముడుచుకొని, ఎడమకాలును జారవిడిచి భక్తులపై అనురాగంతో నిండిన చూపులను ప్రసరింపజేస్తూ ఉంటుంది కాళరాత్రి.
గ్రహచారంలో శని బాగాలేని వారు, గాలి సోకినవారు, మానసిక వ్యాధిగ్రస్థులు కాళరాత్రి అమ్మవారిని ఆరాధిస్తే తక్షణ ఫలితం కనిపిస్తుంది. భూతప్రేత పిశాచాలు అమ్మవారి పేరు వింటే చాలు పారిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. కాళరాత్రిని సహస్రార చక్రాన్ని పాలించే దేవతగా, మోక్ష ప్రదాయనిగా పేర్కొంటారు. అరిభయంకరి అయిన కాళరాత్రి భక్తులకు శుభంకరి. నలుపురంగులో శోభిల్లే ఈ కాళరాత్రి అవతారాన్ని ఆరాధిస్తే చెడు తొలిగి సకల శుభాలూ వర్షిస్తాయి. ధర్మ పరిరక్షణ కోసం భయంకర రూపంలో దుష్టశిక్షణ చేస్తుంది.

వరిగొండ కాంతారావు
94418 86824

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement