e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home చింతన స్వాహా, స్వధా దేవతల దీవెనలు

స్వాహా, స్వధా దేవతల దీవెనలు

స్వాహా, స్వధా దేవతల దీవెనలు

స్వాహాం మంత్రగయుక్తాం చ మంత్రసిద్ధి స్వరూపిణీమ్‌
సిద్ధాం చ సిద్ధిదాం నృణాం కర్మణాం ఫలద్దాం శుభామ్‌.

యజ్ఞారంభంలో స్వాహాదేవిని ఆవాహన చేసి పై విధంగా ధ్యానిస్తాం. ప్రకృతిలోని పరిపూర్ణ, ప్రధానాంశ రూపాలు, కళా-కళాంశ రూపాలన్నీ అమ్మవారు ధరించినవే. వాటిలోని వారే స్వాహాదేవి, స్వధాదేవి. వీరి ఆరాధనకూ ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. దేవతలకు ఇచ్చే ద్రవ్యాలను ‘హవ్యము’లని, పితృదేవతలకి ఇచ్చేవి ‘కవ్యము’లని అంటారు. హవ్యములు ఇచ్చేప్పుడు ‘స్వాహా’ అని, కవ్యములు ఇచ్చేప్పుడు ‘స్వధా’ అని అంటారు. మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినప్పుడు మాటామంతీ లేకుండా తినుబండారం ఏదైనా పెడితే అతడు ముట్టలేడు. ‘తీసుకోండి’ అని మర్యాదగా అన్నప్పుడు అతడు సంతోషంగా స్వీకరిస్తాడు. అదే విధంగా, ‘స్వాహా’ అంటే దేవతలు స్వీకరిస్తారు. ఎందుకంటే, స్వాహారూపంతో అమ్మవారు దేవతలకు తిండి పెడుతుంది.
భూమిపై మానవులు క్షేమంగా ఉండటానికి మన ఋషులు ఏర్పాటు చేసిన గొప్ప వ్యవస్థ ‘యజ్ఞం’. వారు తమ తపోశక్తితో కనుగొన్నదే యజ్ఞవిజ్ఞానం.

యజ్ఞం చేసి దేవతలను సంతృప్తి పరిస్తే వారు మానవులను అనుగ్రహిస్తారు. ఒకప్పుడు దేవతలంతా తిండి లేక ‘బ్రహ్మసభ’కు వెళ్ళి ప్రార్థించారట. బ్రహ్మ ‘బ్రాహ్మణయజ్ఞంలో మీ భోజనం ఏర్పాటుచేశానని’ చెప్పాడట. అప్పటికీ వీరికి ఆ ‘హవనం’ లభించేది కాదు. అప్పుడు విష్ణువు ఉపదేశం మేరకు మూలప్రకృతిని ఉపాసించాడు బ్రహ్మ. ఆ ప్రకృతిమాత కళతో అగ్నిహోత్రుడి అర్ధాంగిగా, అతడి దాహకశక్తిగా స్వాహాదేవి అవతరించింది. అందుకే, స్వాహా సహాయం లేనిదే ఆహుతులను భస్మం చేయలేడు అగ్ని. మంత్రాల చివర ‘స్వాహా’ అంటూ హవన పదార్థాలను యజ్ఞహోత్రునికి అర్పిస్తే అవి అనాయాసంగా దేవతలకు అందుతాయి. పూర్వం బ్రాహ్మణులు ఇచ్చే కవ్యములు వారి పితృదేవతలకు అందేవి కావు. దాంతో పితృదేవతలు ఆకలితో ఆరాటపడి బ్రహ్మకు మొర పెట్టుకొంటారు. విద్యా, గుణం, రూపం, బుద్ధి.. అన్నీ కలిగిన అందమైన మానస కన్యని వారికోసం బ్రహ్మ పుట్టించాడు. ఆమె పేరు స్వధ. పితరులకు ఆమెను భార్యను చేశాడు బ్రహ్మ. శ్రాద్ధమంత్రాల చివర ‘స్వధా’ చేర్చాలన్న రహస్యం అప్పుడు బ్రాహ్మణులకు తెలిపాడు. ఈ విధంగా దేవతలకు ‘స్వాహా’ మంత్రాలతో, పితృదేవతలకు ‘స్వధా’ మంత్రాలతో హవ్య కవ్యములు అర్పించటం ఆచారమైంది.

- Advertisement -

పితృదేవతలపట్ల నిర్లక్ష్యం చాలా ప్రమాదం. దేవతా పూజనైనా మానవచ్చునేమో కానీ, పితృదేవతల ఆరాధన విడువరాదు. పితృదేవతలు అంటే, తండ్రి, తాత, ముత్తాతలే కారు. దేవతా గణాలవలె పితృదేవతలు 33 గణాలుగా ఉంటారు. ‘మహాభారతం’లోని ‘హరివంశం’లోతోపాటు ‘అగ్ని పురాణం’లోనూ ఈ పితృదేవతల గురించిన అద్భుత వివరాలున్నాయి. ‘మనం చేసే పూజలు (కవ్యములు) వారికి అందుతాయా?’ అంటే, వారివల్ల కలిగిన మన శరీరాలు ప్రాణంతో వున్నంత కాలం వారిని స్మరించుకోవడం మన ధర్మమేకాదు, బాధ్యతకూడా. మనం చేసే కర్మలను చూసి పితృదేవతలు ఆనందిస్తారు. మన తండ్రి తాతలు స్వర్గంలో ఉంటే అమృతంగా, ఒకవేళ మనం మళ్లీ మానవులుగా జన్మిస్తే అన్నంగా, పశువులుగా పుడితే గడ్డిగా మనం ఇచ్చే పదార్థాన్నే మార్చి తిరిగి మనకే ఇస్తారట. అలా మన శ్రేయస్సును కోరేవారికి తృప్తిని కలిగించే మంత్రమే ‘స్వదా యే నమః’. పరమ పవిత్రమైన ఈ మంత్రాన్ని పఠించగలిగితే సర్వతీర్థాల్లో స్నానం చేసినంత గొప్ప ఫలం లభిస్తుంది. అలాగే, స్వాహాదేవి ఆరాధనవల్ల ఇహపర సౌఖ్యాలు, సకల శుభాలు సిద్ధిస్తాయి.

వేముగంటి శుక్తిమతి
99081 10937

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స్వాహా, స్వధా దేవతల దీవెనలు
స్వాహా, స్వధా దేవతల దీవెనలు
స్వాహా, స్వధా దేవతల దీవెనలు

ట్రెండింగ్‌

Advertisement