e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home చింతన అనంత పుణ్యప్రదం అక్షయ తృతీయ

అనంత పుణ్యప్రదం అక్షయ తృతీయ

అనంత పుణ్యప్రదం అక్షయ తృతీయ

వైశాఖ శుక్ల తదియనే ‘అక్షయ తృతీయ’గా జరుపుకొంటాం. ఇది పరమధార్మిక పుణ్యదినం. ఈ రోజు ఏ పుణ్యకార్యం చేసినా అది వారి ఒక్క జన్మకే పరిమితం కాకుండా జన్మజన్మలకూ ఉండిపోతుందని ‘మత్స్యపురాణం’, ‘స్మృతులూ’ పేర్కొన్నాయి. ‘కృతయుగం’లో అక్షయ తృతీయే ఉగాది. ఇదే రోజు శ్రీపరశురాముడూ ఆవిర్భవించాడు. ఇంకొక విశేషం శ్రీకృష్ణ పరమాత్మ రేపల్లెని వదిలి, కంసుని వధకై మధురా నగరంలోకి అడుగుపెట్టింది కూడా ఈరోజే. అక్షయ తదియనాడు ప్రజాపతి ఓషధుల అధికారాన్ని చంద్రునికి ఇచ్చాడు. ‘ఋగ్వేదం’ ప్రకారం లక్ష్మీదేవి ప్రజాపతి ద్వారా ‘మిత్రవింద యజ్ఞం’తో 12 శక్తులను పొందింది. ఆమెకు సర్వశక్తులనూ ప్రజాపతి ద్వారా సంక్రమింపజేసిన రోజుగానూ దీన్ని వేద పండితులు చెప్తారు. అందుకే, ఈ రోజున లక్ష్మీదేవిని, ‘లక్ష్మీ-కుబేరుల’ను ఆరాధించాలి.
ఒకసారి పార్వతీదేవి, శివునితో ‘మానవులు సర్వశుభాలు పొందడానికి ఏదైనా మార్గం ఉందా?’ అని అడిగిందట. దానికి శంకరుడు, ‘వైశాఖమాసం శుక్లపక్ష తదియనాడు భగవత్‌ ధ్యానం, ఉపవాసం చేస్తే ప్రతి పనీ నెరవేరుతుందని’ చెప్పాడు. తత్ఫలితంగా అక్షయ ఫలితం లభిస్తుందని ‘మత్స్య పురాణం’ పేర్కొన్నది. ఆ రోజు ప్రజాపతి ఈ తిథిలో కొలువై ఉంటాడు. విశాఖ నక్షత్రం అగ్నిదేవత ప్రధానమైంది. రోహిణి నక్షత్రానికి ప్రజాపతి అధిదేవత. తదియ అంటేనే సాక్షాత్‌ పరమాత్మకు ప్రతీక. సృష్టి అంతటికీ మూలకారణమైందే మనలనూ రక్షిస్తుంది. అగ్ని బీజాక్షరం శ్రీ (లక్ష్మి) కూడా. కనుక, ఈరోజు అగ్నిని, లక్ష్మీదేవిని, ప్రజాపతిని విధిగా అర్చించాలి. ఏ కొంచెం దానం, జపం, యాగం చేసినా అవి అక్షయమైన ఫలితాలనిస్తాయని శాస్ర్తాలు చెప్తున్నాయి. ఒకప్పుడు (ఋతువులు సక్రమంగా ఉండే రోజుల్లో) చైత్ర-వైశాఖ మాసాలు వసంత ఋతువులు. వైశాఖ పూర్ణిమ నుంచి ఎండలు తీవ్రంగా ఉండేవి. ఆ వేడిని తట్టుకోగలిగే వాటిని అక్షయ తదియనాడు దానం చేయడం వల్ల అంతులేని పుణ్యం లభిస్తుందని శాస్ర్తాలు చెప్పాయి. చెప్పులు, గొడుగులు, చల్లని మంచినీళ్లు వంటివి దానం చేసే సంప్రదాయం అలా ఏర్పడింది. భద్రాచలంలో ఈ ఎండకాలంలో జరిగే ‘శ్రీసీతారాముల కల్యాణం’ సందర్భంగానూ కొందరు భక్తులు ‘తాటాకు విసనకర్రలు’ అందరికీ పంచడం గమనార్హం. వేడి అన్నంలో పెరుగు వేసుకొని తింటే ఎంతటి శరీర ఉష్ణమైనా చల్లబడుతుంది. కనుక, అన్నదానమూ విశేష ఫలాన్నిస్తుంది.
మట్టికుండలో చల్లనీళ్లలో లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలను వేసి దానం చేయాలి. ఫలితంగా, ఏ ప్రాణిగా ఏ శరీరంలోకి వెళ్లినా ఆ జీవికి తాగునీళ్లకు లోటుండదని శాస్త్రవచనం. వారు ఏ జన్మలో అయినా తను కడుపునిండా తిని, నలుగురికి పెట్టగలిగే స్థితిలోనూ ఉంటారట. వస్ర్తానికి తమకు లోటు రాకూడదని కోరుకునేవారు ఈ తిథినాడు కొత్త వస్ర్తాలు దానం చేయాలి. శక్తి గలవారు బంగారం దానం చేసినా ఎంతో పుణ్యం. అక్షయ తృతీయనాడు ఎంతో కొంత బంగారం కొనుక్కోవడం వల్ల పాపం తొలగుతుందన్న విశ్వాసమూ ఉంది. ప్రత్యేకించి ఈ శుభవేళ నీళ్ల దానం కోసం చలివేంద్రాలు ప్రారంభిస్తారు. ఆలయాల్లో దేవతామూర్తులకు తెల్లని వస్ర్తాలు ధరింపజేయడమే కాక వాటిని దానం చేయడమూ సంప్రదాయంగా వస్తున్నది. పితృదేవతల పిండ ప్రధానంలో గతంలో జరిగిన పలు లోపాలను ఇవాళ సవరించుకోవచ్చునని కూడా వేద పండితులు అంటారు.

అనంత పుణ్యప్రదం అక్షయ తృతీయ
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అనంత పుణ్యప్రదం అక్షయ తృతీయ

ట్రెండింగ్‌

Advertisement