e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home చింతన గురుశిష్యుల పవిత్రబంధం

గురుశిష్యుల పవిత్రబంధం

మానవ జీవితంలోని బంధాలు, అనుబంధాలలో ఎంతో ముఖ్యమైంది, పవిత్రమైంది గురుశిష్యుల బంధం. యోగ్యతగల గురువు వద్ద విద్యను అభ్యసించిన శిష్యులు మాత్రమే ఉన్నత స్థితికి చేరుకొంటారు. జిజ్ఞాస, శ్రద్ధ, ఏకాగ్రత వంటి ఉత్తమ లక్షణాలుగల శిష్యులకు విద్యాబోధన చేసిన గురువు కీర్తిప్రతిష్ఠలూ అదే విధంగా చిరస్థాయిగా నిలుస్తాయి. విద్యలన్నిటిలోనూ ఆధ్యాత్మిక విద్యయే ముఖ్యమైందని (ఆధ్యాత్మ విద్యా విద్యానాం) ‘భగవద్గీత’ పేర్కొన్నది. గురువుల్లో ఉత్తమాచార్య లక్షణాలు, శిష్యుల్లో అభ్యాస సద్గుణాలు ఉంటేనే ఆ గురుశిష్యులకు మంచిపేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వారి ఉపదేశ-అభ్యాసాలూ సార్థకమవుతాయి. అటువంటి ఆధ్యాత్మిక విద్యయే ఫలవంతమై లోకహితానికి ఎంతగానో దోహదం చేస్తుందని శాస్త్రగ్రంథాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక విద్యావికాసంలో సాగే గురుశిష్యులకు ఉండవలసిన ‘ఉత్తమ లక్షణాల’ను మన పూర్వులు తెలిపారు.
‘ఆచార్యో వేద సంపన్నో విష్ణు భక్తో విమత్సరః
మంత్రజ్ఞో మంత్ర తత్తజ్ఞో సదా మంత్రార్థ దశ్శుచిః
గురుభక్తి సమాయుక్తః పురాణజ్ఞో విశేషతః
ఏవం లక్షణ సంపన్నో గురురిత్యభిధీయతే॥

ఆచార్య వేదాంత దేశికులు (న్యాసవింశతి)
గురువు వేద-వేదాంగాలలో నిష్ణాతుడు కావాలి. ప్రత్యేకించి భగవత్‌ భక్తుడై (విష్ణుభక్తుడై) ఉండాలి. ఈర్ష్యాసూయలు ఉండకూడదు. మంత్రాలు, వాటి అర్థాలు క్షుణ్ణంగా తెలియాలి. శిష్యులకు ఆధ్యాత్మిక రహస్యాలు, బ్రహ్మవిద్య ఉపదేశించాలనే తపన గురువుకు ప్రధానం. ఇంతేకాదు, తన గురు పరంపరపై అమిత భక్తిభావం, నిష్కపట సేవాదృష్టిని కలిగి ఉండాలి. భారతీయ పౌరాణిక జ్ఞానసారాన్ని దేశకాలమాన పరిస్థితులకు సమన్వయ పరిచే శక్తి గురువులకు తప్పనిసరి. భగవంతునికి, శిష్యభక్తులకు మధ్య వారొక సంధానకర్త వలె మెలగాలి.
సద్బుద్ధిః సాధుసేవి సముచిత చరితః తత్తబోధాభిలాషీ
శుశ్రూషుః త్యక్తమానః ప్రణిపతన పరః ప్రశ్నకాల ప్రతీక్షః
శాన్తో దాన్తో అనసూయుః శరణముపగతః శాస్త్రవిశ్వాస శాలీ
శిష్యః ప్రాప్తః పరీక్షాం కృతవిత్‌ అభిమతః తత్తతః శిక్షణీయః॥
సత్ప్రవర్తన, సద్బుద్ధి, పెద్దలపట్ల వినయ విధేయతలు, ఉపనిషత్‌ రహస్యాలు, భగవత్‌ తత్తాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస, సాధుపుంగవులు, మహనీయుల ఉపదేశాలను వినాలనే ప్రబలమైన కోరిక వంటివి ఉత్తమ శిష్యుని లక్షణాలు. గర్వం, అహంకారం, అసూయలు శిష్యులకు ఉండకూడదు. గురువుగారి మనసెరిగి, సమయమెరిగి తన సందేహాల నివృత్తికై వినయంతో ప్రశ్నించాలి. అంతరింద్రియ- బహిరింద్రియ నిగ్రహం, శాస్ర్తోపదేశాలపై చెదరని విశ్వాసం, గురువుపట్ల కృతజ్ఞతాభావం వంటివన్నీ తప్పనిసరి. గురువుకు తనపై ఆదరభావం, వాత్సల్యం కలిగేలా, వారి మనస్సులో తనకొక సుస్థిరస్థానం ఏర్పడేట్లుగా శిష్యుల వ్యవహార శైలి ఉండాలి.
ఇలాంటి ‘ఉత్తమ గురుశిష్యుల బంధం’ అతి పవిత్రమేకాక ఎంతో దృఢమైందికూడా. అలాంటి వారే భవిష్యత్‌ తరాలకు ఆదర్శమవుతారు. ‘జ్ఞానం’, ‘ఆచరణ’ రెండూ పరిపూర్ణంగాగల సదాచార్యునితోపాటు అంతటి గురుభక్తి కలిగిన శిష్యుడికీ లక్ష్మీనాథుడైన శ్రీహరి తానే స్వయంగా వైకుంఠంలో నివాస భాగ్యాన్ని సమకూరుస్తాడనడానికి ఈ కింది శాస్త్ర వచనాలే గొప్ప తిరుగులేని సాక్ష్యం.
‘జ్ఞానమ్‌ అనుట్టానమ్‌ ఇవై నన్రాగవే యుడైయ
నాన గురువై అడైందక్కాల్‌ మానిలత్తీర్‌
తేనార్‌ కమల త్తిరుమామగళ్‌ కొఱునన్‌
తానే వైగుందం తరుమ్‌’

- Advertisement -

ఆచార్య వరవర మునులు (ఉపదేశ రత్నమాల: ద్రావిడ ప్రబంధం)
సకల సద్గుణవంతులైన కూరత్తాళ్వాన్‌ అనే ఉత్తమ శిష్యులతో తనకుగల ఆచార్య సంబంధాన్నిబట్టి తాను మోక్షాన్ని తప్పక పొందుతాననే నిశ్చయం ఏర్పడిందని భగవద్‌ రామానుజాచార్యులు భావించారు. అలాగే, ఉపనిషత్‌ కథల్లోనూ ప్రస్తావితమైన ‘ఉత్తమ గురుశిష్యుల వృత్తాంతాల’ సారాన్ని అందరూ గ్రహించాలి. అప్పుడు ఖచ్చితంగా అటువంటి గురుశిష్య బంధం విలువ తెలిసివచ్చి, ఆ మేరకు ఆచరణాత్మక మార్గం లభిస్తుంది.

సముద్రాల శఠగోపాచార్యులు
98483 73067

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana