e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home చింతన దృష్టిభేదం

దృష్టిభేదం

కురుక్షేత్ర సంగ్రామానికి వేళయింది. కురుసేనలు ఓ పక్క, పాండవుల సైన్యం మరోపక్క మోహరించి ఉన్నాయి. కాసేపట్లో కురుక్షేత్రం.. రణక్షేత్రంగా మారనుంది. ఇటు అర్జునుడు, అటు దుర్యోధనుడు ఉభయ సేనలనూ పరిశీలించారు. తన సైన్యాన్ని చూసిన దుర్యోధనుడిలో ధీమా వ్యక్తమైంది. పితామహుడైన భీష్ముడు రక్షణ కవచంగా ఉండగా తమకు విజయం సునాయాసంగా లభిస్తుందని భావించాడు. ద్రోణుడు, అశ్వత్థామ వంటి యోధానుయోధులను చూసి గెలుపు తమదే అనుకున్నాడు. గర్వితుడై అతిశయోక్తిగా మాట్లాడాడు. కానీ, అవతలి పక్షంలో దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఉన్నాడన్న సంగతి విస్మరించాడు.

మరో పక్షంలో ఉన్న అర్జునుడు ఉభయ సేనలనూ కండ్లారా చూశాడు. అతని హృదయం కకావికలమైంది. శత్రువుపై వింటి నారి సంధించాల్సిన అర్జునుడి మనసును ఏదో పాశం వెనక్కిలాగింది. దయ, కారుణ్య స్వభావాలు అతణ్ని పూర్తిగా ఆవహించాయి. యుద్ధం మొదలైతే ఇరుపక్షాలకూ సంభవించే వినాశనాన్ని గుర్తించాడు పార్థుడు. భావోద్వేగానికి గురయ్యాడు. మానసికంగా బలహీనుడయ్యాడు. శోకతప్తుడై తన గాండీవాన్ని జారవిడిచాడు. తాను యుద్ధం చేయబోనని శ్రీకృష్ణుడితో చెప్పాడు. ఎందుకు అస్త్ర సన్యాసం చేస్తున్నాడో పలు వాదనలు వినిపించాడు! ఆ తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తవ్యాన్ని బోధించడం, ఫల్గుణుడు కదనోత్సాహంతో కాలుదువ్వడం తెలిసిందే!

- Advertisement -

యుద్ధంలో విజయం కోసమే దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరూ కురుక్షేత్రం చేరారు. ఇద్దరూ తమ సేనలను చూశారు. కానీ, తమ సహజ స్వభావాల కారణంగా తమ ప్రతిస్పందనలను భిన్నంగా వ్యక్తం చేశారు. ఈ విభిన్న ప్రవృత్తుల మధ్యగల ఆంతర్యాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీత 16వ అధ్యాయంలో సుర, అసుర లక్షణాలుగా వివరించాడు. అసుర ప్రవృత్తి కలిగిన దుర్యోధనుడి లాంటివారు యుద్ధ ఫలితాన్ని తామే పూర్తిగా శాసిస్తామనుకుంటారు. ఆ అసుర స్వభావ లక్షణాల గురించి భగవానుడు ఇలా చెప్పాడు..
దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్‌

(భగవద్గీత 16.4)

‘ఓ పార్థా! దంభం, దురహంకారం, గర్వం, క్రోధం, మొరటుతనం, అజ్ఞానం అనేవి ఆసురీ స్వభావం గలవారి గుణాలు’ అని వివరించాడు. ఈ స్వభావాలన్నీ దుర్యోధనుడిలో స్పష్టంగా ఉన్నాయి. యుద్ధం విరమించమని పెద్దలు చెప్పిన మాటలను కూడా పెడచెవిన పెట్టి తీవ్ర పరిణామాలకు కారణమయ్యాడు. మరోపక్క దైవీగుణ సంపన్నుడైన అర్జునుడు యుద్ధం వల్ల కలిగే దుష్పరిణామాలను, ప్రాణనష్టాన్ని అంచనా వేశాడు. కారుణ్యంతో యుద్ధాన్ని విరమించాలనుకున్నాడు. కౌరవుల అకృత్యాల వల్లే యుద్ధం నెలకొన్నా, అర్జునుడు మాత్రం వారందరినీ క్షమించి, రాజ్యాన్ని సైతం త్యజించడానికి సిద్ధపడ్డాడు. అర్జునుడి దైవగుణ సంపత్తిని సాక్షాత్తు భగవంతుడే ఇలా నిర్ధారించాడు.
దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా
మా శుచః సంపదం దైవీమ్‌ అభిజాతోసి పాండవ॥

(భగవద్గీత 16.5)

‘దైవీ గుణాలు మోక్షం దిశగా తీసుకెళ్తాయి. కానీ, అసుర గుణాలు బంధనంలో చిక్కుకుపోవడానికి కారణమవుతాయి. బాధపడకు అర్జునా! నీవు దైవీ గుణాలతో జన్మించావు’ అని ఉద్బోధించాడు పరమాత్మ. ధర్మం కోసం జరుగుతున్న యుద్ధంలో పోరాడాల్సిన అర్జునుడు అజ్ఞానంతో తన కర్తవ్యాన్ని విస్మరిస్తే.. భగవానుడు తిరిగి కార్యోన్ముఖుడ్ని చేశాడు. పరమాత్మ ఉపదేశించిన దైవీ గుణాలు పెంపొందించుకోవడం అందరికీ సాధ్యమా? నిత్యం భగవంతుడి సాంగత్యంతోనే అది సాధ్యమవుతుంది. దైవానుగ్రహం లేకుండా దైవీగుణాలు పొందలేం. దైవ సాంగత్యానికి సాధనం భగవన్నామ జపం.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే

ఈ మహామంత్రాన్ని నిత్యం యథాశక్తి జపించగలిగితే, భగవానుడి అనుగ్రహంతో మనలో దైవీగుణాలు పెంపొందుతాయి.

శ్రీమాన్‌ సత్యగౌర చంద్రదాస ప్రభూజి
93969 56984

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana