e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home చింతన అకాల మృత్యు హరణం

అకాల మృత్యు హరణం

అకాల మృత్యు హరణం

గుళ్లలో తీర్థమిచ్చేప్పుడు ‘అకాల మృత్యు హరణం. సర్వవ్యాధి నివారణం. విష్ణు పాదోదకం పావనం..’ అన్న మంత్రం చదువుతారు. ‘విష్ణు’ అన్నచోట గుడినిబట్టి ఆయా దేవతానామాలు చదువుతారు. మంత్రంలో ‘సర్వకాల మృత్యు హరణం’ అని లేదు. మనమందరమూ మృత్యువును వెంట తెచ్చుకున్న వాళ్లమే. మృత్యువు ఉన్నవాడు మర్త్యుడు. ‘జాతస్యహి మరణం ధృవం’ అన్న పరమాత్మ వాక్యం ఎలానూ ఉన్నది కదా! మనకు మరణం ఉండకూడదంటే అసలు పుట్టనే కూడదు. పై మంత్రంలో ‘అకాల మృత్యు హరణం’ అని ఉన్నది. ‘దేనిని అకాల మృత్యువు అనాలి?’ మానవుని సంపూర్ణ ఆయుష్షు 120 ఏండ్లు. కనీసం 60 ఏండ్లన్నా మనిషి జీవించాలని ఆకాంక్ష. అరవై యేండ్ల వయసులోపు చనిపోవడం అకాల మృత్యువు. తల్లిదండ్రులు జీవించి ఉండగా మరణించే పిల్లలది అకాల మృత్యువు. ఆత్మహత్య, హత్యకు గురవడం, యుద్ధాలు, అల్లర్లు, దొమ్మీలు, ప్రమాదాలు వంటి వాటిలో మరణించడం ఇత్యాదులన్నీ అకాల మరణాలనబడతాయి. అకాల మృత్యువుకు లోనైన వారి ప్రారబ్ధం మరుజన్మలో ద్విగుణీకృతమవుతుంది. ఆ జన్మలో మిక్కిలి నికృష్టమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఆత్మహత్య చేసుకోవడం వల్ల నికృష్టమైన జన్మను చేజేతులా కొనితెచ్చుకోవడం అవుతుంది. మహర్షులు ‘ఆత్మహత్య మహాపాపం’ అని చెప్పడంలోని అంతరార్థమిదే.

ధర్మయుద్ధాలలో పోరాడి మరణించిన వారికి వీరస్వర్గం లభించడం అకాల మృత్యువుకు మినహాయింపు. యుద్ధానికి ముందు ‘ధర్మ’ అన్న శబ్దాన్ని మనం జ్ఞాపకముంచుకోవాలి. యుద్ధం ధర్మాన్ని స్థాపించేందుకై ఉండాలి. ‘మా దేవుడే గొప్ప. మా దేవుని నమ్మనివారు పాపాత్ములు. వారిని చంపితే పుణ్యం వస్తుంది. మా దేవుడు సంతోషిస్తాడు’ అని ఇతర మతాలవారిని చంపేందుకుగాను యుద్ధం చేసే వారంతా నరకానికే వెళతారు. ఎందుకంటే, అది ‘అధర్మయుద్ధం’ కాబట్టి. ‘ఉన్నది ఒక్కడే పరమాత్మ’ అని అన్ని మతాలవారూ చెప్తున్నారు. ఏ మతం వారు చనిపోయినా పోవలసింది, ఒక్కడైన ఆ పరమాత్మ వద్దకే! లోకంలో ఎన్ని మతాలున్నవో అందరు పరమాత్మలు లేరు కదా! ఏ మతానుయాయి ఏ పద్ధతిలో దేవుణ్ణి ప్రార్థించినా, అది ‘ఆది మధ్యాంత రహితుడైన’ ఆ పరబ్రహ్మకే చెందుతుంది కదా! ‘ఊర్ధలోకాలలో కోట్లాది జనుల నిమిత్తం కోట్లాది స్వర్గలోకాలు వున్నవని, వానిని కోట్లకొలది పరమాత్మలు పర్యవేక్షిస్తుంటారని’ ఏ మతమూ చెప్పలేదు! నియంత్రణ లేని తామసగుణం రజోగుణాన్ని రెచ్చగొట్టినందువల్ల మనిషిలో మతోన్మాదం విజృంభిస్తుంది. మతోన్మాద వ్యాఘ్రానికి సత్వగుణ గోముఖాన్ని తొడిగించి పరమత నిర్మూలనమే స్వర్గలోక ప్రాప్తికి రాజమార్గమని ‘గురువులు’ ప్రబోధిస్తుంటారు. స్వంత ఆలోచన లేని శిష్యగణాలు ధర్మయుద్ధమన్న భ్రమలో అధర్మయుద్ధం చేస్తుంటారు. ‘పరమతాలవాళ్ల అధర్మయుద్ధాలకు లోబడిపోయి తమ ధర్మాచరణ మార్గాలను విడిచి పెట్టకూడదని’ శ్రీకృష్ణ పరమాత్మ ‘ద్వాపరయుగం’లోనే చెప్పాడు. ద్రోణాచార్యుడు మూర్తీభవించిన ధనుర్విద్య. త్రికరణశుద్ధికి తిరుగులేని ఉదాహరణ భీష్మాచార్యుడు. అధర్మం పక్షాన నిలచిన కారణంగానే వారిరువురూ నేల కొరిగారు, పశ్చాత్తాప పడ్డారు

ధర్మం పక్షాన ఉన్నవాళ్ల మనసు సున్నితంగా ఉంటుంది. ఆ కారణంగా వారు పోరాటం పట్ల విముఖత చూపుతూ, జారిపోతుంటారు. ధర్మరాజు ‘యుద్ధం చేయాల్సి వస్తే నాకు రాజ్యమే వద్దు పొమ్మ’న్నాడు. ద్రౌపది ‘ముడి వేయని తన తలకట్టు’ను చూపి దుశ్శాసనుని దుష్కృత్యాలను జ్ఞాపకం చేసింది. యుద్ధభూమిలో అర్జునుడు ‘వీళ్లంతా నా బంధువులు. యుద్ధం చేయన’న్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ గీతను బోధించి యుద్ధం చేయించాడు. ఏ యుద్ధంలో అయినా ఒక పక్షమే ధర్మానికి కట్టుబడి ఉంటుంది. యుద్ధం ధర్మస్థాపన నిమిత్తం జరుగవచ్చు. లేదా అధర్మానికి అడ్డుకట్ట వేయడానికైనా జరుగవచ్చు. ఇది మనమందరమూ జ్ఞాపకముంచుకొన వలసిన విషయం.

వరిగొండ కాంతారావు
94418 86824

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అకాల మృత్యు హరణం

ట్రెండింగ్‌

Advertisement