శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Devotional - Feb 22, 2021 , 00:07:59

సకల విద్యాసాధన, ప్రకటనా శక్తి కోసం ... ఓం వద వద వాగ్వాదినీ స్వాహా!

సకల విద్యాసాధన, ప్రకటనా శక్తి కోసం ... ఓం వద వద వాగ్వాదినీ స్వాహా!

సరస్వతీ మహాభాగే విద్యే కమల లోచనే విద్యారూపే విశాలాక్షీ విద్యాం దేహి నమోస్తుతే ॥

‘విద్‌' అంటే తెలుసుకోదగిన జ్ఞానం. ఏ విషయాన్నైనా మనం తెలుసుకోవాలంటే దానిపైన వెలుగు పడాలి. అప్పుడే మనకు ఆ వస్తువు కనిపిస్తుంది. దానితో ఆ వస్తు పరిజ్ఞానం కలుగుతుంది. దాని లోతులు అర్థం కావాలంటే మన బుద్ధిలో సరైన వెలుగు పడాలి. ఫలితంగా మనం చూస్తున్న వస్తువులోని అంతరార్థాలు గోచరమవుతాయి. మూలవస్తువు అన్వేషణా కొనసాగుతుంది. ఈ జ్ఞానం ఏర్పడనంత కాలం మనం చీకట్లో ఉన్నట్లే. ఆధ్యాత్మిక శాస్ర్తాల ప్రకారం తెలుసుకోవలసింది ఒక్కటే. అదే ఆత్మ! అంటే, జ్ఞానం. అదే వెలుగు. ఈ వెలుగు వల్లనే మన మనస్సు, శరీరాలు వెలుగొందుతున్నాయి. కనిపిస్తున్నవన్నీ అవిద్యలే. వీటిని తెలుసుకోవాలన్నా మనకు ‘విద్య’ అవసరం. కాంతి స్వరూపమైన, నిరంతరం శ్వేత వస్ర్తాలు, ఆభరణాలు, ఆసన వాహనాలతో వెలిగిపోయే సరస్వతీదేవి ఈ విద్యలన్నిటికీ అధిష్ఠాన దేవత. ఆమె ఆరాధనతోనే అన్ని జ్ఞానాలనూ పొందగలం.

ఇందుకు ‘సరస్వతీ ఉపాసన’ అత్యంత శ్రేయోదాయకం. లౌకిక విద్యలను పొందడానికీ అమ్మవారి ఉపాసనే కావాలి. పారమార్థిక విద్యల సముపార్జనకూ ఆ అమ్మవారి ఆశీస్సులే శిరోధార్యం. కాంతి రూపమైన సరస్వతీ ప్రార్థనవల్ల సకల జ్ఞానాలూ సిద్ధిస్తాయి.

జ్ఞానం తర్వాత వ్యక్తీకరణకూడా చాలా ముఖ్యం. జ్ఞానం లేకుండా ఎంత మాట్లాడినా, జ్ఞానం ఉండీ వ్యక్తీకరణ లేకున్నా లాభం ఉండదు. సరైన విధంగా వ్యక్తం కావాలన్నా, జ్ఞానాన్ని పంచాలన్నా వాక్కులకు అధిదేవత అయిన వాణీదేవిని అర్చించాల్సిందే. ఆ సరస్వతియే వాగ్దేవతా రూపంలో వ్యక్తమవుతుంది. గీర్వాణి, వాణి, వాగ్దేవిని తమకున్న జ్ఞాన వ్యక్తీకరణకోసం ఉపాసించాలి. ఈ ఉపాసనా మంత్రమే ‘ఓం వద వద వాగ్వాదిన్యై స్వాహా’. దీనిని నిరంతరం లేదా కనీసం సూర్యోదయ కాలంలో ఒక గంటపాటు కళ్ళు మూసుకుని, సూర్యుని వెలుగును ధ్యానిస్తూ ఉపాసించిన వారికి ఆ వాగ్దేవత అనేక సంపదల రూపంలో తప్పక అనుగ్రహిస్తుంది.

సాగి ,కమలాకరశర్మ

VIDEOS

logo