గురువారం 04 మార్చి 2021
Devotional - Jan 16, 2021 , 21:58:13

శ్రీశైలంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరోరోజు ఆలయంలో రుద్రహోమం, పూర్ణాహుతి, కళశోద్వాసన, త్రిశూలస్నానం, మహదాశీర్వచన పూజాలు జరిపించారు. ఉత్సవమూర్తులకు మల్లికాగుండంలో వైదిక శాస్త్రోక్తంగా అవబృదస్నానం చేయించిన అనంతరం వసంతోత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చతుర్వేదసభ, ఘనస్వస్థి కార్యక్రమాలు నిర్వహించారు.

తెలుగు రాష్ట్రాల ప్రధాన ఆలయాల నుంచి వచ్చిన వేదపండితులు సామవేదం, ఋగ్వేదం, అదర్వణవేదం, యజుర్వేద పఠనం చేశారు. సామాన్యులకు సైతం వేద సారాలు అర్ధమయ్యేలా వేదసభ నిర్వహించడంపై భక్తులు హర్షం వ్యక్తంచేశారు. పండితులకు స్వామి అమ్మవార్ల శేషవస్త్రంతోపాటు నూతన వస్త్రాలు ఇచ్చి సత్కరించినట్లు స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు. ఉత్సవాల్లో ఆఖరిరోజైన ఆదివారం స్వామిఅమ్మవార్లను అశ్వవాహనంపై అధిష్టింపజేసి ప్రాకారోత్సవం.. పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహించనున్నట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.

శ్రీశైల ఖండం పుస్తకావిష్కరణ..

పురాణ ఇతిహాసాల్లోని శ్రీశైల క్షేత్ర వైభవాన్ని సామాన్య భక్తులకు అర్ధమయ్యేలా అనువదించిన శ్రీశైల ఖండం పుస్తకాన్ని వేదపండితుల సమక్షంలో ఆవిష్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా భక్తులకు ఈ పుస్తకం అందేలా చర్యలు తీసుకుంటామని శ్రీశైలప్రభ సంపాదకుడు అనిల్ కుమార్ తెలిపారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo