e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home చింతన ప్రణతజన సౌభాగ్య జననీం

ప్రణతజన సౌభాగ్య జననీం

హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభ మనయత్‌
స్మరో‚పి త్వాం నత్వా రతి నయన లేహ్యేన వపుషా
మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్‌

(సౌందర్యలహరి-5)

- Advertisement -

‘అమ్మవారిని ‘ప్రణత జన సౌభాగ్య జననీం.. తనను ఆరాధించిన వారికి సౌభాగ్యాన్ని అనుగ్రహించే తల్లి!’ అంటూ సంబోధిస్తున్నారు శంకరులు. అటువంటి తల్లిని విష్ణువు, మన్మథుడు ఆరాధించి అనుగ్రహాన్ని పొందారు. ఒకప్పుడు విష్ణువు ‘హాది విద్య’ ద్వారా అమ్మను ఉపాసించడం వల్ల లోకోత్తర సౌందర్యవతియైన స్త్రీగా మారిపోయాడట. అలా మారిన విష్ణువు సౌందర్యానికి త్రిపుర హరుడైన శివుడే శృంగార భావనావశుడయ్యాడట. ‘జననీ’ అంటే కారణమైనదని అర్థం. సౌభాగ్యానికి కారణమైందన్నమాట. సుభగస్య భావం సౌభాగ్యం. సుభగ అనే శబ్దానికి ఉన్న ఎన్నో అర్థాలలో నిత్యానిత్యజ్ఞానం ముఖ్యమైనది. అదే శ్రీవిద్య. దానినే ఉపాసన అంటారు. అదే సౌభాగ్యాన్నిస్తుంది. దానికి కారణమైనది అమ్మవారు. ప్రణతి అంటే త్రికరణ (మనసు, మాటా, చేతలు) శుద్ధిగా నమస్కరించడం.

ఒకప్పుడు శివుడు తపోనిష్ఠలో ఉన్న సమయంలో దైవకార్య నిర్వహణలో భాగంగా, అతని తపస్సును భగ్నం చేసేందుకు మన్మథుడు పుష్పబాణాలను సంధిస్తాడు. దానికి కోపించిన శివుడు తన మూడో కన్నును తెరచి మన్మథుని దహించేస్తాడు. కామంతో మునులను సైతం మోహింపజేసే మన్మథుని దహిం చిన శంకరుడే విష్ణువు ధరించిన స్త్రీ ఆకృతిని చూసి మోహించాడనడం.. ఆ సౌందర్యం ఎంత జగన్మోహనమైనదో తెలుపుతుంది. విష్ణువుకు ఆ శక్తి ఎలా వచ్చింది. నిజానికి విష్ణువు ఆకృతిలో శివుని మోహింపజేసింది అమ్మయే. ఉన్నది ఒక్కటే అదే ఆదిశక్తి. అది శివశక్తులుగా రెండుగా మారింది. తర్వాత వ్యాపించింది. వ్యాపించిన దానిని విష్ణువు అంటున్నాం. విష్ణువు అమ్మను ఆరాధించాడు అంటే తనకు అభిన్నమైన దానిని తాను ఆరాధించి శివుడిని మోహింపజేశాడు. శివుడు కూడా విష్ణువుకు అభేదమే. శివుడు విష్ణు రూపుడు, విష్ణువు శివరూపుడు అంటారు. అందుకే, లలితాదేవి పురుషరూపమైన విష్ణువు.. అమ్మ మరొక రూపమైన శివుని మోహింపజేసాడు.

ముల్లోకాలను, మునులను కూడా మోహింపజేసిన మన్మథుడు ‘కాది విద్య‘ ద్వారా అమ్మను ఆరాధించిన ఫలితంగా తనను శివుడు కాల్చివేసినా తిరిగి జీవితుడయ్యాడు. రతీదేవి జగజ్జననిని పూజించింది. ఆమె ప్రసన్నురాలైంది. పతిభిక్షను కోరింది రతీదేవి. మన్మథుని జీవింపజేయడం తనభర్తకు వ్యతిరిక్తమవుతుంది. ఆలాగని తన భక్తపరాధీనతను వదలలేదు. అందుకే ‘రతినయన లేహ్యేన వపుషా..’ రతీదేవి తన కన్నులతో జుర్రుకుంటున్న సౌందర్యం కలిగిన పురుషునిగా కాముని జీవింపజేసింది. మన్మథుడు అనంగునిగా లోకానికి కనిపించకపోయినా, తన భార్య రతీదేవికి మాత్రం అమిత సౌందర్య మనోహర మూర్తిగా కనిపిస్తున్నాడట.

ఈ శ్లోకంలో శంకరులు అమ్మనారాధించిన వారికి సకల మాయల నుంచి బయటకు రాగల శక్తులెలా లభిస్తాయో చెబుతూనే.. జ్ఞానధనులైన వారు కూడా ఒక్కోసారి మాయామోహాదులకు ఎలా లోనవుతారో చెబుతున్నారు. అమ్మ ‘ప్రణత జన సౌభాగ్య జనని’ అయినా, తనను ఆరాధించిన వారికి తన భర్తకైనా అర్హతను పరీక్షించే శక్తులను ఇస్తుంది. ‘లోకం’ వశం కావాలన్నా, ‘పరబ్రహ్మ’ వశం కావాలన్నా అమ్మనే ఉపాసించాలి. లోకం అంటే మనస్సు. పురం అంటే శరీరం. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు మూడింటినీ హరించినవాడు శంకరుడు, పురరిపుడు. ఆమె త్రిపుర సుందరి. ఇక్కడ త్రిపురాలను త్రిపుటిగా (జ్ఞాన, జ్ఞాతృ, జ్ఞేయాదులు) చెబుతారు. సాధన దశలో త్రిపుటి విడిగా భావన చేస్తారు. అందులో ఏకత్వాన్ని సాధించడం ‘సిద్ధి’ దశ. ఏకత్వంలో కనిపించే అమిత సౌందర్యమే త్రిపుర సుందరి. అయ్యగారిది ప్రకటిత ప్రణవం. అదే ‘ఓం’ కారం. అమ్మవారిది గుప్త ప్రణవం. అదే ‘ఈం’ కారం. అందుకే జననీం అన్నారు.

పాలకుర్తి రామమూర్తి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement