e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home చింతన సద్బుద్ధితోనే సమర్పణ భావం!

సద్బుద్ధితోనే సమర్పణ భావం!

సద్బుద్ధితోనే సమర్పణ భావం!

రథానికి సారథి ఉంటాడు. సారథిని బట్టి రథ గమనం. సారథి సరైనవాడు కానప్పుడు రథ గమనమే కాకుండా రథంలో ఉన్నవారికి కూడా ఇబ్బంది తప్పదు. సారథి సరైనవాడైతే రథమూ, రథికుడు ఇద్దరూ ప్రశాంతంగా ప్రయాణిస్తారు. రథ గమనానికి సారథి చాలా ముఖ్యమైనవాడు. పూర్వం అశ్వాలను నడిపించేవాడు మాత్రమే సారథి. ప్రస్తుతం వాహనాలను నడిపించే వారంతా సారథులే. వాహనాలు, వాటిలో ప్రయాణించే మనమూ ప్రశాంతంగా గమ్యం చేరాలంటే సారథుల ప్రవర్తనే అతిముఖ్యమైంది.
ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు
బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ
ఇంద్రియాణి హయానాహుర్విషయాం స్తేషు గోచరాన్‌
ఆత్మేంద్రియ మనో యుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః

కఠోపనిషత్తు
మానవ శరీరాన్ని కూడా రథంగానే భావిస్తారు. కఠోపనిషత్తు, భగవద్గీత కూడా శరీరాన్ని రథంగా, బుద్ధిని సారథిగా, ఇంద్రియాలను గుర్రాలుగా, మనసును కళ్ళెంగా, ఆత్మను రథ యజమానిగా తెలిపాయి. మనం ఒక కారు కొంటే నడిపేవాడు బుద్ధి. దాని ఇంజిను, టైర్లలో గాలి, పెట్రోలు, రేడియేటర్‌లో నీళ్ళు వంటివన్నిటినీ అతను జాగ్రత్తగా చూసుకోవడమేకాక అవన్నీ ఇబ్బంది పడకుండా, యజమాని ఆదేశం మేరకు చేరవలసిన గమ్యాన్ని తన చాతుర్యంతో, రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తూ, ఇతర వాహనాలను ఢీ కొట్టకుండా ముందుకుతీసుకెళ్లాల్సిన బాధ్యత సారథికి ఉంటుంది. ‘శరీరం’ అనే కారును ఆత్మ మార్గానుసారంగా బుద్ధి నడిపించాల్సి ఉంటుంది. నడిపే చోదకుడు తనకు ఇష్టమైనట్లు నడపకూడదు. చోదకుని ఇష్టానుసారం ప్రయాణం మొదలైతే లక్ష్యం లేకుండాపోతుంది. ఇటువంటి గమ్యరహిత ప్రయాణాల వల్ల మధ్యలో ఎన్నో ఆకర్షణలకు లోనై, ఇష్టమైనన్ని చోట్ల ఆగడం, ప్రమాదాలకు గురవడం వంటివి జరుగుతుంటాయి. దీనివల్ల సంకల్పాలు మిగిలిపోయి, కొత్తవి మళ్ళీమళ్ళీ చేరుతూ పునర్జన్మలకు, కష్టసుఖాలకు కారకమవుతుంది.
‘శరీరం’ అనే వాహనాన్ని బుద్ధి నడిపిస్తుంటే దానికున్న గుణాలన్నీ మన శరీరంపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. మనకున్న తమో, రజో గుణాదుల వల్ల కోరికలు బాగా పెరుగుతుంటే ఆ క్షణానికి కామం (లౌకిక కోరికలు) మనల్ని నడిపిస్తుంది. అదేవిధంగా సందర్భానుసారంగా క్రోధం, లోభం, మదం, మాత్సర్యం, ఈర్ష్య, ద్వేషం మొదలైనవన్నీ నడిపిస్తుంటాయి. ఈ విషయాన్ని మనం ఎప్పటికప్పుడూ గమనిస్తుండాలి. సత్వగుణం బుద్ధికి ఏర్పడినప్పుడు మనకు ప్రశాంతత, సంతృప్తి, ఆనందం, సౌఖ్యం వంటివి లభ్యమవుతాయి. ఈ గుణాలు ఏవి నడిపిస్తున్నా ఏదో ఒక భావనలకు లోనవుతూనే ఉంటాం. సత్వగుణం వల్ల కొంత మేలు ఉంటుంది. ఈ శరీర రథాన్ని సరైనవిధంగా వినియోగించుకునేందుకు భగవంతునికి మనం అవకాశం ఇవ్వడం లేదు. ఆయనకు పూర్ణంగా సమర్పణ భావంతో మనం ఉంటే మన శరీరాన్ని సరైన మార్గంలో తీసుకెళ్లి మనని అమృతమయులుగా తీర్చిదిద్దుతాడు భగవంతుడు. ‘భగవద్గీత’లో ‘సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ’, ‘అన్నిటినీ వదిలి నన్ను మాత్రమే శరణు పొందు’ అనడంలోని ఆంతర్యం ఇదే. ఇలా కాకుండా, ‘అన్నీ నాకే తెలుసు’ అనుకునే బుద్ధి లేదా మనస్సు మాటలనే మనం వింటుంటే ఈ శరీర రథం మొత్తం నాశనమవుతుంది.
అర్జునుడు తనకు కృష్ణుడు కలిగించిన జ్ఞానంతో అతనికి పూర్ణంగా ఆత్మనివేదన చేసుకున్నాడు. కనుకే, కృష్ణుడు వెంట ఉండి భక్తునికి తాను సారథ్యం వహించి, అతనిని ఉత్తమునిగా తీర్చిదిద్దాడు. భగవంతుడే సారథ్యం వహించి, భక్తుని కర్మను పరిపక్వం చేసి తనలోకి చేర్చుకున్నాడు. మనం కూడా ప్రతీ క్షణం మనలను నడుపుతున్నవాడు భగవంతుడనే భావనతో నిరంతర జపం, సాధనతో మమేకం కాగలిగితే మనకూ ఆనందామృతాన్ని ఇస్తాడు.

సద్బుద్ధితోనే సమర్పణ భావం!
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సద్బుద్ధితోనే సమర్పణ భావం!

ట్రెండింగ్‌

Advertisement