e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home News జీవాత్మకు, పరమాత్మకు మధ్య..!

జీవాత్మకు, పరమాత్మకు మధ్య..!

జీవాత్మకు, పరమాత్మకు మధ్య..!

మానవుల కష్టాలను మూడు విభాగాలుగా చెప్పారు మన పూర్వులు. వానిని ‘తాపత్రయ’మంటారు. మనిషిని తపింపజేసేవి తాపములు. ఆధిభౌతికం, ఆధిదైవికం, ఆధ్యాత్మికం అన్నవే ఆ కష్టాలు. ‘ఆధి’ అంటే ‘పీడ’ అని అర్థం. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం- ఈ పంచభూతాలు ప్రకోపించినప్పుడు ఏర్పడే విపరీతాలను తట్టుకోలేక మనిషి అల్లల్లాడిపోయే పరిస్థితి ఆధిభౌతికం. ప్రారబ్దకర్మల ఫలంగా ఆయా అధిదేవతలు మనలను పెట్టే కష్టాలు ఆధిదైవికాలు. ‘అధ్యాత్మ అంటే ఏమిటి?’ అన్న అర్జునుని ప్రశ్నకు, ‘స్వభావః’ అని సమాధానం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ‘ఈ శరీరం లోపల ఉన్నదేమిటి?’ అంటే ‘పరమాత్మ అంశ’ అని సమాధానం. ఈ పరమాత్మాంశను ‘పురుషుడు’ అని కూడా అంటారు. ‘పురి శరీరే శేత ఇతి పురుషః’ అంటుంది ‘అమరకోశం’. పురమనగా శరీరం. అందుండువాడు గనుక పురుషుడు. పరమాత్మ పురుషోత్తముడు కనుక పరుషోత్తమాంశను దేహంలో కలిగి ఉన్న మనమంతా పురుషోత్తములమే. పురుషోత్తమ నామానికి అనుగుణంగా మనలను మనం మలచుకోవడమే ‘ఆధ్యాత్మికత’.
భారతీయ సంప్రదాయంలో ఆధ్యాత్మిక చింతన స్థూలంగా మూడురకాలు (ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం). మధ్వాచార్యులు, ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులను ద్వైతాద్వైత విశిష్టాద్వైత భావనలకు మూలకందాలుగా గుర్తెరిగి, పూజిస్తున్నాం. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. తన లీలావిలాసం కోసం ప్రకృతికి వలెనే పరమాత్మ జీవుణ్ని సృజించాడు. మానవుడు బుద్ధిజీవి గనుక పరమాత్మను సేవించి, ఆయన అనుగ్రహానికి పాత్రుడై నిరంతరమూ పరమాత్మ సన్నిధిలోనే ఉండేలా చూసుకోవాలి. పాపకృత్యాల వల్ల మనిషి పరమాత్మకు దూరమవుతాడు. కనుక, సత్కర్మాచరణమే పరమావధిగా జీవించాలి. ఇది ద్వైతం. కుండగా మారినంత మాత్రాన మట్టి మట్టి కాకుండా పోతుందా! ఒకానొక రూపాన్ని ధరించినందున దాన్ని ‘కుండ’ అంటున్నాం. రూపాన్ని ధరించక ముందు అది మట్టి మాత్రమే. కుండ పగిలి ముక్కలైనాక అది ఏ మట్టి నుంచి వచ్చిందో అందులోనే కలిసిపోతుంది. ఆకాశం ఉన్నందువల్లే సమస్త జీవజాలం ఉనికికి అవకాశం ఏర్పడింది. కుండ లోపల కూడా ‘ఆకాశము’న్నందువల్లే దానిలో నీరు నింపుకొన గలుగుతున్నాం. కుండకు బయట ఒక ఆకాశం, లోపల మరొక ఆకాశం ఉన్నట్లుగా భ్రాంతి కలుగుతున్నది. కుండ పగిలిపోతే మిగిలేది రెండు ఆకాశాలు కాదు, ఒక ఆకాశమే. ఇది జీవాత్మ పరమాత్మలకు చెందిన అద్వైత భావన. మానవ దేహంలో ప్రవేశపెట్టబడిన పరమాత్మాంశ విష్ణుమాయ కారణంగా తనను తాను పరమాత్మకు భిన్నంగా భావించుకొని, తన ఇచ్ఛానుసారం వర్తించడం మొదలుపెడుతుంది. ఈ కారణంగా ఏర్పడిన సంచిత ప్రారబ్దాలను అనుభవించడమే మానవ జీవనం. సంచిత ప్రారబ్దాలను అధిగమించేందుకు మానవుడు ప్రయత్నించే విధానమే భగవదర్చనం. ఈ పద్ధతిలో సామీప్య, సాలోక్య, సారూప్యాలను సాధించిన జీవుడు చిట్టచివరకు సాయుజ్యాన్ని పొందుతాడు. జీవాత్మ పరమాత్మలో కలిసిపోవడమే సాయుజ్యం. ఇది విశిష్టాద్వైతం.
జీవుని శరీరంలోకి ప్రవేశించిన పరమాత్మ అంశను ‘జీవాత్మ’ అంటున్నాం. పరమాత్మ జీవాత్మగా మారే సందర్భంలో ఏ దేహంలో నివాసం ఉండేందుకు తాను వెళ్తున్నాడో ఆ దేహానికి చెందిన జీవ నిర్వహణకు మాత్రమే సరిపడేంత పరిజ్ఞానానికి పరమాత్మ తనను తాను ఇష్టపూర్తిగా కుదించుకుంటాడు. అందువల్లే, జీవాత్మకు తానే పరమాత్మననే స్పృహ ఉండదు. దీన్ని అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నమే ‘యోగసాధన’. ఒకసారి అనుభవంలోకి వచ్చిన ఈ స్పృహను కోల్పోకుండా నిలుపుకోవడమే ‘పూర్ణయోగం’. ఇది సిద్ధించిన వ్యక్తి తాను చేసే ప్రతి పనినీ పరమాత్మకు వలెనే చేస్తాడు. ‘పరమాత్మను పొందేందుకు ఈ దేహాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు’ అంటూ ద్వైతాద్వైత విశిష్టాద్వైతాలను సమన్వయం చేసిన మహర్షి శ్రీ అరవిందులు ప్రబోధించారు.

జీవాత్మకు, పరమాత్మకు మధ్య..!

Advertisement
జీవాత్మకు, పరమాత్మకు మధ్య..!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement