e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home చింతన వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః

మానవ మనుగడ, సర్వజీవుల సుఖజీవనానికి వృక్షసంపదను రక్షించాలని వేదాలు, పురాణాలు ఘోషిస్తున్నాయి. వృక్షాలను దేవతలుగా పూజించి, ఆదరించే సందేశంగానే ‘క్షీరసాగర మథనం’లో ‘కల్పవృక్షం’ ఆవిర్భావాన్ని అర్థం చేసుకోవాలి. ‘రామాయణం’లో అడుగడుగునా చెట్ల వర్ణనలు, ప్రత్యేకతలు ఉన్నాయి. పర్ణశాల నిర్మాణవేళ లక్ష్మణునితో ‘వృక్షసంపద ఆవశ్యకతను’ శ్రీరాముడు వివరిస్తాడు. కాళిదాసు ‘కుమార సంభవం’లో చెట్ల రక్షణ కోసం పార్వతీదేవి పెద్దపులినే కాపలాగా కట్టి వేసిందని రాస్తారు. ‘భాగవతం’లోనూ వనాల వర్ణన మనసులను పరవశింపజేస్తుంది. నీడ, పూలు, ఫలరసాలు మాత్రమేకాక ప్రాణవాయువునూ నిరంతరం విడుదల చేస్తూ చెట్లు జీవకోటికి గొప్ప మేలు చేస్తున్నాయి. ‘పంచపల్లవాల’ (మామిడి, మర్రి, మేడి, రావి, జువ్వి) కొమ్మలను ప్రతి శుభకార్యంలోనూ ఉపయోగిస్తాం. వేల సంవత్సరాలు జీవిస్తూ, ఎంతోదూరం, నిరంతరం ఆక్సిజన్‌ను అందించే శక్తి ఈ మహావృక్షాలకు ఉంది. వటవృక్షం విష్ణుమూర్తికి ఆశ్రయమిచ్చినందున ఆయనను ‘వటపత్రశాయి’గా స్తుతిస్తాం. జ్యేష్ఠపూర్ణిమ వటసావిత్రి, ఆశ్వీయుజ బహుళ అమావాస్య రోజు ‘కేదారేశ్వర’ వ్రతాలలో మర్రిని సువాసినులు పూజిస్తారు.

దత్తాత్రేయునికి ప్రీతికరమైన మేడిచెట్టుకు పూజ చేస్తే భూత, ప్రేత, పైశాచిక బాధలు తొలగుతాయని నమ్మకం. ఈ కారణాలవల్లనే పలు చెట్లను దేవాలయాల ప్రాంగణాలు, రహదారుల కూడళ్ళలో పెంచటం మన దేశంలో పూర్వం నుంచీ ఆచారంగా వస్తున్నది. ‘అశ్వత్థ నారాయణుని’గా రావిచెట్టు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రీతికరమైంది. 24 గంటలు ఆకులను కదిల్చి ఆక్సిజన్‌ను పంచటమే దీని లక్షణం. జువ్వి పరాన్నజీవి కనుక వేరే చెట్టుపై మొలిచి పెరుగుతుంది. పక్షులద్వారా విత్తనవ్యాప్తితో పాడుబడ్డ భవనాలు, బావులు, కాలువల గట్లలో పెరిగే ఈ చెట్టూ పూజ్యనీయమే. ‘ధాత్రీ నారాయణ మూర్తి’గా ఉసిరిచెట్టుకు కార్తీకమాసంలో విశేష పూజలు చేస్తాం. ఇంటింటా తులసిచెట్టు శ్రీలక్ష్మిదేవిగా వెలుగొందుతున్నది. రామాయణం (అరణ్యకాండ, 25వ సర్గ: 12-13)లో గోదావరి తీరాన పర్ణశాల నిర్మించే సమయంలో పలు వృక్షాల (మద్ది, తాడి, కానుగ, ఖర్జూరం, పనస, మామిడి, జల కదంబం, నేమి, పున్నాగ, తియ్యమామిళ్ళు) అందాలను వాల్మీకి గొప్పగా వర్ణించారు. ‘సంపంగి, మొగిలి, పూలగుత్తులు, చందన, తిమిగ, స్థలకదంబాలు, నిమ్మ, ఉమ్మెత్త, ఇనుమద్ది, చండ్ర, జమ్మి, మోదుగ, కలిగొట్టు వంటి విశిష్ఠ చెట్లను పెంచమని’ రాముడు సూచించగా, లక్ష్మణుడు అనుసరిస్తాడు. అదే విధంగా, సీతమ్మ శింశుపా వృక్షాలకింద ఉన్నట్లు గుర్తించగా, హనుమంతుడు చూసిన చెట్ల విశేషాలు ‘సుందరకాండ’లో ఉన్నాయి.

- Advertisement -

వనదేవత శక్తి, సౌందర్యాల వర్ణనలు ‘సుందరకాండ’కే కొత్తందాన్నిచ్చాయి. దేవదారు, కొండగోగు, ఖర్జూరం, మొరటె, కొండమల్లె, మొగిలిపూలు, పిప్పిలి వంటి చెట్ల వర్ణనా ఉంది. మూర్ఛిల్లిన లక్ష్మణుని రక్షించడానికి వైద్యుడు సుషేణుడు ఆంజనేయుడిని ‘ఓషధీ పర్వతం’ పొమ్మంటాడు (యుద్ధకాండ: 102 సర్గ, 21-24). దాని దక్షిణ శిఖరంలో వుండే విశల్య కరణి, సవర్ణ కరణి, సంజీవని, సంధాన కరణి చెట్లను తెమ్మనీ చెప్తాడు. ఇక్కడ వృక్షాల ఓషధీ తత్తాన్ని వాల్మీకి అందించారు. రాముడు విజయం సాధించాక, సీతా లక్ష్మణ హనుమత్‌ సమేతుడై తిరుగు ప్రయాణంలో భరద్వాజ ముని ఆశ్రమం దర్శిస్తారు. ‘విందు’ ఇచ్చాక, ‘ఏదైనా వరం కోరుకో’మంటాడు భరద్వాజుడు. ఎల్లప్పుడూ ప్రజాక్షేమమే ధ్యేయంగాగల శ్రీరామచంద్రమూర్తి, ‘అయోధ్యకు చుట్టుపక్కల మూడు యోజనాలమేర ఎల్లప్పుడు పూలు, పండ్లతో అలరారే వృక్షసంపద కావాలని’ కోరగా, ముని అనుగ్రహిస్తాడు. ‘వృక్షో రక్షతి రక్షితః’ అన్న వేదసూక్తి వెనుక వున్న ఇంతటి గొప్పతనాన్ని అందరూ అర్థం చేసుకొని ఆ మేరకు మొక్కలు, చెట్ల పెంపకంతో ప్రకృతి రక్షణకు పూనుకోవాలి.

మాడుగుల నారాయణమూర్తి
94411 39106

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వృక్షో రక్షతి రక్షితః
వృక్షో రక్షతి రక్షితః
వృక్షో రక్షతి రక్షితః

ట్రెండింగ్‌

Advertisement