శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Devotional - Feb 22, 2021 , 00:07:55

పరమాత్మ తత్తం!

పరమాత్మ తత్తం!

పుణ్యపాపాల స్వరూప స్వభావాలు వాటి ఫలాలైన సుఖదుఃఖాల గురించి వైదిక ఋషులు చేసినంత సూక్ష్మ సమీక్ష ప్రపంచంలో మరెవ్వరూ చెయ్యలేదు. సనాతన ధర్మంలో ‘కర్మ సిద్ధాంతం’ అప్రతిహతం- తిరుగులేనిది. మంచి చెడ్డల ఫలాలు విడివిడిగాను, విరుద్ధంగాను ఉంటాయి. ఎన్నటికైనా ఎంతవారికైనా అనుభవించక తప్పదు. రామ, కృష్ణాది అవతార పురుషులకే కర్మ ఫలానుభవం తప్పలేదు. ఇతరులకు దుఃఖం కలిగించేవాడు తప్పక దుఃఖం పొందుతాడు. కాన, దుఃఖం కల్గించే కర్మల జోలికి పోకుండా ఉండటమే మొక్కవోని దుఃఖ నివారణ ఉపాయం.

తర.‘సతతమున్‌ సరసీ రుహోదర సత్కథామృత పూరమున్‌ శ్రుతి పుటాంజలి చేత నిమ్ముల జుఱ్ఱియుం దనివోదు భారత కథామిష మూని విష్ణు బరాశర ప్రియ సూతి సన్మతి నుతించిన చోట సన్మునినాథ నా మది నుబ్బుదున్‌.’

శ్రీశుక ఉవాచ- జిజ్ఞాసువైన విదురుడు సుజ్ఞాని అయిన మైత్రేయునితో ఇంకా ఇలా అన్నాడు-ఓ మునినాథా! శ్రీమన్నారాయణుని పవిత్ర చరిత్ర వింటేనే కాని జనన మరణాది సమస్త దుష్కార్యాలకు, దుఃఖాలకు అనుబంధాలయిన ఈ భవ(సంసార) బంధాలు తెగవు. మహర్షీ! నేను వేదవ్యాసుల ముఖతః ధర్మాలను వినీవినీ విసిగి ఉన్నా. మనసుకు వెగటు కల్గింది. అవన్నీ అల్పసుఖాలను అందించేవే. భారతంలో బాదరాయణుడు-వ్యాసుడు ప్రాసంగికంగా పురుషోత్తముని పుణ్యకథలు ప్రస్తుతించినప్పుడు మాత్రం నా మది ఉబ్బితబ్బిబ్బై పోయేది.

మహాత్మా! కృష్ణ కథామృతం కళ్యాణాత్మకం, నిత్యనూతనం, సత్య సనాతనం. చెవులనే దోసిళ్లతో ఎంత జుర్రుకొన్నా తనివి తీరనిది. వన్నె తరుగనిది. విష్ణుకథా శ్రవణంతో విసుగు చెంది ‘ఇక వద్దు’ అనేవాడు శుద్ధ మొద్దు. 

మునివరా! నారాయణుని దివ్యనామ స్మరణానికి, భవ్య కథా శ్రవణానికి విముఖులైన వారు ఇహ-పరాలు రెంటికీ చెడి నరకంలో పడిపోతారు. వారిని కన్నప్పుడల్లా నా మనస్సుకి మిక్కిలి కష్టమనిపిస్తుంది. గురువర్యా! గతంలో చేసిన పాపాలే కథా శ్రవణ విముఖత్వానికి కారణం. మహాపాపాలకు పాల్పడిన నరులకు భాగవత జ్ఞానయజ్ఞం ‘న రోచతే’- రుచించదు.‘శ్రవణేచ్ఛా తు పుణ్యైర్వినా నోత్పద్యతే’- పుణ్యం లేక శ్రవణేచ్ఛ పుట్టదు.

మహాశయా! మైత్రేయా! మందారాది పుష్పాలలోని మకరందాన్ని మృదు మధురంగా ఆస్వాదించే మధుపం-తుమ్మెద వలె నేను కూడా ఆర్తజన బాంధవుడు, అనంత బ్రహ్మాండాలకు కర్త-భర్త-సంహర్త, అవతార పురుషుడు అయిన అచ్యుత భగవానుని అనంత కళ్యాణగుణ కీర్తనమనే అమృతాన్ని తనివి తీరా త్రాగాలని తహతహ లాడుతున్నా. అనుగ్రహించు స్వామీ! మహాత్మా! మునివర్యా! తమవంటి భాగవతోత్తముల సాంగత్యం దుర్లభం, అగమ్యం, అమోఘం! సంసారంలో మానవులు మాయకు లోబడి మాయాపతి మాధవునికి ఎడమయ్యారు. తమో గుణ ప్రాబల్యం వల్ల అధర్మాన్ని ధర్మంగా పొరబడి అందులోనే పొరలుతున్నారు. అధర్మం వల్ల దుఃఖం గాక సుఖం కలుగుతుందా? సుఖ ఆభాసే- ప్రతిబింబ సుఖమే కాని వాస్తవమైన (బింబరూప) సుఖప్రాప్తి వారికి లేదు. వారి సుఖం భోగానుభవ సమయంలో అమృతప్రాయం అనిపించినా పరిణామంలో- అనంతర కాలంలో విషప్రాయమవుతుంది.

భగవత్తత్త జ్ఞానం, భగవత్‌ ప్రేమ లేని యెడల జీవులకు సుఖం కలుగదు. స్వామీ! నాకిలా సూత్రప్రాయంగా మాత్రమే తెలుసు. దయచేసి దీనిని వివరంగా, విశేషంగా వివరించమని ప్రార్థన.

మైత్రేయుడు విదురుణ్ణి చూచి మృదు మధురమైన మాటలతో ఇలా ముచ్చటించాడు- ఓ పుణ్యాత్ముడా! నీవు వీనుల విందుగా విష్ణుకథలు వినాలన్న ఆసక్తితో నన్ను అడిగావు. నువ్వు భగవద్భక్తుడవు కాన హరికథాసక్తుడవు అగుటలో ఆశ్చర్యం లేదు. నీ ఆరాధ్య దైవమైన వాసుదేవుని కీర్తిని విస్తరింప చెయ్యాలని వాంఛిస్తున్నావు. వ్యాసవీర్యంతో ఉద్భవించిన సాక్షాత్‌ ధర్మదేవతవు. ద్వాదశ మహా భాగవతులలో ఒకడవు. ‘యచ్ఛ్రద్ధయా శ్రుతవత్యా చ భక్త్యా’- బుద్ధికి తోచిన భక్తి కాక శాస్త్ర, పురాణ ప్రోక్తమైన- పురాణాలు ప్రవచించిన భక్తి హృదయంలో కలిగితే దుఃఖం కూడా సుఖంగా తోస్తుంది. అందరిలో ఒకే అంతరాత్మను అవలోకించడమే-దర్శించడమే ఆరాధన! భగవంతుని గుణగానమే జిహ్వకు ఫలం; గుణానువాద శ్రవణమే చెవులకు ఫలం. విదురా! ఈశ్వరుని మాయ మహామోహిని-

‘ఆదిదేవుడు అచ్యుతుడు కూడా అపారమైన తన మాయా గతిని- వ్యవహారాన్ని, గమనించి గ్రహించలేక పోయాడంటే మాయావిని అయిన ఆ మహా మోహిని మహిమ అరవింద భవా (బ్రహ్మా)దులకు మాత్రం ఎలా అంతు పడుతుంది?’ అని అమాత్యుని అందమైన పై కంద పద్యానికి అర్థం. మాయ యొక్క అపరిమితమైన ప్రాబల్యం అవగాహనకు రావడమే ఇలా అనడంలోని అభిప్రాయం.

విదురుడు మరల ప్రశ్నించాడు- పరమర్షీ! పరమాత్మ చిన్మాత్రుడు కదా! చిన్మాత్రుడు సాక్షి గనుక వికార రహితుడు. వికారవంతమైంది సాక్షి కాలేదు. జ్ఞానమాత్రుడైన పరమాత్మ నిర్వికారి- పరిణామ హీనుడు, నిర్గుణుడు- ఆయనలో విషయం కాని, ఇంద్రియం కాని, వృత్తి కాని, అంతఃకరణం కాని, త్రిగుణాత్మక ప్రకృతి కాని ఇవేవీ ఉండవు. అలాంటప్పుడు ఆయన ఈ జగత్తుని ఎలా నిర్మిస్తాడు? మాయకు అతీతుడైన వానికి మాయా స్పర్శ ఏమిటి? శుద్ధ చైతన్యానికి మాయా సంబంధం ఎలా కలుగుతుంది? సృష్టిని కృష్ణుని క్రీడ- ఆటగా భావిస్తే ఆట బాలుర పని కదా! కేశవునికి క్రీడ ఏమిటి? అందరిలో ఒకే ఆత్మ ఉంటే ఈ సుఖదుఃఖాల హెచ్చుతగ్గులు ఎలా వచ్చినవి? 

మైత్రేయుడు- విదురా! సర్వనియంత, సర్వదా ముక్త స్వరూపుడైన భగవంతుడు దీనుడై బంధనం పొందుట యుక్తి విరుద్ధం. కాని, ‘సేయం భగవతో మాయా’- నిజానికి ఇదే భగవంతుని మాయ! ఇది ఏ తర్కానికి లొంగదు. అన్ని తర్కాలను ఎత్తి అవతల పారేస్తుంది! అసలు తర్కానికి అర్థం కానిదే మాయ- ‘యన్నయేన విరుధ్యతే’. ఇది ‘మాయ’కు చక్కని చిక్కని నిర్వచనం. స్వప్న ద్రష్టకి స్వప్న దృశ్యాలు తనకంటే అన్యంగా- ఇతరంగా తెలుస్తాయి. నిజానికి మనసే ద్రష్టగాను, దృశ్యంగాను వ్యవహరిస్తుంది. నిద్రా దోషం వల్ల కలలో కన్పించే మాయ ఇదే! తల తెగినట్లు కల కంటాం. తల తెగితే దాన్ని కనే వాడెవడు? నీ తల లేకపోయినా నువ్వయితే ఉన్నావు గదా! తర్కిస్తే తల తెగడం నిలవదు. కాని, తెగినట్లు కన్పిస్తోందిగా! ఇదే మాయ! 

అయితే, కలలో ఉన్నంత కాలం జీవుడు పడే చిక్కులు, బాధలు జీవుడుగా ఉన్న భగవంతునికి మాత్రం ఎందుకు కలగవు? అంటే, జలం కదిలి ప్రతిబింబం కదిలినా ఆకాశంలోని చంద్రబింబం కదలదు కదా! అలాగే, సర్వజీవుల శరీరధర్మాలు కలిగి క్రీడించే ఈశ్వరునికి కర్మబంధాలు ఏ మాత్రం అంటవు. మాయ సత్‌ కాదు. అసత్‌ కూడా కాదు. ఇక్కడ తర్కం పని చెయ్యదు. ఉన్నదాన్ని కన్పించనీయకుండా లేనిదాన్ని చూపించేదే మాయ! మాయలో ఉంటూ ఎన్ని ప్రశ్నలు సంధించినా సమాధానాలు సాధించలేము. పరమాత్మ తత్తం తెలిస్తే మాయ తొలగిపోతుంది- ‘ప్రబోధాత్‌ స్వప్న కర్మవత్‌'- మెలకువ వస్తే కల కల్ల అయిపోయినట్లు!

క.‘శ్రీవనితాధిప నామ కథా విముఖుల కిహము బరము దవ్వై పిదపం బోవుదురు నరకమునకున్‌వావిరి నే వారి జూచి వగతు మునీంద్రా!’-

చ.‘మృదుగతి బువ్వు దేనియ రమించుచు బానము సేయబాఱు షట్పదమును బోలి యార్త జన బాంధవు విశ్వ భవ స్థితి వ్యయాస్పద మహితావ తారుడగు పంకరు హోదరు నిత్య మంగళప్రద గుణ కీర్తనామృతము బాయక గ్రోలెద జెప్పవే దయన్‌.’-

క.‘హరియుం దన మాయాగతి బరికించియు గానడయ్యె బరిమితి లేమిన్‌ మఱి మాయావిని మోహిని చరితము గను గొందురెట్లు చతురాస్యాదుల్‌.’-

‘ఉఛ్వాస’ పీల్చుకోండి, దేవుడు మీ సమీపానికి వస్తాడు. దానినలా పట్టి ఉంచండి, దేవుడు మీతోనే ఉంటాడు. ‘నిశ్వాస’ వదలండి, దేవుడిని మీరు అనుసరిస్తారు. దానినలా పట్టి ఉంచండి, దేవుడు మీతోనే ఉంటాడు!

- తిరుమలై కృష్ణమాచార్య

తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ

98668 36006 


VIDEOS

logo