e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home చింతన నేడు శ్రీ చైతన్య మహాప్రభువు ‘అవతార పరిసమాప్తి’సంకీర్తనామృతం!

నేడు శ్రీ చైతన్య మహాప్రభువు ‘అవతార పరిసమాప్తి’సంకీర్తనామృతం!

నేడు శ్రీ చైతన్య మహాప్రభువు ‘అవతార పరిసమాప్తి’సంకీర్తనామృతం!

కలియుగంలో కొత్త భక్తి శకానికి నాంది పలికిన మహాపురుషుడు గౌరాంగుడు. ఇంతింతై విశ్వంభరుడై, సంకీర్తనా పితామహుడై, మహాకాంతిపుంజమై మానవాళిని మోక్షమార్గం వైపు నడిపించిన అవతార పురుషుడు. ‘గౌరాంగుడు’ అంటే ఎవరో కాదు, శ్రీ చైతన్య మహాప్రభువు. వారి ‘అవతార పరిసమాప్తి’ (నేడు) వేళ ఆయన గొప్పతనాన్ని తెలుసుకొందాం.

శ్రీ చైతన్య మహాప్రభువులవారు జగన్నాథపురి క్షేత్రంలో ఉన్నప్పుడు ఒకానొకసారి అద్వైతాచార్యులను పిలిచి, ‘ఏ విధమైన అర్హతలను, నిబంధనలనుగాని పరిగణించక ఈ హరినామ సంకీర్తనను ప్రతి ఒక్కరికీ ప్రసాదించండి’ అని సగౌరవంగా అభ్యర్థించారు. అదేలా నిత్యానంద ప్రభువుల వారినికూడా పిలిచి, ‘నువు గౌడదేశానికి (బెంగాల్‌) వెళ్ళి అనర్గళంగా కృష్ణ ప్రేమభక్తిని ప్రతి ఒక్కరికీ చేరనివ్వు’మని ఆజ్ఞాపించారు. శ్రీల ప్రభుపాదులవారు దీనిపై వ్యాఖ్యానిస్తూ, ‘కృష్ణప్రేమను అందరికీ పంచి పెట్టడమే శ్రీ చైతన్య మహాప్రభువుల సంకీర్తనోద్యమ లక్ష్యం’గా పేర్కొన్నారు.

- Advertisement -

ఒక భక్తుడు ఓసారి శ్రీల ప్రభుపాదులవారితో ‘గురుదేవా! శ్రీకృష్ణుడిని తెలుసుకోవటమే మానవజన్మ లక్ష్యం. ఈ సాధనలో మనమెందుకు ఇన్ని కష్టాలు పడుతుంటాం? కనిపించని ఈ ‘మాయ’ ఎందుకు మనల్ని నిత్యం పరాజితులను చేస్తుంది?’ అని ప్రశ్నించారు. అప్పుడు శ్రీల ప్రభుపాదులవారు ఇలా చెప్పారు- ‘అసలు మానవజన్మ లక్ష్యమే శ్రీకృష్ణుడిని తెలుసుకోవటం. ఇది గాఢంగా లేదు కాబట్టే, ఈ పరిస్థితి. శ్రీ కృష్ణుడిని తెలుసుకోవాలి, సేవించాలనే భావన తప్ప, మన మనసులో మరేమీ ఉండకూడదు. అప్పుడు మన కష్టాలన్నీ తొలగి ఆయన కరుణకు పాత్రులమవుతాం’.

శ్రీ చైతన్య మహాప్రభువుల అనుచరులలో ‘రాఘవ పండితుల’నే గొప్ప భక్తుడుండేవారు. ఆయన అర్చనామూర్తులకు పలు రకాల భోగ నివేదనలను ఎంతో భక్తిశ్రద్ధలతో సమకూర్చేవారు. ఆయనది భగవంతునిపట్ల విశుద్ధ ప్రేమ. వారి ఔన్నత్యాన్ని మహాప్రభువులవారే స్వయంగా ఇతర భక్తగణానికి చాటేవారు. రాఘవ పండితుల నిరంకుశ, నిష్కల్మష సేవను ఉదహరిస్తూ మహాప్రభువులవారు రెండు విషయాలను ఇక్కడ మనకు బోధిస్తున్నారు. ‘శ్రీకృష్ణునికి దేనినైనా నివేదించాలంటే మొట్టమొదటగా మనకు వుండవలసింది ప్రేమ. రెండవది శ్రద్ధ. రాఘవ పండితులు అత్యంత శ్రేష్ఠమైన అరటి, మామిడి, నారింజ, పనస మొదలైన పండ్లన్నిటినీ సమకూర్చేవారు. దూరగ్రామాల్లో ఏవైనా మరింత మంచిపండ్లు లభిస్తున్నాయంటే తగినంత మూల్యం చెల్లించి మరీ సమకూర్చేవారు. దాన్ని ఎలాగైనా కృష్ణునికి నివేదించాలని ఆరాటపడేవారు. ప్రతి చిన్న విషయంపైనా శ్రద్ధతో వ్యవహరించటం అన్నది మనలోని గాఢమైన ప్రేమకు నిదర్శం’.

భక్తునిలో వుండవలసిన ఔదార్యతత్వానికి పరాకాష్టగా నిలిచినవారే శ్రీ వాసుదేవదత్త. ‘మహాప్రభు భక్తులలో ఒకరైన వీరిని విశ్వంలోనే అనుపమానమైన ఔదార్యత్వానికి నిదర్శనమని’ కొనియాడారు శ్రీల ప్రభుపాదులు. తోటివారిపట్ల వీరు చూపిన కరుణ, ఉదార స్వభావాలు బహుశా చరిత్రలో మరొకరు చూపి వుండరు. నిత్యం వివిధ భక్తులకు పలు సదుపాయాలను సమకూరుస్తుండే ‘శివానందసేన’ అనే మరో భక్తుడితో మహాప్రభువులవారు చెప్పారిలా. ‘వాసుదేవదత్త పరమ ఉదారుడు. ప్రతి దినం తాను అర్జించిన మొత్తాన్ని ఆ రోజే ఇతరులకోసం ఖర్చు చేసేస్తాడు. తన కోసమంటూ ఏదీ దాచుకోడు’.

వాసుదేవదత్త గృహస్థుడైనందువల్ల ఎంతో కొంత ధనం మిగుల్చుకోవలసి వుంటుంది. కానీ, తానలా చేయక పోవటం వల్ల తన కుటుంబాన్ని పోషించుకోవటమే ఎంతో ఇబ్బందిగా పరిణమించింది. ఆయన పరమ ఔదార్యత్వ గుణం, గృహస్థు ధర్మానికి ఇబ్బంది కలిగిస్తున్న సంగతిని గుర్తించిన మహాప్రభువులవారు దాన్ని సరిదిద్దేందుకూ ప్రయత్నించారు. గతంలో వాసుదేవదత్తకు తన కోసమూ ఎంతో కొంత మిగుల్చుకొమ్మని ఎంతమంది చెప్పినా ‘ఇతరుల కష్టాలు చూసేసరికి’ తన ఉదారత్వాన్ని విడనాడలేక పోయేవాడు. అందుకే, ఈసారి మహాప్రభువు శివానందసేనకు వాసుదేవదత్తను అప్పగించి ఇకపై వారి లావాదేవీలన్నీ తానే చూసుకోవలసిందిగా చెప్పాడు. ఇదీ చైతన్యమహాప్రభువు చూపిన మార్గం.

‘కులీన’ అనే గ్రామవాసులంటే శ్రీ చైతన్య మహాప్రభువులవారికి ఓ ప్రత్యేకమైన అభిమానముండేది. అక్కడ నివసించే ‘గుణరాజఖాన్‌’ అనే భక్తుడే ఇందుకు కారణం. గుణరాజఖాన్‌ రచించిన ‘శ్రీకృష్ణ విజయ్‌’ అనే గ్రంథం పట్ల మహాప్రభువులవారు ఎంతో ప్రసన్నులయ్యారు. అందులో అమితంగా మహాప్రభువుల హృదయాన్ని దోచుకొన్న ‘నందనందన కృష్ణ మోర ప్రాణనాథ్‌’ అన్న ఒక్క వాక్యాన్నే పదేపదే భక్తులతో ప్రస్తావిస్తూ, గుణరాజఖాన్‌ భక్తి ప్రపత్తులను ప్రశంసించేవారు. కేవలం ఈ ఒక్క వాక్యంతోనే ఆ గ్రామంలోని ప్రజలేకాదు, అక్కడ నివసించే శునకాలూ తనకు అత్యంత ప్రీతిపాత్రం అయ్యాయని మహాప్రభువులవారు సెలవిచ్చారు. శ్రీకృష్ణునిపట్ల జీవునికి వుండవలసిన ప్రేమ ఇంతటిది.

శ్రీకృష్ణప్రేమను పొందేందుకు మహాప్రభువులవారు లోకానికి అందించిన పరమోన్నత సాధనం ‘హరేకృష్ణ’ మహామంత్రం. ‘హరే కృష్ణ హరే కృష్ణ! కృష్ణ కృష్ణ హరే హరే! హరే రామ హరే రామ! రామ రామ హరే హరే!’. అప్పట్లో ‘జగన్నాథ రథయాత్ర’ జరుగుతుండగా నృత్య సంకీర్తనల్లో మైమరచి గానం చేస్తున్న భక్తులను చూసిన ప్రతాపరుద్ర మహారాజు ఆశ్చర్యపడ్డారు. సార్వభౌమ భట్టాచార్యులను ఉద్దేశించి, ‘ఏమిటీ నృత్య సంకీర్తనలు? ప్రకాశవంతమైన ముఖకవళికలతో వెలిగిపోతున్న ఈ భక్తులంతా ఎవరు? ఇంతటి కమనీయ హరినామ సంకీర్తనను కనీవినీ ఎరుగమే’ అన్నారు. సార్వభౌమ భట్టాచార్యులు బదులిస్తూ, ‘ఇది శ్రీచైతన్య మహాప్రభువులు లోకానికి అందించిన ప్రేమ సంకీర్తనం’ అన్నారు. కలియుగంలో మనుషుల హృదయ మాలిన్యాన్ని పోగొట్టగల అద్భుతమంత్రం ఇదే మరి.

బ్రహ్మహత్యా పాతకాలవంటి పాపాలనైనా హరినామ సంకీర్తనలు మటుమాయం చేస్తాయి. చీకట్లోకి సూర్యకిరణాలు చొచ్చుకు పోయినట్టు మానవాళికి ఇవి గొప్ప జ్ఞానమార్గాన్ని చూపుతాయి. ఇంతటి మహోన్నత ఉపకరణాన్ని మనకు అందించిన అవతార ప్రేమమూర్తి శ్రీచైతన్య మహాప్రభువులు. నితాయ్‌-గౌరాంగ చూపిన అత్యున్నత ఆధ్యాత్మిక మార్గాన్ని, బోధనలను అందరికీ చేరవేశారు భక్తి వేదాంతస్వామి శ్రీల ప్రభుపాదులవారు. మహాప్రభువులవారి ‘అవతార సమాప్తి’ వేళ ఈ ఆరాధనలోని మాధుర్యాన్ని అందరం ఆస్వాదిద్దాం.

ఇదే మన యుగధర్మం!
శ్రీచైతన్య మహాప్రభువులవారు కొలువైవున్న దేవాలయంలో ఎప్పుడూ మృదంగ, కరతాళాలతో హరినామ సంకీర్తనలు ప్రతిధ్వనించేవి. ఎందుకంటే, ప్రస్తుత కలియుగానికి ఇదే యుగధర్మం. కాసేపు భక్తులతో కలసిపోయి, శ్రీకృష్ణుని ముందు నృత్య సంకీర్తనల్లో పాల్గొన్నంత మాత్రానే మన మనస్సు తేలికవుతుంది. అప్పటి వరకు ఉన్న ‘నేనే’ అన్న అహమిహ భావనలన్నీ అణచి వేయబడి, వినమ్రత అంకురిస్తుంది. హరినామ ప్రభావం మొదలయ్యిందనటానికి ఇవే సంకేతాలు.

శ్రీమాన్‌ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ
93969 56984

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నేడు శ్రీ చైతన్య మహాప్రభువు ‘అవతార పరిసమాప్తి’సంకీర్తనామృతం!
నేడు శ్రీ చైతన్య మహాప్రభువు ‘అవతార పరిసమాప్తి’సంకీర్తనామృతం!
నేడు శ్రీ చైతన్య మహాప్రభువు ‘అవతార పరిసమాప్తి’సంకీర్తనామృతం!

ట్రెండింగ్‌

Advertisement