e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home చింతన రూపు దాల్చిన రౌద్రం!

రూపు దాల్చిన రౌద్రం!

రూపు దాల్చిన రౌద్రం!

‘దక్ష చరిత్ర’ ‘ధర్మ’ పురుషార్థాన్ని వ్యతిరేక ముఖంగా వ్యాఖ్యానించేదని ప్రారంభంలోనే చెప్పుకొన్నాం. అంతటికి ఆధారం ఆదిదేవుడే కనుక ధర్మం ఫలించాలన్నా ఆయన ఆశ్రయం, అనుగ్రహం అనివార్యం. దైవాన్ని దూషించి చేసే ధర్మం అధర్మమే, అఫలమే.

‘దైవీ బలే దుర్బలే’- ఎంత బలవంతుడైనా దైవబలం లోపిస్తే దుర్బలుడే! జగన్నాథుడు అనుకూలుడైతే జగత్తంతా అనుకూలమే! కర్మఫలం కూడా ‘ఈశ్వర’ కృపకు అధీనమే. రజస్సు, సత్తం, తమస్సు- ఈ మూడు గుణాలనుబట్టి భగవంతుడు మూడు రూపాలు- బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా మూర్తీభవించి ఉన్నా ముగ్గురిలో ఉన్న భగవత్తం- ఈశ్వరత్వం ఒకటే. ఉపాధులు వేరుగా ఉన్నా ఉపహిత చైతన్యం ఒకటే. కాన, త్రిమూర్తులలో ఎవరిని తిరస్కరించినా అది ముగ్గురినీ తృణీకరించినట్లే అవుతుంది.

- Advertisement -

అపత్యం- సంతానం, కొరకు అత్రి మహర్షి సర్వలోకాలకు అధీశ్వరుని ఆరాధించగా ఆయన ముందు త్రిమూర్తులు ఆవిర్భవించారు. ‘మహనీయులారా! నేను అర్చించింది ఒక్కడినైతే మీరు ముగ్గురు విచ్చేశారు. నాకెంతో అచ్చెరువుగా ఉంది. నేను పిలిచిన మహాత్ముడు మీలో ఎవరో సెలవియ్యండి’ అని అత్రి అర్థించాడు. ‘మహర్షీ! మేము లెక్కకు ముగ్గురమైనా నిక్కముగా- నిజానికి ఒక్కరమే’ అన్నారు త్రిమూర్తులు.

ఈ సిద్ధాంతానికి దృష్టాంతమే దక్ష చరిత్ర. మహిమ్న స్తోత్రంలో ‘క్రియాదక్షోదక్షః’ అన్న పుష్పదంతుని మాటను భాగవత వ్యాఖ్యాతృ చక్రవర్తి అయిన శ్రీధరాచార్యుడు ‘క్రియా అదక్షః’ అని పద విభాగం చేసి- ‘ధర్మాచరణంలో దక్షుడు దక్షత లేనివాడు’ అని వ్యాఖ్యానించాడు. ఈ అర్థమే అన్వర్థ- సార్థక, మయింది.

దక్షుని యజ్ఞం నిటలాక్షుని (శివుని) పట్ల నిర్లక్ష్యంతో నిండిన కక్ష యజ్ఞం. దాని ఆశయం సర్వజన సంక్షేమం కాదు, స్వీయ అహంకార, ఆడంబర సంరక్షణం! సతి-శర్వాణి, శ్రద్ధా స్వరూపిణి. విశ్వపతి, పశుపతి విశ్వాసరూపుడు. శ్రద్ధా విశ్వాసాలు లేని యజ్ఞ, దాన, తపస్సులు వ్యర్థాలని గీతా పరమార్థం.

సతీదేవి ఆత్మాహుతికి హతాశులై సభికులంతా హాహాకారాలు చేశారు. క్రతుభూమి ‘కనఖల’మంతా కకావికలై కలకలం రేగింది. వికల మనస్కులైన సకల జనులు “వీడు దుష్టుడు, పరమ నికృష్టుడు. ‘పాఱుడె వీడు పాతకుడు’- ఈ పాపాత్ముడు పేరుకే పాఱుడు- బ్రాహ్మణుడు. వీడి కీర్తి కళంకిత మవుతుంది, వీడి బ్రతుకు బండలవుతుంది, వీడి బొంది నిందల పాలవుతుంది, (ఈ నీచుడికి నిరయం- నరకం నిశ్చితం)”- అంటూ దక్షునికి శాపనార్థాలు దట్టించారు.

సతి ప్రాణత్యాగానికి ప్రతీకారంగా ప్రమథగణాలు దక్షుని దండించడానికి ఉత్సాహంతో ఉరికాయి. వెంటనే అధ్వర్యుడు భృగు మహర్షి కావించిన అభిచార హోమం నుంచి ఆవిర్భవించిన ‘ఋభువులు’ అనే దేవతలు అభవుని (శివుని) అనుచరులను ఆదరించి పారదోలారు. దాక్షాయణి దేహత్యాగ వృత్తాంతాన్ని నారదముని వలన విని ఆగ్రహోదగ్రుడై క్షుద్రుడైన దక్షుని శిక్షించడానికి వీరభద్రుని సృష్టించబూనిన రుద్రుని ఉగ్రస్వరూపాన్ని- శార్దూలాసుర (వ్యాఘ్రాసుర-పెద్దపులి రూపంగా ఉన్న రాక్షసుడు) భంజకుడైన శర్వుని (శివుని) శౌర్యాన్ని, శార్దూల వృత్తంలో అమాత్యుడు పోతన ఆలంకారిక శైలిలో రౌద్రరస వ్యంజకంగా ఇలా అద్భుతంగా రూపు దిద్దాడు-
‘సృష్టికి పూర్వమే ఉన్న మహాసత్త- పరతత్తం యొక్క వ్యక్త రూపం కనుక ఆద్యుడు- ఆదిదేవుడు, అత్యంత ఉగ్రస్వభావుడు, అసిత(నీల) కంఠుడు, గజాసుర మర్దనుడైన అగజా(పార్వతీ) పతి మహేశ్వరుడు పెదవి కొరుకుచు మదించిన మృగరాజు వలె గర్జించాడు. వికటంగా విశంకట అట్టహాసం చేశాడు. మెరుపు(విద్యుత్‌) తీగల వంటి అగ్నిజ్వాలలతో ఉజ్జలమైన ఒక జడను తన కపర్దం (జటాజూటం)లోంచి కోపంతో పీకి నేలమీద విసరి కొట్టాడు విరూపాక్షుడు.’
(సశేషం)

శా.ఆద్యుం డుగ్రుడు నీలకంఠు డిభ దైత్యారాతి దష్టోష్ఠుడై
మాద్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్‌ నవ్వుచున్‌
విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్‌ వెల్గొందు చంచ జ్జటన్‌
సద్యః క్రోధము తోడ బుచ్చివయిచెన్‌ క్ష్మాచక్ర మధ్యంబునన్‌.’

రూపు దాల్చిన రౌద్రం!తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రూపు దాల్చిన రౌద్రం!
రూపు దాల్చిన రౌద్రం!
రూపు దాల్చిన రౌద్రం!

ట్రెండింగ్‌

Advertisement