శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Devotional - Feb 22, 2021 , 00:07:59

గెడ్డం, మీసాలు ఎందుకంటే?!

గెడ్డం, మీసాలు ఎందుకంటే?!

దేవుళ్ళకు గెడ్డం, మీసాలు ఉండవు. కానీ, మన ప్రాచీన ఋషులనుంచి ప్రస్తుత ఆధ్యాత్మిక చింతనాపరుల వరకు చాలామంది దృష్టిలో గెడ్డం ఒక ‘ఆధ్యాత్మిక ప్రతీక’గా మారింది. ఇందులో ఏమైనా తాత్త్వికత ఉన్నదా?

- దేవునూరి రాజేశ్వర్‌, గౌరారం

త్రిగుణాలైన సత్త్వ, రజ, స్తమో గుణాలకు అతీతంగా ఉండే దేవుళ్లకు మీసాలు గానీ, గెడ్డాలు గానీ ఉండవు. కేవలం రజస్తమో గుణాలను కలిగిన దైవ, రాక్షస గణాలకు మాత్రమే వీటిని పౌరుషానికి చిహ్నంగా అలంకరిస్తుంటారు. గెడ్డాన్ని వైరాగ్యానికి చిహ్నంగానూ ఎంచుతుంటారు. అందుకే, బైరాగులు, యోగులకూ ఇది విధిపూర్వక నియమం.  బ్రహ్మచర్య ఆశ్రమంలో ‘సంస్కారహీన శిరోరుహుండు ..’ (భాగవతం-సప్తమ: 421) అన్నారు. అంటే, ఎప్పటికప్పుడు పెరుగుతున్న తలవెంట్రుకలకు క్షౌరం, అందంగా దువ్వుకోవడం వంటివన్నీ ఇందులో చేయకూడదని. 

ఆజన్మ బ్రహ్మచారులై యోగులుగా మారిన ఆధ్యాత్మిక చింతనాపరులకు వారి జీవితాంతం వరకు ఇదే నియమం వర్తిస్తుంది. కనుక, గెడ్డం ఉండటం తప్పనిసరి. జీవితంలో గృహస్థాశ్రమం తర్వాతిదే వానప్రస్థం. తన వాళ్లందరినీ వదిలిపెట్టి అడవిలో ఆధ్యాత్మికంగా జీవితాన్ని గడపడాన్నే ‘వానప్రస్థం’ అంటారు. ఈ దశలో ‘నఖ, శ్మశ్రు, కేశ, తనూరుహంబులు ప్రసాధితంబులు జేయక జటిలుండై వసియించుచు..’ (భాగవతం-సప్తమ: 427) అన్నారు. అంటే, గోళ్లు, గెడ్డం మీసాలు, తలవెంట్రుకలను వేటినీ కత్తిరించుకోకుండా, అలంకరించుకోకుండా, జడలు గట్టిన వెంట్రుకలతో అలాగే గడపవలసిన జీవితమిది. భీష్ముడు ధర్మజునికి చెప్పిన వానప్రస్థాశ్రమ ధర్మనియమాలు కూడా ఇవే. 

ఇంద్రియములన్‌ మర్దించు నచ్చో జడల్‌

పూనుం దాపస శాస్త్రముల్‌ సదువు...  

- మహాభారతం (శాంతిపర్వం: 2-232)

వానప్రస్థానికి అనుబంధంగా ఉండేదే సన్న్యాసం. తనతోపాటు ఉన్న జీవిత భాగస్వామిని, ప్రాపంచిక విషయాలపైన ఆసక్తినీ వదిలిపెట్టాలి. నిష్కామిగా జీవితాన్ని గడుపుతూ, సౌందర్యాలంకరణలను వదిలేయాలి. ఎవరి చూపులకూ ఆకట్టుకోబడకుండా, వికారంగా ఉండాలనేవే సన్న్యాసాశ్రమ నియమాలు. గెడ్డమనేది అలంకరణ లేని రూపానికి వికారంగా కనిపించడానికొక సంకేతం. అందుకే, ఋషులనుండి ఇప్పటి కొందరు ఆధ్యాత్మికవేత్తల వరకూ ఇదొక ప్రతీకగా మారింది.

డా॥ శాస్ర్తుల రఘుపతి

94937 10552

VIDEOS

logo