e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home చింతన అతిథి మర్యాదల గొప్పతనం

అతిథి మర్యాదల గొప్పతనం

‘అన్ని దానాలలోకీ అన్నదానమే శ్రేష్ఠమైందని’ మన సనాతన భారతీయులు మనస్ఫూర్తిగా నమ్మి ఆచరించారు. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు. సృష్టిలో ప్రతి జీవి జీవించేది అన్నం (ఆహారం)తోనే. కృత, త్రేత, ద్వాపర యుగాల్లో శరీరం శిథిలమైనా ప్రాణం నిలిచే ఉండేది. తపస్సుతో కేవలం ఎముకల గూడుగా మిగిలిన దధీచి, శరీరం మొత్తం పుట్టలో మునిగిపోయిన వాల్మీకి, పదివేల యేండ్లు ఒంటికాలిపై తపస్సు చేసిన భగీరథుడు.. మొదలైన వారంతా అన్నపానీయాలు లేకుండా ఎంతోకాలం బతికినవాళ్ళే. కలియుగంలో జీవులన్నీ అన్నగత ప్రాణులే. నీరు, అన్నం లేకుండా మనం బతకలేం. బాల్యంలో తల్లిదండ్రులు శిశువులను రక్షిస్తే, గురుకులంలో బ్రహ్మచారులకు గురుదంపతులు భోజనాలు పెట్టి రక్షించేవారు. ప్రతి గృహస్థు విధిగా ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను సాక్షాత్తు విష్ణుస్వరూపంగా భావించి (అభ్యాగతః స్వయం విష్ణుః), ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’గా నివేదించడం మన సనాతన సంస్కృతిలోని గొప్పదనం. ఆకలితో ఉన్నవాని కడుపు నింపడం కన్నా పుణ్యకార్యం మరొకటి ఉండదు. పూర్వకాలంలో ఊరూరా యాత్రికుల కోసం ధర్మసత్రాలు వుండేవి. అన్ని దేవాలయాలలో అన్నసత్రాలూ ఉండేవి. ప్రతి ఇంట్లో ఏ వేడుక జరిగినా కుటుంబసభ్యులతోపాటు ఊరంతటికీ సంతర్పణ జరిగేది. గృహస్థధర్మంలో ప్రధానమైన కర్తవ్యం అతిథులు, అన్నార్తుల కడుపు నింపడమే.
బధిర పంగ్వంధ భిక్షుక బ్రహ్మచారి
జటి పరివ్రాజ కాతిథి క్షపణ కావ
ధూత కాపాలికాద్యనాథులకు కాన
భూసురోత్తమ గార్హస్త్యమునకు సరియె.

పెద్దన (మనుచరిత్ర)

- Advertisement -

‘అన్ని విధాల వికలాంగులకు, బిచ్చగాండ్లకు, అతిథులకు, బ్రహ్మచారులకు, సన్యాసులకు, సాధుసంతులకు, అవధూతలకు, అనాథలకు భోజనం పెట్టగల యోగ్యత ఒక్క గృహస్థాశ్రమానికి మాత్రమే ఉంది’. ఇదే ‘మనుచరిత్ర’లో ప్రవరుని ఇల్లాలు, ‘అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఇంటికి వచ్చిన ఎంతమంది అతిథులకైనా వండివార్చి తృప్తిగా భోజనం పెట్టే అన్నపూర్ణా దేవి. కాగా ప్రవరుడేమో, ‘తమ ఊరికి ఎవరైనా యాత్రికులు వచ్చారేమోనని ఎదురు చూసి, వచ్చినవారికి ఎదురేగి, ఇంటికి తీసుకొచ్చి అతిథి సత్కారాలు చేసి కమ్మటి భోజనం పెట్టి ఆదరించేవాడు’. ఇది వారి నిత్యకృత్యం.

‘ఆముక్త మాల్యద’లో శ్రీకృష్ణ దేవరాయలు చిత్రించిన ‘విష్ణుచిత్తుని’ అతిథి మర్యాదలైతే మరింత సుప్రసిద్ధం. ‘మహాభారతం’లో సక్తుప్రస్తుడు, రంతిదేవుడు మొదలైన మహానుభావులే కాకుండా ఈ కాలంలో మన మధ్యనే సంచరించిన డొక్క సీతమ్మ, జిల్లెళ్ళమూడి అమ్మ వంటి నిరతాన్నదాతలు నిత్యస్మరణీయులు. మన పూర్వ ఋషులు ‘అన్న వితరణ- స్వీకరణ’ గురించి గొప్ప ఆలోచనలు చేశారు. ‘క ఆశ్యాన్నః’ (ఎవరి అన్నం తినదగింది)? అన్న ప్రశ్నకు సమాధానంగా కణ్వ మహర్షి, ‘ఎవరు తినిపించాలనే కోరికతో ఉంటారో వారి అన్నమే తినదగింది’ అంటాడు. కౌత్సుడనే ఋషి, ‘ఎవరు పుణ్యాత్ములో, ధర్మాత్ములో వారిచ్చిన అన్నమే తినదగింది’ అంటాడు. ‘కేవలం పుణ్యాత్ముడు, ధర్మాత్ముడైతే చాలదు, అతనికి భోజనం పెట్టాలనే కోరిక ఉన్నవాడు ఇచ్చే అన్నాన్నే అంగీకరించాలని’ అపస్తంబుడనే ఋషి పేర్కొన్నాడు.
‘తినమని ఆహ్వానించని వారి ఇంటివిందుకు వెళ్ళకూడదు’ అని అంటాడు హారీత ముని. ‘శుభాశుభ కార్యాలలో ప్రీతితో ఎవరు తినమని ఆహ్వానించినా ఆరోగ్యవంతులైన వారు తప్పకుండా వెళ్ళి విందారగించాలని’ అంటాడు శుక్రాచార్యుడు. అగస్త్య మహర్షి ఇల్వలుని ఆతిథ్యం స్వీకరించడం, శ్రీరాముడు శబరి ఇచ్చిన ఫలాలను తినడం, శ్రీకృష్ణుడు పాండవుల రాయబారిగా వెళ్లి విదురుని ఇంట ఆతిథ్యం ఉండటం.. వంటి ఎన్నో సంఘటనలు మన పురాణేతిహాసాల్లో అతిథి మర్యాదల గొప్పతనాన్ని తెలియజెప్పాయి. ఒక్క మనుషులకేకాదు, సృష్టిలోని ఏ జీవికూడా ఆకలితో అలమటించకుండా కారుణ్య గుణంతో కాపాడటం మనుషులుగా మనందరి కర్తవ్యం.

మరుమాముల దత్తాత్రేయశర్మ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana