e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home చింతన దేవుని కోసం తపిద్దాం!

దేవుని కోసం తపిద్దాం!

దేవుని కోసం తపిద్దాం!

అప్నా తో కోయీ నహీ హమ్‌ కాహూ కే నాహి
పార్‌ పహూంచీ నావ్‌ జబ్‌ మిలీ సబ్‌ బిచుడే జాహి.

పరమయోగి కబీర్‌ దాస్‌

మానవ లోకంలో మన సంబంధాలన్నీ యధార్థంగా అశాశ్వతాలే. ఎవరి కర్మను అనుసరించి వారు ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒకచోట పుడుతూనే ఉంటారు. కర్మ తీరగానే ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో చోట కన్ను మూస్తుంటారు. వీళ్లంతా మనకెంతో ఆప్తులని భావించి మనం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటాం. విలపించినా, విలపించకపోయినా ‘పోయినవారు’ మళ్లా తిరిగిరారు. అలాంటప్పుడు ఆ ఏడుపులతో ఏం ప్రయోజనం?
ఇదం కాష్ట మిదం కాష్టం నద్యాం వహతి సంగతః
సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదనా.

-సూక్తిరత్నం

‘ప్రవహిస్తున్న నదిలో కర్రముక్కలు తేలుతూ ఒకప్పుడు కలుస్తూ, మరొకప్పుడు విడిపోతూ ఉంటాయి. అలాగే, మానవ జీవితాల్లోనూ సంయోగ వియోగాలు సంభవిస్తాయి. ఆ మాత్రం దానికి దుఃఖించడం ఎందుకు?’ అన్నది దీని భావం. వీటి అంతస్తత్వాన్ని అవగాహన చేసుకున్నవారు, ‘మనుషులు కావాలి’ అని కాకుండా ‘దేవుడు కావాలని’ ఏడుస్తారు. ఇప్పటికే మనకెన్నో జన్మలు గడిచాయి. జన్మజన్మకూ ఎవరెవరో తల్లిదండ్రులు, భార్యాపుత్రులు, అన్నదమ్ములూ, బంధుమిత్రులూ మారిపోతూనే ఉన్నారు. కరుణామయుడైన దేవుడు మాత్రం మనం గమనించినా, గమనించకున్నా ప్రతి జన్మలోను మనకు అండగా ఉంటున్నాడు. ఇదీ అసలు సత్యం.

ప్రతి జన్మలోను తోడుగా ఉంటున్న దేవుని వైపు మనం దృష్టిసారించడమే లేదు. అతనికి సన్నిహితులం కావాలన్న తపన మనకు లేనే లేదు. ఈ జన్మలోనే కాదు, గడిచిన ప్రతి జన్మలోను బంధుమిత్రాదులను పోగొట్టుకొని ఇలాగే విలపించాం. దీనికి అంతెక్కడ? ఇంతకన్నా పనికిమాలిన, వ్యర్థమైన, అజ్ఞానంతో కూడిన పని మరొకటున్నదా? తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయినవాళ్లు తిరిగి రావాలని భోరున ఏడుస్తాం. కానీ, ‘ఈ ఏడుపులన్నిటికీ ఒకసారి ఫుల్‌స్టాప్‌ పెట్టేద్దాం’ అనే ఆలోచన మనకెక్కడిది? ఇది రానంత వరకు జన్మజన్మలకూ ఈ ఏడుపులు తప్పనే తప్పవు. ఏదేమైనా మనుషుల కోసం ఏడ్చే ఏడ్పులు, బంధాలు ఇంకా బిగుసుకుంటున్న దానికి సంకేతాలైతే, దేవుని కోసం విలాపం, బంధాలు విడిపోతున్న దానికి నిదర్శనం కదా.

‘దేవుడొక్కడే కావాలని’ ఏడిస్తే ఒకనాటికి కాకున్నా ఒకనాటికి, ఒక జన్మలో కాకున్నా మరొక జన్మలోనైనా భగవదనుగ్రహానికి నోచుకుంటాం. ఇక, అప్పుడు ఆయన ‘ఆనంద స్వరూపుడు’ కాబట్టి, మనమూ ఆనంద స్వరూపులుగానే మారిపోతాం. అప్పుడిక ఏ ఏడుపూ ఉండదు. అటువంటి ‘అమృతత్వం’ కోసం ప్రయత్నించడం యొక్క ఆవశ్యకత అజ్ఞానవశాత్తు మనకు తెలిసిరావడమే లేదు. మానవుని తెలివితేటలన్నీ ఎంతసేపూ బంధుమిత్రులు చనిపోతే ఏడువడానికే పనికివస్తున్నాయి. పైగా, ఇవేవో మమతానుబంధాలంటూ కప్పి పుచ్చుకోజూస్తున్నామే తప్ప ‘శాశ్వతానందం’ ఏది? ఒకవైపు ఆత్మవంచనకు పాల్పడుతూనే మరోవైపు ‘నిజమైన ఆనందం లభించడం లేదెందుకో’ అని వాపోవడం మనకు పరిపాటైపోయింది.

‘వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు నేడుచు నొక్కచోట (భాగవతం: 7-124)’ అంటాడు పోతన అమాత్యుడు ప్రహ్లాదుని గురించి. అతడు శ్రీహరి ధ్యాసలో చేష్టలుడిగి ఒక్కడే అలా దిగాలు పడిపోయి ఏడుస్తూ ఉంటాడట. ‘ఏడ్వడమెందుకు, అతడు రాకుమారుడు కదా! పై పెచ్చు ముల్లోకాలను జయించిన వీరాధివీరుడైన హిరణ్యకశిపుని పుత్రరత్నం కూడా. లోటేమున్నది?’ అంటే, ‘దేవుణ్ణి విడిచి ఉండలేననే విరహతాపం’ అది. కనుక, భగవద్విరహంతో తపించేవాని జీవనమే ధన్యం. వాని ఏడ్పే సార్థకం.

-డా॥ వెలుదండ సత్యనారాయణ
94411 62863

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దేవుని కోసం తపిద్దాం!

ట్రెండింగ్‌

Advertisement