e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home చింతన కర్మచక్రం.. జీవన చిత్రం!

కర్మచక్రం.. జీవన చిత్రం!

కర్మచక్రం అనేది ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానికి బాధ్యులు కావలసిందే. వ్యక్తి చేసిన క్రియలే కర్మచక్రం రూపంలో వస్తున్న ఈతి బాధలు, ఇక్కట్లు.
ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః
అఘాయురింద్రియా రామో మోఘం పార్థ స జీవతి॥

(భగవద్గీత 3-16)

- Advertisement -

ఈ కర్మ చక్రానికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, ఇంద్రియలోలుడై పాప భూయిష్టమైన జీవితాన్ని గడుపుతారో అలాంటి వాళ్లు వ్యర్థమైన జీవితాన్ని గడుపుతారని భావం. ఈ విశ్వంలోని మానవేతర జీవరాసులన్నీ ఈ కర్మ చక్రానికి లోబడి ఉంటాయి. వాటి సహజ ప్రేరణను అనుసరించి జీవిస్తూ ఉంటాయి. ఆహార నియమాల గురించి, ఇంద్రియ నిగ్రహం గురించి వాటికి చెప్పనవసరం లేదు. మనిషి తప్ప మిగతా జీవులేవీ వాటి నియమాలను అతిక్రమించవు. కానీ, మనిషి మాత్రం సందర్భానుసారం, తన అవసరార్థం కొత్త నియమాలు సృష్టించుకుంటూ ఉంటాడు. అవీ కుదరని నాడు అంతకుముందు తను ఏర్పర్చుకున్న నియమాలను తానే అతిక్రమిస్తూ ఉంటాడు!
భగవంతుడు ఏర్పర్చిన ఈ కర్మ చక్రానికి వ్యతిరేకంగా ప్రవర్తించి నడుచుకుంటే అది దిగజారడమే అవుతుంది. తన స్వార్థం కోసం, అవసరాలు తీరడం కోసం నియమాలు అతిక్రమించడం వల్లనే సృష్టి సమతుల్యత దెబ్బతింటున్నది. అభివృద్ధి పేరిట ధ్వంస రచన చేస్తూ ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు. విలువలను వదిలిపెట్టి వికృతంగా వ్యవహరిస్తున్నారు. కరువు కాటకాలు, వరదలు, యుద్ధాలు, కరోనా వంటి మహమ్మారుల విజృంభణకు ఇలాంటి పరిస్థితులే కారణం. మనిషి వైఖరే ఈ ప్రపంచాన్ని చీకట్లోకి నెడుతున్నది.
ఒక సమాజంలోని వ్యక్తులు నిర్దోషులై, బాధ్యతాయుతులై ఉంటారో ఆ సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనిషి ప్రలోభాలకు గురవుతాడో, ఇంద్రియ లోలత్వానికి లోనవుతాడో.. అతడి జీవితం జారుడు మెట్ల మీద పడిన బంతిలా పతనం అవుతుంది. చెడుకు ఆకర్షణ ఎక్కువ. ఇలా దిగజారే వ్యక్తి తానొక్కడే కాకుండా.. చుట్టూ ఉన్న పదిమందినీ కిందికి లాగుతాడు. ఇది చివరకు సమాజ పతనానికి దారితీస్తుంది. ఫలితంగా కర్మ చక్ర ప్రాబల్యంతో అంధకారయుగం మొదలవుతుంది.
ధృతరాష్ర్టుడు భౌతికంగానే కాకుండా మానసికంగా కూడా గుడ్డి వాడే. అంధుడికి దారి చూపాల్సిన అతని భార్య పాతివ్రత్యం పేరుతో గుడ్డితనాన్ని కోరి వరించింది. ఫలితంగా నూరు దుర్గుణాలు జనించాయి. వారికి వంత పాడే వారంతా అంధకారబంధురమే. ఇక ధర్మానికి స్థానం ఎక్కడ? ధర్మం అరణ్యవాసం చేసింది. మంచితనం ఇక్కట్ల పాలైంది. న్యాయం ఎక్కడో తల దాచుకుంది. అలాగే ఇంద్రియ లోలత్వం, అహంకారం, లోభం మొదలగు నీచ గుణాలతో దారి తప్పుతున్న నేటి యువత సరైన మార్గంలో నడవాలంటే, మళ్లీ స్వర్ణయుగం రావాలంటే, సమాజంలో అభ్యుదయ కాంతి రేఖలు వెలగాలంటే గురువులు అవసరం.
ప్రస్తుతం ఈ కర్మచక్ర భ్రమణంలో ఎన్నో అపశ్రుతులు వినిపిస్తున్నాయి. వాటిని సరి చేయవలసిన బాధ్యత గురువులదే! కేవలం మెట్ట వేదాంతం, ఆచరణ యోగ్యం కాని ఊహాతీత పథకాల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ కర్మ చక్రానికి సృష్టికర్త అయిన బ్రహ్మతో సంబంధం ఉంది. అన్ని కర్మలు ఆయన నుంచి పుట్టినవే. నేటి యువత పరోపకారం కోసం, సమాజహితం కోసం పని చేయగల లక్ష్యం అందిపుచ్చుకోవాలి. ప్రతి ఒక్కరిలో వివేకానందుని భావాలు, ఆలోచనలు రావాలి. అప్పుడే భారతీయ సమాజం, సంస్కృతి ఉత్తమ మార్గాన నడుస్తాయి.

కనుమ ఎల్లారెడ్డి
93915 23027

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana