e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home చింతన ఆత్మజ్ఞాన సందేశం

ఆత్మజ్ఞాన సందేశం

ఆత్మజ్ఞాన సందేశం

‘ఛాందోగ్యోపనిషత్తు’ ద్వారా ఉద్దాలకుడిగా వినుతికెక్కిన అరుణి మహర్షి మనందరకూ ఆత్మతత్వాన్ని సోదాహరణంగా వివరిస్తాడు. ఆయన కుమారుడు శ్వేతకేతు తన విద్యాభ్యాసం ముగించి తండ్రి వద్దకు వస్తాడు. ‘నాయనా! అసలు తత్వం తెలుసుకొన్నావా?’ అని తండ్రి అడగడంతో అతను నిరుత్తరుడవుతాడు. అపుడు అరుణి, ‘ఈ ప్రపంచమంతా ఎలా ఏర్పడిందో, దేని నుంచి రూపొందిందో’ కొడుక్కు చెప్తాడు. ‘కుండలు, పాత్రలు, బొమ్మలు మొదలైనవన్నీ మట్టి నుంచే తయారవుతున్నాయి. కాలం తీరాక అవన్నీ తిరిగి మట్టిలోనే కలుస్తున్నాయి. అలాగే, రకరకాల బంగారు ఆభరణాలన్నిటినీ కరిగిస్తే బంగారమే మిగులుతుంది. ఇదేవిధంగా, కనిపించే ఈ జగత్తంతా కనిపించని ఆత్మనుంచే ఉద్భవించింది!’ అని ఉపదేశిస్తాడు. దానికి శ్వేతకేతు, ‘తండ్రీ! మొట్టమొదట అద్వితీయమైన ఒకే సత్పదార్థం ఉంటే మరి, ఈ విశ్వవ్యాప్త వస్తువులు ఎలా తయారయ్యాయి? అవి అసంఖ్యాకంగా ఎలా ఉన్నాయి?’ అడుగుతాడు వినమ్రంగా.

‘శ్వేతకేతూ! మూలతః తత్వం ఒక్కటే. మూలపదార్థమైన సత్‌, తదైక్షత బహుస్యాం ప్రజాయేయేతి. ‘నేను అనేక మవుతానుగాక!’ అనుకొంది. ఆ తపస్సు నుంచే తేజస్సు పుట్టింది. తేజస్సు నుంచి జగత్తు, జగత్తు నుంచి జలం, పృథ్వీ, వాయువులు ఉద్భవించాయి. వాటి నుంచే జీవం పుట్టింది. ఇలా వివిధరూపాలలో ఆత్మ అభివ్యక్తమైంది. ఇవన్నీ రకరకాల పేర్లతో, ఆకృతులతో విలసిల్లుతున్నా అన్నిటి మూలం ఒకటే. ఈ విశ్వంలో భిన్నరూపాలలో ఉండే ఖనిజాదులు, వనస్పతులు, ప్రాణులు ఆ మూలసత్పదార్థం కంటే భిన్నమైనవి కావు. అయితే, ఏ ఆత్మ నుంచి జగత్తు నిర్మాణమైందో అది అత్యంత సూక్ష్మమైంది. ఎంత సూక్ష్మమంటే ‘అవ్యక్తం’ అనేంతగా. కానీ, అది సత్యం. ఈ అభివ్యక్తి అంతా నశించినా అది మాత్రం నశించదు. ‘అణోరణీయాన్‌’ అంటే, పరమాణువు కన్నా సూక్ష్మం. కాబట్టి, ఆత్మ మన మామూలు కండ్లకు కనిపించదు. ‘తత్‌ త్వం అసి’ అంటే ‘ఆత్మ నీవే’ అయి ఉన్నావు’ సంభ్రమాశ్చర్యాలతో శ్వేతకేతు మళ్లీ అడిగాడు తండ్రిని, మరింత ఆసక్తితో.

- Advertisement -

‘తండ్రీ! మీరీ మూలతత్వం ‘అణోరణీయాన్‌’ అంటున్నారే! మరి, ఆ సూక్ష్మకారణం నుంచి ఈ బృహద్‌ విశ్వమెలా ఉద్భవించింది?’ కుమారుడి జిజ్ఞాస, ఆసక్తి, బుద్ధికుశలతకు సంతోషించిన అరుణి మహర్షి, ‘నాయనా! ఆ కనిపించే మర్రిపండు నొకదానిని తీసుకురా’ అన్నాడు. శ్వేతకేతు ఒక మర్రిపండు తెస్తాడు. దానిని ‘ముక్కలుగా కోయ’మంటాడు అరుణి. పండును కోసి ముందుపెడతాడు. ఆ ముక్కలలో విత్తనాలు చిన్నవిగా ఉంటాయి. అరుణి ఒక విత్తనాన్ని తీసుకొని బద్దలు చేయమంటే, శ్వేతకేతు అలాగే చేస్తాడు. ‘కుమారా! ఇప్పుడు ఈ బద్దలైన విత్తనంలో నీకేమి కనిపిస్తున్నది?’ అని అరుణి అడగడంతో, ‘ఏమీ లేదే! నాకేమీ కనిపించడం లేదు తండ్రీ!’ అంటాడు శ్వేతకేతు. ‘ఏమీ కనిపించని దాని నుంచి ఎలాగైతే ఇంత పెద్ద మర్రిచెట్టు అభివ్యక్తమవుతుందో, అలాగే ఈ సమస్త జగత్తు కనిపించని ఆత్మనుంచే ప్రస్ఫుటమవుతున్నది. దీనినే నీవు తెలుసుకోవాలి.’

‘అది అంత సూక్ష్మమవ్వడం వల్ల మన కంటికి కనిపించదు కానీ, అంతటా ఎలా వ్యాపించి ఉంది?’ మరో ప్రశ్న అడిగాడు శ్వేతకేతు. దానికి అరుణి, ‘కొంత ఉప్పును తీసుకొని, ఓ పాత్రలోని నీటిలో కలిపి, రుచి చూడ’మంటాడు. శ్వేతకేతు ఆ పనిచేసి ‘నీరు ఉప్పగా ఉన్నాయని’ జవాబిస్తాడు. మరి, ‘ఆ ఉప్పు ఎక్కడ ఉందని’ అడుగుతాడు అరుణి. ‘నీళ్లలో అంతటా ఉందని, ఉప్పు కనిపించక వ్యాపించింది’ అంటాడు. “కుమారా! ఉప్పెనలా అవ్యక్తంగా, సూక్ష్మంగా నీరంతా వ్యాపించి ఉందో, అలాగే ఆత్మ ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది. అదే నువ్వు. తత్వమసి!’ అని శ్వేతకేతుకు జ్ఞానబోధ చేస్తాడు.

రావుల నిరంజనాచారి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆత్మజ్ఞాన సందేశం
ఆత్మజ్ఞాన సందేశం
ఆత్మజ్ఞాన సందేశం

ట్రెండింగ్‌

Advertisement